సయోధ్య సాధ్యమేనా?
రామ జన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాన్ని కోర్టు వెలుపల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చేసిన సూచనతో ఆ వివాదం మరో మలుపు తిరిగింది. తొలిసారి 1885లో ఈ వివాదం కోర్టు మెట్లెక్కగా ఆనాటినుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. అది యాజమాన్య హక్కులకు సంబంధించిందో, వారసత్వ హక్కులకు సంబంధించిందో అయితే పరిష్కారం ఎప్పుడో సాధ్యమయ్యేది. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు బృందాల మధ్యనో కొనసాగుతుంటే... ఎవరో ఒకరు చొరవ తీసుకుని మధ్య వర్తిత్వం వహించడం సాధ్యమయ్యేది. అంతా చక్కబడేది. కానీ ఈ వివాదం రెండు ప్రధాన వర్గాల విశ్వాసాలతో ముడిపడిపడి ఉంది. ఆ విశ్వాసాల చుట్టూ కోట్లాది మంది ప్రజల భావోద్వేగాలు అల్లుకుని ఉన్నాయి. అవి తరచుగా కట్టుదాటి ఉద్రిక్త తలకు దారి తీస్తున్నాయి. కొన్ని సంస్థలు వాటికి ఆజ్యం పోస్తున్నాయి. రాజకీయ పక్షాలు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే, దేశంలోనే అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు చొరవ తీసుకుని ఉంటే ఇప్పటికే దీనికొక పరిష్కారం సాధ్యమయ్యే దేమో! కానీ అది జరగకపోగా ఇరు వర్గాల్లోనూ ఉన్న భావోద్వేగాలను సొమ్ము చేసుకునే ధోరణులు పెరిగిపోయాయి. సమస్య మరింత జటిలంగా మారింది.
సుప్రీంకోర్టు సూచనపై వివిధ పక్షాల స్పందన గమనిస్తేనే సమస్య ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. బీజేపీ ఈ సూచనను స్వాగతించింది. ఇరు పక్షాల మధ్యా చర్చలే ఉత్తమమని తెలిపింది. కాంగ్రెస్ అభిప్రాయం కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. కానీ బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘం(బీఎంఏసీ)తో సహా వివిధ ముస్లిం సంస్థలు మాత్రం ఈ సూచన విషయంలో నిర్లిప్తంగానే మాట్లా డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి తాము సుముఖమం టూనే కోర్టు వెలుపల పరిష్కారం మాత్రం కుదరనిపని అని బీఎంఏసీ తేల్చి చెప్పింది. మధ్యవర్తిత్వం వహించడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ సిద్ధపడే అవకాశం లేదు. వివాద పరిష్కారానికి మధ్యవర్తులను ఎంచు కుంటే వారి మధ్య జరిగే చర్చల్లో తాను, తన సహచరుల సహకారం ఉంటుందని మాత్రమే ఆయన చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు సుప్రీంకోర్టు సూచనకు ఎందుకు సుముఖంగా ఉన్నాయో, ముస్లిం సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో సుస్పష్టం. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ అధికారంలో ఉన్నది కనుక వివాదం రామ జన్మభూమికి అనుకూలంగా పరిష్కారమవుతుందని ముస్లిం సంస్థలు భావిస్తున్నాయి. అందువల్లే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమే యం ఉండి, కోర్టు పరిధిలో పరిష్కారాన్ని అన్వేషిస్తేనే చర్చలకు సిద్ధపడతామని బాబ్రీ కమిటీ అంటోంది.
నిజానికి సుప్రీంకోర్టు చేసిన చర్చల ప్రతిపాదన కొత్తదేం కాదు. చంద్రశేఖర్, పీవీ నరసింహారావు ప్రధానులుగా పనిచేసినప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. వాటికి ముందు 1986లో కంచి కామకోటి పీఠాధిపతి, ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అలీ మియాన్ నద్వీల మధ్య చర్చలు జరిగాయి. ఈలోగా ఆ అధికారం వారికెక్కడిదంటూ రెండు వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈలోగా చర్చలే విఫలమయ్యాయి. 1989 సార్వత్రిక ఎన్నికల తర్వాత మధు దండావతే నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ హిందూ, ముస్లిం నేతల మధ్య ముఖాముఖి చర్చలు సాగేందుకు కృషి చేసింది. పర్యవసానంగా చంద్రశేఖర్ ప్రభుత్వం బాబ్రీ ఉద్యమ సమన్వయ సంఘం(బీఎంఎంసీసీ)కి, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ)కి మధ్య చర్చలు ఏర్పాటుచేసింది. తమనూ పిలవాలంటూ మరో సంస్థ బీఎంఏసీ పేచీకి దిగింది. దాంతో చర్చలే ఆగిపోయాయి. బీఎంఎంసీసీ చంద్రశేఖర్ వర్గంలోనివాడైన షాబుద్దీన్ నెలకొల్పిన సంస్థ అయితే...బీఎంఏసీ మాజీ ప్రధాని వీపీ సింగ్ సన్నిహితుడైన ఢిల్లీ జమా మసీదు ఇమాం బుఖారీ కనుసన్నల్లో నడిచేది. రెండు ముస్లిం సంస్థల మధ్య నెలకొన్న వైరానికి ఆ ఇద్దరి నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలే కారణమని వేరే చెప్పనవసరం లేదు.
1990లో ఈ పరిస్థితి తిరగబడింది. ఈసారి బీఎంఏసీ, వీహెచ్‌పీల మధ్య చర్చలకు రంగం సిద్ధం చేస్తే బీఎంఎంసీసీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కొన్నాళ్లపాటు ఈ చర్చల తంతు నడిచింది. తమ తమ వాదనలకు మద్దతుగా రెండు సంస్థల ప్రతినిధులూ వివిధ పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఎవరూ మెట్టు దిగడానికి సిద్ధం కాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఒకవేళ బీఎంఏసీ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా బీఎంఎంసీసీ గట్టిగా ప్రతిఘటించేది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల ప్రదేశాన్ని కక్షిదారులైన రాంలాలా పక్షానికీ, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖాడాలకూ సమంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ అది చట్టం, సాక్ష్యాధారాలనుబట్టి కాక విశ్వాసాలకూ, సామరస్యానికీ ప్రాధాన్యమిస్తూ వెలువరించిన తీర్పు. కక్షిదారులు అడగకుండానే పంపకాలు చేయడానికి మీరెవరని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును ప్రశ్నించడమే కాక...యథాతథ స్థితి కొనసాగించమని ఆదేశించింది.
వీటన్నిటినీ గమనించాక పరిష్కారం ఎంత జటిలమైనదో అర్ధమవుతుంది. నిజానికి సుప్రీంకోర్టు ముందున్న సమస్యల్లా వివాదాస్పద ప్రాంతం హక్కుదారు ఎవరన్నదే. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు కట్టుబడతామని... అందుకు ఎంతకాలమైనా ఎదురుచూస్తామని ముందుగా ఇరుపక్షాలూ రాత పూర్వకంగా చెబితే ఆ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే చర్చలే శరణ్యం. 13 అఖాడాలకు నేతృత్వంవహిస్తున్న అఖిల భారతీయ అఖాడా పరిషత్ చేసిన ప్రకటన ఈ సందర్భంలో ఎన్నదగినది. రాజకీయ పక్షాలు ఈ వివాదానికి దూరంగా ఉంటేనే చర్చలు ఫలిస్తాయని... ఏకాభిప్రాయం తర్వాతే వివాదాస్పద ప్రాంతంలో ఏ నిర్మాణమైనా చేపట్టాలని అది చెబుతోంది. అన్ని పక్షాలూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటే... పరిణతితో, బాధ్యతతో వ్యవహరిస్తే సామరస్యపూర్వక పరిష్కారం సాధ్యమవుతుంది. అది ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచుతుంది.