మాటల గారడీతో బురిడీ | Tax subsidies are not plays vital role in growth rate | Sakshi
Sakshi News home page

మాటల గారడీతో బురిడీ

Published Fri, Feb 19 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

మాటల గారడీతో బురిడీ

మాటల గారడీతో బురిడీ

విశ్లేషణ
వంట గ్యాస్ సబ్సిడీ రూ. 48 కోట్లతో ఏడాదిపాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించ వచ్చని ఒక ఆర్థికవేత్త అన్నారు. అలాగైతే కార్పొరేట్ రంగానికి పన్నుల రాయితీలుగా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించి, గత చరిత్రగా మార్చేయొచ్చుగా? అంటే, ఆ రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు. కానీ ఈ రాయితీలు వృద్ధిపై ప్రభావం చూపిన దాఖలాలే లేకుండా విఫలమయ్యాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోయినట్టు? పదే పదే అడుగుతున్నా... భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు.

అవునండీ, ప్రధాన మంత్రి గారూ! మీరన్నది అక్షరాలా నిజం. ఇదంతా మాటల గారడీయే. పేదలకిచ్చే ఆర్థిక సహాయాన్ని సబ్సిడీలంటారు. సంపన్నులకు... భూమి, సహజ వనరులను కారు చౌకకు సునాయాసంగా కట్టబెట్టేయడం, పన్నుల రాయితీలు, పన్నుల సెలవులు వంటి కొండవీటి చాంతాడంతటి భారీ రాయితీల జాబితాను వృద్ధికి ప్రోత్సాహకం అంటారు. పేదలకిచ్చే సబ్సిడీ  అనే పదమే ఇప్పుడు గొప్ప తప్పుగా  మారిపోయింది.

వృద్ధి పేరిట పన్ను రాయితీల దగా  
ఆర్థిక చింతనను అతి తెలివిగా వక్రీకరించి, ఉద్దేశపూర్వకంగా పదాలను ఎంచుకుని వల్లె వేయడం బహిరంగ చర్చలో భాగమై పోయే స్థాయికి నేడు చేరింది. ఈ పదాల గారడీ ఆర్థిక అంతరాలు మరింత అధ్వానంగా విస్తరిం చడానికి దారి తీస్తోంది. సంపన్నులకు, పలుకుబడిగలవారికి తరచుగా ఇస్తుండే విపరీతమని అనిపించేటంతటి భారీ సబ్సిడీలే బహుశా నేటి ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభానికి అసలు పునాదులు కావచ్చు. ఆ సబ్సిడీలను కప్పిపుచ్చడానికి తగ్గ పదజాలాన్నే ఎంచుకుంటున్నారు.

ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలెవరూ ఈ విషయాన్ని ఎన్నడూ ప్రశ్నించకపోవడమే విషాదం. వారికీ విషయం తెలుసు. అయినా మౌనం దాల్చారు.
‘‘ఎరువుల సబ్సిడీలను ‘వ్యవసాయ ఉత్పత్తికి ప్రోత్సాహకం’గా పునర్నామకరణం చేస్తే కొందరు నిపుణులు వాటిని విభిన్నంగా చూడవచ్చా? అని నాకు ఆశ్చర్యం కలుగుతోంది’’ అని ప్రధాని అన్నారు. ఆయన సరిగ్గా సరైన విషయమే చెప్పారు. సరిగ్గా నేనీ విషయాన్నే చాలా కాలంగా చెబుతున్నాను. ఇది పదాల గారడీ కాకపోతే... 2004-05 నుంచి మన కార్పొరేట్ రంగానికి రూ. 42 లక్షల కోట్ల పన్ను రాయితీలను ఇవ్వడాన్ని వృద్ధికి ప్రోత్సాహకమని ఎలా అంటారు? (సంపన్నుల కిచ్చే ఈ భారీ సబ్సిడీలను బడ్జెట్ డాక్యుమెంట్లలో ‘ముందస్తుగా వదులుకున్న రాబడులు’ అని చూపుతారు.) దేశ జనాభాలో 67 శాతం ఆకలిని తీరుస్తుందని భావిస్తున్న ఆహార భద్రతా కార్యక్రమానికి ఖర్చయ్యే రూ. 1.25 లక్షల కోట్లు వృథా సబ్సిడీ అని ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందుకు గగ్గోలు పెడతారు? ఈ విషయాన్ని మీరూ గమనించే ఉంటారు. పలు టీవీ చర్చల్లో నేనీ ప్రశ్నను లేవనెత్తినప్పుడల్లా నన్ను విస్మరించడమే జరగుతోంది.

విఫలమైన కార్పొరేట్ రాయితీలు
నాకింకా గుర్తుంది. ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీతో జరిగిన ఒక బడ్జెట్ పూర్వ సమావేశాల్లో పన్ను రాయితీలను ఉపసంహరించుకోవాలని సూచించాను (అప్పట్లో అవి ఒక్క ఏడాదికే  రూ. 5.24 లక్షల కోట్లుగా ఉన్నాయి). అవి దేశ అర్థిక వనరులను ఖాళీ చేసే భారీ కంత అని వివరించాను. కాగా, ఈ భారీ రాయితీలను ప్రజల కంటపడకుండా చేస్తున్న ‘ముందస్తుగానే వదులుకున్న రాబడులు’ పద్దును బడ్టెట్ పత్రాల నుంచి తొలగించాలని  ప్రధాన స్రవంతికి చెందిన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక మంత్రిని కోరేంత వరకూ వెళ్లారు.  

గ్యాస్ సబ్సిడీతో పేదరిక నిర్మూలన?
ఈ విషయాన్ని పరిశీలించండి. వంట గ్యాసు (ఎల్‌పీజీ) సబ్సిడీని వృథా సబ్సిడీ అంటూ గగ్గోలు పెట్టారు. దానిలో చాలా వరకు సంపన్న వర్గాలకు  చేరేదే. వారి సబ్సిడీని ఉపసంహరించుకోవాల్సిందే. ఏటా దేశం వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీల కోసం రూ. 48 కోట్లు ఖర్చు చేస్తోందని, ఒక ఏడాది పాటూ దేశంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి అది సరిపోతుందని ఒక ఆర్థిక శాస్త్రవేత్త రాయడం నాకు గుర్తుంది. ఆయన మొత్తంగా ఆ సబ్సిడీ రద్దును కోరారు. రూ. 48 కోట్ల వంట గ్యాస్ సబ్సిడీతో ఏడాది పాటూ పేదరి కాన్ని నిర్మూలించగలిగితే, పన్నుల రాయితీల రూపేణా ఇస్తున్న రూ. 42 లక్షల కోట్లతో 84 ఏళ్ల పాటూ దేశ పేదరికాన్ని నిర్మూలించవచ్చని, పేదరికం కచ్చితంగా గత చరిత్రగా మారిపోతుందని నేను బదులు రాశాను. కార్పొరేట్ రంగానికి ఇస్తున్న పన్ను రాయితీలు ‘వృద్ధికి ప్రోత్సాహకం’ అన్నారు.

ఈ భారీ పన్ను రాయితీలు, మూడేళ్ల బడ్జెట్ పూర్తి వ్యయానికి సరిపోతాయి. పైగా ఈ రాయితీలు ఆశించిన ఫలితాలను సాధించడంలో విఫలమయ్యాయి. దేశంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఉద్యోగాలు లేని వృద్ధి. ఉపాధి కల్పన నిరాశాజనకంగా, పారిశ్రామిక వృద్ధి మందకొడిగా ఉండగా, వస్తుతయారీ వృద్ధి రుణాత్మకంగా మారింది. ఎగుమతులు పుంజుకోవడంలో విఫలమయ్యాయి. వృద్ధికి ఇస్తున్న ప్రోత్సాహకాలు ఎలాంటి ప్రభావాన్ని కలిగించిన దాఖలాలే కనబడకుండా విఫలమైతే, ఆ డబ్బు అంతా ఎక్కడికి పోయినట్టు? అనే ప్రశ్నను నేను పదే పదే అడుగుతూనే ఉన్నాను. సమా దానం మాత్రం నేటికీ రాలేదు. నీతి ఆయోగ్ ఎన్నడూ దీన్ని ప్రశ్నించినదీ లేదు. ముఖ్య ఆర్థిక సలహాదారు ఈ విషయాన్ని వేలెత్తి చూపినదీ లేదు. భీకర నిశ్శబ్దమే తప్ప సమాధానం రాదు.

దేశానికి దెబ్బ మీద దెబ్బ
‘‘ద్వంద్వ పన్నుల ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో రెట్టింపు పన్నుల ఎగవేతకు దారి తీస్తుంది’’ అని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య నాకు నచ్చింది. ఏటా ఇచ్చే పన్నుల రాయితీలలో ఇవి కూడా లెక్కకు రావు. మరో విధంగా చెప్పాలంటే, దేశానికి రెట్టింపు నష్టం వాటిల్లుతుంది. ఒక వంక ఈ పన్ను రాయితీల వల్ల ప్రభుత్వ రాబడికి నష్టం. మరోవంక ప్రధాని అన్నట్టు ‘‘స్టాక్ ఎక్స్చేంజ్‌లో వ్యాపారం జరిగే షేర్ల నుంచి లభించే డివిడెంట్లను (లాభాలు), దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్‌ను ఆర్జించేది పేదలు కాకున్నా వాటిపై ఆదాయపు పన్నుకు పూర్తి మినహాయింపు ఉంది. అది మినహాయింపే అయినా దాన్ని పన్ను రాయితీగా లెక్కించడంలేదు.’’
 ప్రధాని అన్నది అక్షర సత్యం. దేశానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

ఈ మాటల గారడీ ఇక్కడితో ముగిసేది కాదు. మీరో, నేనో  బ్యాంకు అప్పు చెల్లించలేకపోతే మనల్ని అపరాధులుగా లెక్కిస్తారు. మనం అప్పుచేసి కొన్న కారును  లేదా మనం కుదువ పెట్టిన ఆస్తిని బ్యాంకు లాక్కుంటుంది. లేదంటే ఆ డబ్బు రాబట్టుకోడానికి తప్పుడు పద్ధతులకైనా పాల్పడుతుంది. అదే సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు బ్యాంకు రుణం చెల్లించకపోతే. ఆ రుణాన్ని నాన్-పెర్ఫార్మింగ్ ఎస్సెట్స్ (ఎన్‌పీఏలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తులు) అంటారు. ఈ పద ప్రయోగంతో రెండు ప్రయోజనాలు. ఒకటి, తెలివిగా విభిన్న పదాలను ప్రయోగించడం ద్వారా పెద్ద పెద్ద నేరాలను ఎలా దాచిపెట్టేస్తారో సామాన్యునికి అర్థం కాదు. రెండు. ఈ కంపెనీల భౌతిక అస్తులను ఎన్నడూ స్వాధీనం చేసుకోరు. అందుకు బదులుగా వారి బాకీలను పునర్వ్యవస్థీకరిస్తారు.

సామాన్యుని సబ్సిడీకి మోదీ వత్తాసు
బ్యాంకుల క్రియాశీలంగా లేని ఆస్తులు కీలక స్థాయికి చేరాయి. కానీ ఏ టీవీ చర్చనైనా చూడండి... వాటి గురించి ఎప్పుడో గానీ ప్రస్తావనకు రాదు. 2008-09లో రైతుల రుణాలను రూ. 74 వేల కోట్ల మేరకు మాఫీ చేశారనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. భారీ రుణాలను బ్యాంకులు పునర్వ్యవస్థీకరించడం మాత్రం ప్రధాన మీడియాలో (బిజినెస్ చానల్స్ సహా) చర్చకు రావడం ఎన్నడూ చూసి ఎరుగను. కారణం సుస్పష్టమే. సంపన్నులు తమకిచ్చే సబ్సిడీలను కాపాడుకోవాలని కోరుకుంటారు. ప్రజలకు అర్థంకాని పదజాల ప్రయోగంతో వాటిని కప్పిపుచ్చడమే అందుకు అత్యుత్తమ మార్గం. ప్రధాన మంత్రి గారూ, ధన్యవాదాలు. ప్రధాన స్రవంతికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు, మీడియా అడుగిడటానికి భయపడే బాటన మీరు అడుగు పెట్టారు.
 ప్రధాని నరేంద్ర మోదీ సామాన్యుల సబ్సిడీలను సమర్థిస్తూ మాట్లాడారు. అది పూర్తిగా సరైనది.  
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
hunger55@gmail.com
దేవిందర్‌శర్మ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement