
చేనేతకు చేయూత జాతీయ అవసరం
సందర్భం
స్వాతంత్య్ర పోరాటంలో ‘స్వదేశీ’ ఒక ప్రధాన సాధనంగా ఏ విధంగా మారిందో, నేడు పేదరికంపై పోరాటానికి చేనేత రంగం సైతం ఒక సాధనం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేయడం చెప్పుకోదగినది. తల్లి ఇచ్చే ప్రేమానుబంధాలను ఖాదీ, చేనేత ఉత్పత్తులు కూడా కలిగిస్తా యని చెప్పారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటించాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం చెన్నైలో జరి పిన మొదటి చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. ప్రపంచంలో పర్యావరణం, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణల గురించిన ఆలోచనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో పర్యావరణ అనుకూ లమైన మన చేనేత ఉత్పత్తుల గురించి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నదని కూడా మోదీ సూచించారు.
వ్యవసాయం తరువాత దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ -చేనేత. దీనికి జీవం పోయడం ద్వారానే దేశ ఆర్థికాభివృద్ధి, సూపర్ పవర్‌గా ఎదుగుదల సాధ్యమవుతాయి. ఇదంతా గ్రామాలలోనే ఉండడంతో మన గ్రామీణ ఆర్థిక వికాసానికి చేనేత పట్టుగొమ్మ అని చెప్పవచ్చు. అయితే దశాబ్దాలుగా ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గుర యింది. దానితో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 15 ఏళ్లుగా చేనేత కార్మికుల సంఖ్య తగ్గుతున్న సంగతి ఆందోళన కలిగిస్తుంది. 1995 నాటి గణాంకాల ప్రకారం దేశంలో 65 లక్షల మగ్గాలు ఉండగా 2009-10 నాటికి 43.32 లక్షలకు తగ్గిపోయాయి. కోటి మందికి పైగా ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నారు. అనుబంధంగా కోట్ల మంది ఆధారపడి ఉన్నారు.
చేనేత వారిలో 45.18 శాతం మంది ఓబీ సీలు. ఎస్సీలు 10.13 శాతం, ఎస్టీలు 18.12 శాతం, ఇతరులు 26.57 శాతం ఉన్నారు. ఆ వర్గాలలో సుమారు 78 శాతం మహిళలకు ఇదే ఆధారం. వారిలో 87 శాతం మంది గ్రామీ ణులు. వీరందరిదీ దుర్భర జీవన స్థితి. 54 శాతం మంది కచ్చా ఇళ్ళలో (గుడిసెలు, రేకుల షెడ్‌లు) నివసిస్తున్నారు. 31 శాతం మం దికి పాక్షిక పక్కా గృహాలు ఉన్నాయి. 15 శాతం మంది మాత్రమే పక్కా గృహాలలో ఉంటు న్నారు. 9.7 శాతం మందికి మాత్రమే అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు ఉన్నాయి. 36.9 శాతం మందికి బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్నాయి. 34.5 శాతం మందికి ఏపీఎల్ రేషన్ కార్డులు ఉండగా, 18.9 శాతం మందికి అసలు రేషన్ కార్డులు లేవు. 29 శాతం చదువుకోనివారే. 12.7 శాతం మంది ప్రాథమిక విద్యను మధ్యలో ఆపివేయగా, 18.2 శాతం మంది ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. 22.9 శాతం మంది మాధ్యమిక పాఠశాల విద్యనూ పూర్తిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలలో వీరి సగటు ఆదాయం సంవత్సరానికి రూ.29,314గా ఉండగా, పట్టణ ప్రాంతాలలో రూ. 31 వేలు ఉంది. జాతీయస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 38,260, పట్టణ ప్రాంతాల్లో రూ. 33,038 సగటున ఉంది. కేవలం 14.4 శాతం మందికి మాత్రమే బ్యాంక్‌ల నుండి రుణాలు అందుతుండగా, 44.6 శాంతం మందికి మాస్టర్ వీవర్స్ నుండి, 13,4 శాతం మందికి వడ్డీ వ్యాపారుల నుండి రుణం లభిస్తున్నది.
చేనేత పనివారి సంఖ్య తగ్గుతున్నా ఉత్పత్తి మాత్రం పెరుగుతూనే ఉంది. దేశంలో మొత్తం ఉత్పత్తి అవుతున్న వస్త్రాలలో 14 శాతం, అంటే 6,900 మిలియన్ల చదరపు మీటర్ల వస్త్రాలను వీరే ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం జీడీపీలో వీరి వాటా 4 శాతంగా ఉంది. ఎగుమతులలో సహితం వీరి భాగస్వామ్యం గణనీయంగా ఉంది. కానీ ఈ రంగంలో వేతనాలు తక్కువగా ఉండడంతో చేనేత కార్మికులు ఇతర రంగాలకు వలస వెళ్లడం పెరుగుతున్నది. గృహ నిర్మాణం, దోభీలు, క్షురకులు వంటి ఇతర అసంఘటిత రంగా లలోని కార్మికులు చేనేత కార్మికుల కన్నా ఎక్కువగా వేతనాలు పొందుతున్నారు. వారికి రోజుకు కనీసం రూ. 250 నుండి రూ. 500 వరకు వేతనం లభిస్తున్నది. చేనేత వారికి మాత్రం రూ. 80 నుండి 100 మించి లభించడం లేదు. ఇంతటి కీలక ప్రాధాన్యం గల రంగానికి ప్రణాళికా పరంగా కేటాయింపులు కూడా అంతంత మాత్రమే. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన గల నరేంద్ర మోదీ ప్రభుత్వం చేనేతను పున రుజ్జీవింప చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇందుకోసం విసృ్తతమైన కృషి జరగాలి. విధానపరమైన నిర్ణయాలను అమలు పరచడంతో పాటు, తగు బడ్జెట్ కేటాయింపులు జరపాలి. కోటి మంది నమ్ముకున్న ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టమే. ఇది గమనించాలి.
ఆగస్టు 7 : జాతీయ చేనేత దినోత్సవం
(వ్యాసకర్త : టి.ఇంద్రసేనారెడ్డి గ్రామ వికాస భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు)
indrasena.reddy11@gmail.com