
వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌టీమ్ (ఫైల్)
విజయనగరం టౌన్ : వేసవి వచ్చిందంటే చాలు చాలామంది చల్లని గాలి కోసం ఇంటి బయట, డాబాలపై పడుకుంటారు. దీన్ని అదునుగా చేసుకుని దొంగలు తమ చేతులకు పని చెబుతుంటారు. ప్రధానంగా వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దొంగతనాలను నివారించాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. సాధారణ దొంగలతో పాటు ఇతర రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారాల పేరుతో జిల్లాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా పగలు ఇళ్లను పరిశీలించి రాత్రులు దొంగతనాలు చేస్తుంటారు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాలు, ఇళ్లకు తాళం వేసిన ఇళ్లు, మహిళలున్న ఇళ్లనే టార్గెట్ చేస్తుంటారు. వీరితో పాటు పార్థి గ్యాంగ్ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం.
దొంగతనాలకు పాల్పడే విధానాలు
అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేసి నగలు దోచుకోవడం..
నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లల్లో మూకుమ్మడి దొంగతనాలు చేస్తారు.
శరీరానికి ఒండ్రు మట్టి లేదా నూనె రాసుకుని మరీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు. పట్టుకోవాలన్నా అంత సులువుగా దొరకరు.
పగలు బిచ్చగాళ్లు లేదా కూలీలుగా నటిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రులు దొంగతనాలకు పాల్పడతారు.
కిటికీలు, తలుపులను బలవంతంగా తెరవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి కూడా చేస్తారు.వీరి వద్ద కత్తులు, రాడ్లు, తుపాకులు కూడా ఉంటాయి.- వీరు ఆలయాలను కూడా టార్గెట్ చేస్తారు.
ఇతర రాష్ట్రాల తెగలు
ఫాసే పార్థి అనే తెగకు చెందిన వారు మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇటీవల కాలంలో చిత్తూరు పోలీసులు వివిధ కాలనీల్లోని సీసీ పుటేజీలు పరిశీలించగా పార్థి గ్యాంగ్‌కు సంబంధించిన కదలికలు లభ్యమయ్యాయి. దీంతో అప్రమత్తమైన చిత్తూరు సీసీఎస్ పోలీసులు గ్యాంగ్‌ను పట్టుకునేందుకు గాలింపు మొదలు పెట్టారు. ఈ తెగకు చెందిన వారు 1999 నుంచి ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో దోపీడీలు చేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాలకు చెక్ పెట్టవచ్చు. ఉత్తరాంధ్రలో పార్థి, తెడ్డి గ్యాంగ్‌ల సంచరిస్తున్నట్లు అనుమానాలున్నాయి. దువ్వెనలు, ఫ్యాన్సీ వస్తువులు అమ్ముతున్నట్లు వచ్చి ఇళ్లను పరిశీలిస్తుంటారు. దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టిమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రజలెవరైనా ఊళ్లు వెళితే సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలి. అపరిచిత వ్యక్తులు కనబడితే 100కు సమాచారం ఇవ్వాలి.
–ఏఎస్ చక్రవర్తి, సీసీఎస్ డీఎస్పీ, విజయనగరం