దంతాలపల్లి(డోర్నకల్): అందరితో ఆడుతూ పాడాల్సిన ఓ బాలుడు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాడు. జన్యు లోపం అతడికి శాపమైంది. పొలుసుల చర్మం, దురదతో బాధపడుతున్నాడు. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని ఇక్తియోసిస్ వల్గారిస్ అని అంటారు. అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జబ్బు నయం కాలేదు. వైద్యం చేయించలేని స్థితిలో బాలుడి తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
దంతాలపల్లి మండల కేంద్రంలోని కక్కెర్ల మల్లయ్య, నిర్మల దంపతుల కుమారుడు రాంచరణ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కాగా, రాంచరణ్ పుట్టుకతోనే జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడు. చర్మం పొలుసులుగా మారి, దురదతో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాడు. రాంచరణ్ వయస్సు ఇప్పుడు పదేళ్లు. తల్లిదండ్రులు పదేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
పేదరికంలో మగ్గుతున్న కుటుంబం
రాంచరణ్‌ది పేద కుటుంబం. తండ్రి గీత కార్మికుడు, తల్లి రోజూ కూలి పని చేస్తుంది. బాలుడికి తల్లిదండ్రులు ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. జన్యు సంబంధ వ్యా««ధి ఉందని, ఒకవేళ చర్మ వ్యాధి నిపుణులను సంప్రదిస్తే మెరుగైన వైద్యంతో కొంత నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. డబ్బులు చెల్లించి మెరుగైన వైద్యం చేయించే ఆర్థిక స్థోమత వారికి లేదు. ఇప్పటివరకు వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. చికిత్స కోసం రూ.5 లక్షల వరకు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పారు.
కొడుకును చూడలేకపోతున్నం
తోటి పిల్లలు ఆడుకుంట ఉంటే మావోడు చర్మం బాగాలేక దురదతో ఇబ్బంది పడుతడు. చర్మం అంతా పాములెక్క అయి ఉంది. పుట్టినప్పటి నుంచి అన్ని ఆస్పత్రులు తిప్పినం. అయినా బాగుకాలే. డాక్టర్లు అదేదో పుట్టినప్పటి నుంచి ఉండే వ్యాధి అని చెప్పిండ్రు. పెద్ద డాక్టర్ల దగ్గర చూపెట్టాలని వాళ్లకు చూపెడితే కొంత నయం అయితదన్నరు. మేము కూలి చేసుకునేటోళ్లం. మాదగ్గర అంత డబ్బు లేదు. మా కొడుక్కి వైద్యం చేయించడానికి దాతలు ముందుకు రావాలి.
– నిర్మల, రాంచరణ్ తల్లి
ఇది ఇక్తియోసిస్ వల్గారిస్ వ్యాధి
బాలుడు రాంచరణ్‌కు సోకిన వ్యాధిని వైద్య పరి భాషలో ఇక్తియోసిస్ వల్గారిస్ అంటారు. అంటే జన్యుపరంగా చర్మానికి వచ్చిన వ్యాధి. దీని వలన చర్మం పొలుసులుగా మారి దురద వస్తుంది. దాదాపు ఇది పూర్తిగా నయం అయ్యే అవకాశాలు తక్కువ. చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించి మెరుగైన వైద్యం చేయిస్తే ఫలితం కనపడవచ్చు.
– డాక్టర్ అక్షయ్‌కుమార్, దంతాలపల్లి
ఆర్థిక సాయం చేసేవారు 9490899551 నంబర్‌ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment