
కాజీపేట: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు అమానవీయంగా ప్రవర్తించారు. పైసల కోసం పేగు బంధాన్ని మరిచారు. చనిపోతే తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి రక్షిస్తారనున్నకున్న కుమారులే కన్నతండ్రితో పాటు పినతల్లిని హత్య చేశారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కాజీపేట పరిధిలోని సోమిడి శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల బంధువుల కథనం ప్రకారం.. సోమిడి శివారులో నివాసముంటున్న సుంచు ఎల్లయ్య(72), ఎల్లమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలో ఎల్లయ్య రైల్వేలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాడు. 12 ఏళ్ల క్రితం భార్య ఎల్లమ్మ మృతి చెందడంతో హసన్‌పర్తికి చెందిన పూలమ్మ(60)ను రెండో వివాహం చేసుకున్నాడు.
మొదటి భార్య కుమారులు ముగ్గురు తరచూ ఎల్లయ్యతో ఆస్తి, పింఛన్ డబ్బుల కోసం గొడవపడుతుడేవారు. దీంతో అతడు సోమిడి శివారులో వేరొక ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే సోమిడిలో ఎకరం భూమిని ఎల్లయ్య ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి డెవలప్‌మెంట్ కోసం ఇచ్చాడు. భూమి అమ్మగా వచ్చిన డబ్బుల్లో ముగ్గురు కుమారులకు వాటా ఇవ్వడంతోపాటు తండ్రి వాటా తీసుకున్నాడు. పింఛన్ డబ్బులు తమకు ఇవ్వకపోవడమేగాక భూమి డబ్బుల్లో కూడా వాటా తీసుకోవడంతో కోపం పెంచుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వృద్ధ దంపతుల ఇంటి ఆవరణలో మాటు వేసి, పూలమ్మ బయటికి రాగానే గొడ్డళ్లు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లయ్యను హత్య చేశారు. ఉదయం పాలు పోయడం కోసం వచ్చిన మహిళ ఆరుబయట రక్తపు మడుగులో పడి ఉన్న పూలమ్మను చూడడంతో ఘటన వెలుగు చూసింది.
పథకం ప్రకారమే హత్య ?
మంగళవారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూమ్‌కు వెళ్లడానికి బయటకు వచ్చిన పూలమ్మపై నిందితులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే బెడ్‌రూంలో నిద్రిస్తున్న ఎల్లయ్యపై ఒక్కసారిగా దాడి చేసి కత్తులు, గొడ్డలితో నరికి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎల్లయ్య మృతదేహంపై దాదాపు 30కిపైగా కత్తిపోట్లు జల్లెడ పట్టినట్లుగా ఉన్నాయని బంధువులు తెలిపారు.
హత్య అనంతరం శివాలయంలో పూజలు ?
వృద్ధ దంపతులను హత్య చేసిన తర్వాత ఓ నిందితుడు కాజీపేటలోని శివాలయానికి వెళ్లి పూజలు చేసి వచ్చినట్లు తెలిసింది. ఏమి తెలియనట్లుగానే మృతదేహాల ముందుకు వచ్చి బోరున విలపించారు. తీరా వారే నిందితులని పోలీసులు గుర్తించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితుల ఇళ్లలో దుస్తులు పిండి ఉండడంతోపాటు దారి పొడవునా రక్తపు మరకలను అధికారులు గుర్తించారు. ఆస్తి కోసమే కుటుంబ సభ్యులు ఇద్దరిని హత్య చేశారని మృతురాలు పూలమ్మ తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.
నిందితుల జాడ చూపిన డాగ్‌స్క్వాడ్
సమాచారం అందుకున్న డీసీపీ వెంకట్రామ్‌రెడ్డి, ఏసీపీ సత్యనారాయణ, సీఐ అజయ్ క్లూస్ టీంతోపాటు జాగిలాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాగిలాలు మృతదేహాలను వాసన చూశాక నేరుగా హతుడి కుమారుల ఇళ్లతోపాటు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఆగిపోయాయి. పోలీసులు వెంటనే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment