సాక్షి ప్రతినిధి, వరంగల్ : వ్యయప్రయాసల కోర్చి పిల్లాపాపలతో మేడారం వస్తున్న భక్తులకు వనదేవతల దర్శనం దుర్లభంగా మారుతోంది. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, గద్దెలపై దేవతలకు మొక్కులు చెల్లించే విధానంలో స్పష్టమైన పద్ధతి లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీఐపీ, అధికారుల సిఫార్సుతో వచ్చే ఇతర కుటుంబాలు, స్నేహితుల స్పెషల్ దర్శనాలతో చిక్కులు ఎక్కువవుతున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి చేరింది. ఇలా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కల్పించే విషయంలో దేవాదాయశాఖ అధికారులు స్పష్టమైన ప్రణాళిక రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సిఫార్సులు..
భక్తుల రద్దీ ఎక్కువైతే గేట్లకు తాళం వేసి గద్దెలపైకి ప్రవేశాన్ని నిలిపివేస్తున్నారు. సాధారణ భక్తులు, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగులు దర్శ నం కోసం అడిగితే మా దగ్గర ఏమీ లేదు. పోలీసుల దగ్గరే గేట్ల తాళాలు ఉన్నాయంటూ దేవాదాయశాఖ సిబ్బంది సమాధానమిస్తున్నారు. దీంతో దూరం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే సమయంలో వీఐపీలు, ప్రభుత్వ అధికారుల బంధువులు, వారి సన్నిహితులు వస్తే గేట్లకు ఉన్న తాళం తీస్తూ గద్దెలపైకి అనుమతిస్తున్నారు. వీరితోపాటు గద్దెలపైకి చేరుకునేందుకు అక్కడున్న ఇతర భక్తులు ప్రయత్నిస్తున్నారు. దీంతో గద్దెల గేట్ల వద్ద తీవ్రమైన తోపులాట జరుగుతోంది. సిఫార్సు చేయించుకునే వారిని గద్దెలపైకి అనుమతించి, సాధారణ భక్తులను అనుమతించకపోవడంతో వాగ్వావాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఒక్కసారైనా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకునేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు ఈ నిరాదరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తే తమ పట్ల వివక్ష చూపారంటూ నిరాశ చెందుతున్నారు.
దాగుడుమూతలు
మేడారంలో రద్ధీ లేని రోజుల్లో ప్రధాన ప్రవేశ మార్గం గుండా భక్తులు గద్దెలపైకి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులు మొదట సమ్మక్క గద్దె మొదటి గేటు ద్వారా గద్దెలపైకి చేరుకుని మొక్కులు చెల్లించి రెండో గేటు గుండా బయటకు వస్తారు. అక్కడి నుంచి సారలమ్మ గద్దెకు మొదటి గేటు ద్వారా లోపలికి వెళ్లి దర్శనం చేసుకుని రెండో గేటు ద్వారా బయటకు వెళ్తారు. సెల వు రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లోకి చేరుకోవడంతో ప్రధాన ప్రవేశ మార్గాన్ని పూర్తిగా వీఐపీలకు కేటాయిం చారు. క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు ఒకటే గేటు ద్వారా లోపలికి వెళ్లడం, బయటకు రావడం కష్టంగా మారింది. ఎప్పుడో ఒకసారి వచ్చే వీఐపీ భక్తుల కోసం సమ్మక్క గద్దెకు సంబంధించి ఒక గేటు పూర్తిగా మూసివేయడంతో భక్తులు పాట్లు పడుతున్నారు.
ఇబ్బందులు
గద్దెలపై భక్తులు సమర్పించిన బంగారం, కొబ్బరి నీళ్లు కలిసి గద్దెల ప్రాంగణం తడిగా మారుతోంది. మొక్కు చెల్లించే బంగారాన్ని(బెల్లం) తలపై పెట్టుకుని తడిగా ఉన్న గ్రానైట్ ఫ్లోర్‌పై తీవ్రమైన తోపులాట మధ్య లోపలికి బయటికి వెళ్లడం కష్టంగా మారింది. వృద్ధులు, చిన్నపిల్లలను ఎత్తుకుని గద్దెలపైకి చేరే భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆదివాసీ వలంటీర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయకుండా వీఐపీ, అధికారుల బంధువులకు ఓ విధానం, సాధారణ భక్తులకు ఓ విధానం అమలు చేయడంతో భక్తులను అదుపు చేయడం కçష్టంగా ఉందంటున్నారు. గద్దెలపైకి భక్తులను అనుమతించే విషయంలో జనవరి 30 వరకు కచ్చితమైన విధానం అమలు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. దూరం నుంచి వచ్చే తమకు ప్రశాంతంగా దర్శనం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment