అఖిల (ఫైల్)
సాక్షి, సంగెం: క్షణికావేశంతో ఓ మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా..కాపాడబోయిన భర్త తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిన విషాద సంఘటన మండలంలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
మండలంలోని కాపులకనిపర్తి గ్రామానికి చెందిన సదిరం మమత అలియాస్ అఖిల(25) అదే గ్రామానికి చెందిన సదిరం అనిల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలు సైతం వీరి ప్రేమ అంగీకరించారు. సజావుగా సాగిన వీరి కాపురానికి గుర్తుగా కుమార్తె లాస్య(4), సిద్దార్థ(2)జన్మించారు. కూలీనాలీ చేసుకుని కుటుం బాన్ని పోషించుకుంటున్నారు. కొంత కాలంగా అఖిల మనస్సు స్థిమితంగా లేకుండా ఉంటోంది.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తతో గొడవ పడింది. క్షణికావేశానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పం చుకుంది. మంటల్లో కాలుతున్న అఖిల అరుపులు విన్న అనిల్ కాపాడే ప్రయత్నంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అఖిల 90 శాతం, అనిల్ 50 శాతం గాయపడగా ఇరువురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా అఖిల సోమవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి మృతి చెందింది.
అనిల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి కలకొట్ల రాజు ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.నాగరాజు తెలిపారు. చిన్నారులు లాస్య(4), సిద్దార్థ(2)లకు అసలు తమ తల్లితండ్రులకు ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి. తల్లి, తండ్రి ఎందుకు గొడవ పడ్డారో తెలియదు. ఎందుకు కాల్చుకుని గాయపడ్డారో కూడా తెలియదు.
తల్లి మృతి చెందిందని, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా తెలియని ఇద్దరు చిన్నారులను చూసిన స్థానికుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు. తల్లి మృతి చెందగా తండ్రి చావు బతుకుల మధ్య పోరాటం చేస్తుండడంతో ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు.
అనాథలుగా మిగిలిన చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment