కొవ్వూరు మండలం మద్దూరులో నిరసన దీక్ష చేస్తున్న వివాహిత ఉమామహేశ్వరి నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సిరిగినీడి రాజ్యలక్ష్మి
పశ్చిమగోదావరి, కొవ్వూరు రూరల్: కాపురానికి తీసుకువెళ్లాలని, తనకు న్యాయం కావాలని కోరుతూ కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో వివాహిత బండి ఉమామహేశ్వరి చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి బాధిత మహిళను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగతంగా బాధితురాలితో రాజ్యలక్ష్మి గంటకుపైగా మాట్లాడారు. ఉమామహేశ్వరికి అండగా నిలుస్తామని, ఆమె కాపురం నిలబెట్టడానికి కృషి చేస్తామని రాజ్యలక్ష్మి తెలిపారు.
భర్త పూర్ణ సుబ్బారావుతో పాటు అతని కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఆడపిల్ల అంటే ఆటబొమ్మలా ఉందని, ఉమామహేశ్వరి భర్త ప్రవర్తనను బట్టి ఉద్దేశపూర్వకంగానే ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుందన్నారు. సంఘటన వివరాలను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి దృష్టికి తీసుకువెళతానని, బాధితురాలికి అండగా ఉంటామన్నారు. కొవ్వూరు రూరల్ సీఐ శరత్ రాజ్‌కుమార్, ఎస్సై జానా సతీష్, తహసీల్దార్ కె.విజయకుమార్, ఐసీడీఎస్ సీడీసీఓ వైబీటీ సుందరి, ఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ గురుజు బాలమురళీకృష్ణ తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న మద్దతు
ఉమామహేశ్వరి నిరసన దీక్షకు మహిళా సంఘాల మద్దతు కొనసాగుతుంది. నిరసన శిబిరంలో జిల్లా దళిత హక్కుల పోరాట సమితి మహిళా కన్వీనర్ ఎండీ సలీమ, జిల్లా సామాజిక సమస్యల కమిటీ సభ్యురాలు బొరుసు సీతామహాలక్ష్మి, డ్వాక్రా సీఏలు బళ్ల లక్ష్మీమంగతా యారుతో పాటు పలువురు మహిళలు ఆమెకు మద్దతుగా నిరసన దీక్షలో కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment