
జర్మనీ : ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ బైక్ 'నెరా' రోడ్డుపై పరుగులు పెట్టింది. జర్మన్ 3డీ ప్రింటింగ్ దిగ్గజం బిగ్‌రెప్, నౌలబ్‌లు సంయుక్తంగా ఈ బైక్‌ను రూపొందించాయి. మోటార్ సైకిల్ విభాగంలో 3డీ టెక్నాలజీని తొలిసారిగా వాడటం విశేషం. ఈ బైక్ పేరు కూడా కొత్త శకానికి ప్రారంభం అనే అర్థం వచ్చేలా ‘న్యూ ఎరా’ (New Era) పదాల్లోని అక్షరాలతో (Nera) ‘నెరా’గా నామకరణం చేశారు. ఎలక్ట్రికల్ విడి భాగాలు, బ్యాటరీ తప్పితే బైకు మిగిలిన భాగాలైన టైర్లు, రీములు, ఫ్రేమ్, సీటు అన్ని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించారు. బైక్ బరువు 132 పౌండ్లు (సుమారు 60 కిలోలు) ఉంటుంది. గాలి లేని టైర్లు బైక్ స్పెషాలిటీ. కేవలం 12 వారాల్లోనే ఈ బైక్‌ను తయారు చేశారు.
సంప్రదాయ పద్దతుల్లో బైకుల తయారీ విధానాల్లో డిజైనర్లు, ఇంజినీర్ల పరిధి చాలా తక్కువ ఉండేదని, 3 డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సరికొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి అవకాశం ఉంటుందని బిగ్‌రెప్ సీఈఓ స్టీఫెన్ బేయర్ తెలిపారు. నెరా బైక్ డిజైనర్ మార్కో మట్టియా క్రిస్టోఫోరీ బైక్‌ను నడుపుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. సంస్థ 3డీ బైక్‌ను రూపొందించే సామర్థ్యం ఉందా లేదా అనే విషయాల్లో స్పష్టత కోసమే నేరాను తయారు చేయడంతో ఈ బైక్ వాణిజ్య పరమైన అంశాలపై పెద్దగా దృష్టిసారించలేదు. చాలా నెమ్మదిగా నడిచే ఈ బైక్‌ను అమ్మకాలకు పెట్టడం లేదని సంస్థ తెలిపింది. కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో అన్ని హంగులతో 3డీ బైక్‌లను తయారు చేస్తామని పేర్కొంది.
ప్రస్తుతం ప్రకటనల కోసమే తయారుచేశామని, రాబోయే రోజుల్లో ఈ బైక్స్ రోడ్డుపై పరుగులు పెడతాయని నౌలాబ్ సహవ్యవస్థాపకులు, ఎండీ డానియెల్ బనింగ్ తెలిపారు. తక్కువ పరిమాణంలో బైక్‌లు ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు సమయం, ఖర్చు తగ్గించుకోవడానికి ఈ 3డీ ప్రింటింగ్ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మోడల్ బైక్ విజయవంతమైతే సమీప భవిష్యత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ యావత్తు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ వైపు మళ్లుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment