18న తెరపైకి ఆగమ్
ఆగమ్ చిత్రం 18న తెరపైకి రానుంది. యువ నటుడు ఇర్ఫాన్ హీరోగా నటించిన చిత్రం ఇది. ఆయనకు జంటగా నటి దీక్షిత నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో జయప్రకాశ్, రియాజ్‌ఖాన్, విజయ ఆనంద్ శ్రీరామ్, రవిరాజా, అరుళ్, ఎస్.ప్రేమ్ నటించారు. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కోటేశ్వరరాజు, హేమారాజు నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ ఆనంద్ శ్రీరామ్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించారు. చిత్ర హీరో ఇర్ఫాన్ చిత్రం గురించి తెలుపుతూ తాను 12 ఏళ్లుగా నటిస్తున్నానన్నారు.
ఇన్నాళ్లుగా గుర్తింపు తెచ్చి పెట్టే పాత్ర కోసం ఎదురు చూస్తున్న తనకు ఆగమ్ చిత్రంతో లభించిందన్నారు. ఇందులో నటనకు అవకాశం ఉన్న చాలా బలమైన పాత్రను పోషించానని తెలిపారు. చిత్రంలో చాలా ముఖ్యమైన సామాజిక సమస్య గురించి చర్చించినట్లు వెల్లడించారు. కలామ్ కల అయిన 2020 విజన్‌ను తెరపై ఆవిష్కరించే చిత్రం ఆగమ్ అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో అవినీతి, మేధస్సు దోపిడీ అన్నారు.
మన యువత మేధస్సును విదేశీయుల ఎలా ఆకర్షించి దోచుకుంటున్నారన్న అంశాలను చిత్రంలో వివరించినట్లు చెప్పారు. మార్చి 18వ తేదీన ఒక చరిత్ర ఉందన్నారు. మహాత్మాగాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాట పట్టి ప్రపంచాన్ని తిరిగి చూసేలా చేసిన రోజు మార్చి 18 అని అలాంటి రోజున ఆగమ్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని ఇర్ఫాన్ అన్నారు. చిత్రం సందేశంతో కూడిన, కమర్షియల్ అంశాలతో జనరంజకంగా ఉంటుందని దర్శకుడు విజయ్ ఆనంద్ శ్రీరామ్ తెలియజేశారు. జిల్ జంగ్ జక్ చిత్రం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించారు.