రాజమండ్రి జైలు ఖైదీలకు పుష్కరభాగ్యం
రాజమండ్రి: గోదావరి మహాపుష్కరాల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని సుమారు 1500 మంది ఖైదీలు పుష్కర స్నానంతో పునీతులయ్యారు. ఏంటీ, వాళ్లంతా ఒకేసారి గోదావరికి వెళ్లి స్నానాలు చేశారని అనుకుంటున్నారా? కాదు.. మరెలా అంటే..
ఈ మహాపుష్కరాల సందర్భంగా అందరిలాగే ఖైదీలు కూడా గోదాట్లో స్నానం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు అధికారులకు ఓ వినతిపత్రం ఇచ్చారు. 500 మంది మహిళా ఖైదీలతో సహా సుమారు 1500 మంది ఖైదీలు తమకు పుష్కర స్నాన పుణ్యం ప్రసాదించమంటూ అర్జీ పెట్టుకున్నారు. అయితే వీరందరికీ భద్రత కల్పించడం కష్టమనే కారణంతో జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. దాంతో అహోబిలం మఠం వారు స్పందించారు. పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చి ఖైదీల మీద చిలకరించారు. అలా ఆ ఖైదీలంతా మహా పుష్కరాల్లో స్నానం చేసిన పుణ్య ఫలాన్ని దక్కించుకున్నారన్నమాట. కేవలం భద్రతా కారణాల రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని జైలు సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు.