గాలితో నడిచే బైక్
- రూ.50 వేల ఖర్చుతో తయారు
- కాలుష్యం లేదు..ఇంధన ఖర్చూ లేదు
- ఏవీఎన్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ
ఇబ్రహీంపట్నం రూరల్: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాందాస్పల్లిలోని ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ విద్యార్థులు. గాలితో నడిచే బైక్‌ను తయారు చేసి అబ్బురపరిచారు. కాలుష్యం లేని పొగ రాని వాహనాన్ని ఆవిష్కరించారు. మెకానికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఎం.భానుప్రకాష్ (కుంట్లూర్), ఎం.భరత్‌చారి (ఇబ్రహీంపట్నం), ఎస్.చక్రధర్(దండుమైలారం), ఎం.జగదీశ్(నాగోల్) ‘భాచాజా ఎకో’ అనే పేరుతో ద్విచక్ర వాహనాన్ని కనిపెట్టారు. ఇది వాతావరణంలో ఉండే గాలితో నడుస్తుంది.
సాధారణంగా అన్ని ద్విచక్ర వాహనా లకు ఫోర్‌స్ట్రోక్ ఇంజన్ ఉంటుంది. దీనినుంచి 2 స్ట్రోక్‌లు తీసేసి ఈ ఇంజన్‌ను తయారు చేశారు. దీనికి పిస్టిన్ అమర్చి, గ్యాస్కిట్ ద్వారా ఇంజన్‌కు గ్యాస్ సరఫరా చేస్తారు. పిస్టిన్ తిరగడం వల్ల బైక్ కదులుతుంది. 6 లీటర్ల సిలిండర్ ద్వారా 10–12 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. రూ.50 వేల ఖర్చుతో 2 నెలల్లో విద్యార్థులు ఈ బైక్‌ను తయారు చేశారు. వాతావరణ కాలుష్య నివారణ, తక్కువ ధర, ఎలాంటి ఖర్చులు లేని ఇంధనంతో నడవడం ఈ బైక్ ప్రత్యేకత. విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తాయి. రాబోయే రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో నూతన ఒరవడి సృష్టించడానికి తమ బృందం నాంది పలకనుందని వారు తెలిపారు.