ఉక్రెయిన్‌లో అదే విధ్వంసం
కీవ్: ఉక్రెయిన్‌పై దాడులను రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని పలు నగరాలు, పట్టణాలపై ఆదివారం మరింత భారీ స్థాయిలో క్షిపణి, బాంబు దాడులకు దిగింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని వినిటిసా నగరంలో విమానాశ్రయం రష్యా క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. కాల్పుల విరమణకు రెండు రోజుల వ్యవధిలో రెండోసారి రష్యా తూట్లు పొడిచింది.
రేవు పట్టణం మారియుపోల్, వోల్నోవఖా నగరాల నుంచి పౌరులు సురక్షితంగా తరలిపోయేందుకు వీలుగా కొద్ది గంటలు కాల్పులు ఆపుతామని ప్రకటించి, కాసేపటికే భారీ కాల్పులతో వాటిపైకి విరుచుకుపడింది. శనివారం కూడా రష్యా ఇలాగే మాటిచ్చి తప్పడం తెలిసిందే. కీవ్‌కు ఉత్తరాన ఉన్న చెర్నిహివ్‌లో 500 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత శక్తిమంతమైన ఎఫ్ఏబీ–500 బాంబులను జనావాసాలపై రష్యా ప్రయోగించింది.
దుర్భేద్యమైన కట్టడాలను పేల్చేసేందుకు సైనిక, పారిశ్రామిక లక్ష్యాలపై మాత్రమే వీటిని ప్రయోగిస్తుంటారు. ఖర్కీవ్‌లో అణు పదార్థాలు, రియాక్టర్ ఉన్న ఓ పరిశోధన సంస్థపై కూడా రష్యా రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. దాడుల్లో వాటికేమైనా అయితే భారీ వినాశనం తప్పదని ఆందోళన వెలిబుచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య సోమవారం మూడో రౌండ్ చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. యుద్ధం నేపథ్యంలో కనీసావసరాలు తీరక విపరీతమైన చలి, ఆహారం, తాగునీటి కొరతతో ఉక్రెయిన్‌వాసులు అల్లాడుతున్నారు. కీవ్ సమీపంలోని ఇర్పిన్ వద్ద వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పోలండ్, రొమేనియా, మాల్డోవా వైపు వెళ్లిపోతూ కన్పించా రు. వీరిలో పలువురు రష్యా తూటాలకు బలయ్యారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది!
ముప్పేట దాడిలో నగరాలు
మరోవైపు ఖర్కీవ్, చెర్నిహివ్తో పాటు కీవ్, మికోలేవ్, సమీ తదితర నగరాలను కూడా రష్యా సైన్యం పూర్తిగా చుట్టుముట్టి ముప్పేట దాడులు చేస్తోంది. వీటిని ఉక్రెయిన్ సైనికులు శాయశక్తులా అడ్డుకుంటున్నారు. కీవ్ పరిసరాల్లో కందకాలు తవ్వి, నానా వస్తువులతో రోడ్లను బ్లాక్ చేసి రష్యా సేనలను నిలువరిస్తున్నారు. అయినా నగరంపైకి రష్యా క్షిపణులు, బాంబులు నిరంతరం వచ్చి పడుతూనే ఉన్నాయి. పరిసర ప్రాంతాలు, గ్రామాలపై కూడా భారీగా దాడులు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా భారీ దాడి జరగవచ్చనే భయాల మధ్య జనం భారీగా రాజధాని వదిలి వెళ్లిపోతున్నారు. అయితే కీవ్ ముట్టడి కోసం కొద్ది రోజుల క్రితం బయల్దేరిన 64 కిలోమీటర్ల పొడవైన రష్యా పటాలం ఇప్పటికీ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయి ఉందని సమాచారం.
ఆదివారం మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ప్రతి నగరంలోనూ రష్యా సేనలపై దాడికి దిగాలని పౌరులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. వారిపై వీధి పోరాటాలకు దిగాలని సూచించారు. భారీగా సైన్యాలు దూసుకొస్తున్నా ప్రజలు ఉక్రెయిన్ సైనికులతో కలిసి వారిని ఎదుర్కొంటున్న తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నారు. స్టార్‌లింక్ సిస్టమ్ ద్వారా తమ దేశానికి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ రష్యా దుర్మార్గాన్ని బయటి ప్రపంచానికి చూపించేందుకు తోడ్పడుతున్న స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
...అప్పటిదాకా పోరే: పుతిన్
ప్రస్తుత పరిస్థితికి ఉక్రెయినే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించే దాకా యుద్ధం కొనసాగి తీరుతుందన్నారు. తీరు మారకపోతే ఉక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆదివారం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ పుతిన్‌తో గంటకు పైగా జరిగిన ఫోన్ చర్చల్లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలపైనా పుతిన్ మరోసారి మండిపడ్డారు. అవి తమపై యుద్ధం ప్రకటించడమేనన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెనెట్ ఆకస్మికంగా రష్యా వెళ్లి పుతిన్‌తో మూడు గంటల పాటు చర్చలు జరిపారు. తర్వాత జెలెన్స్కీతో కూడా ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్‌కు అమెరికా ఫైటర్ జెట్లు?
ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల మద్దతు కొనసాగుతూనే ఉంది. ఆయుధాలు, యుద్ధ పరికరాలతో పాటు సహాయ సామగ్రి దాకా భారీగా అందుతోంది. తమకు ఫైటర్ జెట్లు అందజేయాలన్న జెలెన్స్కీ విజ్ఞప్తిపై అమెరికా సానుకూలంగా స్పందిస్తోంది. ఈ విషయమై పోలండ్‌తో మాట్లాడుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్‌లో మరో అణు విద్యుత్కేంద్రాన్ని కూడా ఆక్రమించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నట్టు జెలెన్స్కీ ఆరోపించారు. వెంటనే ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటోకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో మాట్లాడారు.
ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస
బెర్లిన్: ఉక్రెయిన్ నుంచి ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని 15 లక్షల మంది వలస వెళ్లినట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత వేగంగా పెరిగిపోతున్న వలసల సంక్షోభం ఇదేనని తెలిపింది.
మీడియాపై రష్యా ఉక్కుపాదం
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడితో సొంత దేశంలో వెల్లువెత్తుతున్న నిరసన గళాల్ని రష్యాలో పుతిన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. న్యూస్ వెబ్సైట్లను బ్లాక్ చేస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా ఎవరైనా నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తోంది. ఆదివారం పలు స్వతంత్ర ఆన్లైన్ న్యూస్ వెబ్ సైట్లను రష్యా ప్రభుత్వం బ్లాక్ చేసింది. మరికొన్ని మీడియా సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి మూత పడేలా చేసింది. అలాంటి సంస్థల్లో అమెరికా నిధులతో నడుస్తున్న రేడియో ఫ్రీ యూరప్ కూడా ఉంది.
బెలారస్ ఉప రక్షణ మంత్రి రాజీనామా
కీవ్: బెలారస్ ఉప రక్షణ మంత్రి మేజర్ జనరల్ విక్టర్ గులేవిచ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ దురాక్రమణలో పాలుపంచుకోవడం ఇష్టంలేక పదవిని వీడుతున్నట్లు తెలిపారు. తన రాజీనామాను రక్షణమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. రష్యా బలగాలను తమ సరిహద్దుల్లో మోహరించడానికి అనుమతించినవారిలో గులేవిచ్ కూడా ఉన్నారు. ఆయనపై యూకే పలు ఆర్థిక ఆంక్షలు విధించింది.