సింహాలకు తొడ కొట్టొచ్చు!
ఆఫ్రికన్ సఫారీ
సఫారీకి ఆఫ్రికన్ల పేరు గేమింగ్. వేల ఎకరాల్లో విస్తరించిన ప్రయివేటు అరణ్యాలే గేమ్ లాడ్జ్‌లు. కనీసం 10-15 వేల ఎకరాల్లో ప్రైవేట్ అడవి. దాన్నిండా జంతువులు. దాన్లో ఓ ఐదెకరాల్లో చిన్న రిసార్ట్. జంతువులు రిసార్ట్‌లోకి రాకుండా కంచె. ఇదే గేమ్లాడ్జ్ స్వరూపం. దక్షిణాఫ్రికాతో పాటు అక్కడి జాంబియా, తూర్పు ఆఫ్రికన్ దేశాలైన టాంజానియా, కెన్యాల్లో గేమ్ లాడ్జ్‌లకు కొదవ లేదు. దక్షిణాఫ్రికాలో ప్రయివేటు గేమ్ లాడ్జ్‌లు ఎన్నున్నా... 20 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన క్రూగర్ నేషనల్ పార్క్‌దే ప్రత్యేక స్థానం. ఇక అక్కడికి వెళ్లటమంటూ జరిగితే... అందాల కేప్‌టౌన్ సిటీతో పాటు ప్రపంచ వింతల్లో ఒకటైన టేబుల్ మౌంటెయిన్, పెంగ్విన్స్ బీచ్, ప్రపంచ ప్రఖ్యాత సన్‌సిటీ వంటివి కూడా సందర్శించిన ఖాతాలో వేసేయొచ్చు.
సన్‌సిటీలో జిప్‌డ్రైవ్, మౌంటెయిన్ బైకింగ్... జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాల్సిన సాహసకార్యాలే.
అదే టాంజానియాకెళితే... గేమింగ్‌కు మక్కా లాంటి సెరెంగెటి నేషనల్ పార్క్‌తో పాటు కిలీమాంజారో పర్వతాలనూ చుట్టేయొచ్చు. పక్కనే ఉన్న కెన్యాలోనూ గేమ్ పార్క్లకైతే కరువేలేదు.
ఇవి చూడాలి సుమా!
* తమ దగ్గర ‘బిగ్ 5’ ఉన్నట్లు పలు గేమ్లాడ్జ్లు ప్రచారం చేసుకుంటాయి. అంటే... ఏనుగు, సింహం, పులి, బఫెలో, ఖడ్గమృగం ఉన్నట్లన్న మాట.
* గేమ్ పార్క్‌లలో దోమల బెడద ఎక్కువే. చాలా పార్క్‌లు తగు చర్యలు తీసుకుని తమది ‘మలేరియా లేని’ పార్క్‌గా చెబుతుంటాయి.
వెళ్ళేదెలా?
* దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నెస్‌బర్గ్‌కు దేశంలో ముంబై, ఢిల్లీలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నేరుగా విమానాలున్నాయి. కాకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరే విమానం ఢిల్లీ, ముంబైల్లో ఎక్కడో ఓ చోట ఆగుతుంది.
* కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే రెండువైపులా కలిపి ఒక వ్యక్తికి విమాన ఛార్జీలు రూ.40వేలు మించవు.
* ఆఫ్రికాలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ఒకరకంగా జొహన్నెస్‌బర్గ్ విమానాశ్రయం జంక్షన్లాంటిది. అక్కడి నుంచి ప్రతి ఆఫ్రికన్ దేశానికీ విమానాలుంటాయి.
* ఇక గేమ్ లాడ్జ్ ఛార్జీలనేవి అక్కడ మనం ఉండే రోజులు... రోజుకు ఎన్ని సార్లు గేమింగ్‌కు వెళతాం? అక్కడ ఏఏ సౌకర్యాల్ని ఆశిస్తాం అనేదానిపై ఆధారపడి ఉంటాయి.
* షూగర్ నేషనల్ పార్క్‌లో గేమింగ్ ఫుల్ డే అయితే ఒకరికి రూ.7,000 నుంచి, హాఫ్‌డే అయితే రూ.6,300 నుంచి మొదలవుతాయి.
* వసతి విషయానికొస్తే ఒకరికి రూ.3-4వేలలో మొదలయ్యే చిన్న కాటేజీల నుంచి రోజుకు రూ.లక్ష వసూలు చేసే హోటళ్లూ ఈ పార్క్‌లో ఉన్నాయి.
చేరుకునేదిలా...
* జొహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్టు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో క్రూగర్ నేషనల్ పార్క్ ఉంటుంది. సుమారు 4 గంటల ప్రయాణం. అలా కాదనుకున్నవారికి జొహన్నెస్‌బర్గ్ నుంచి క్రూగర్‌కు విమానాలు కూడా ఉన్నాయి.
* దక్షిణాఫ్రికా గేమింగ్‌ను ప్యాకేజీలో భాగంగా అందిస్తున్న ట్రావెల్ సంస్థలూ ఉన్నాయి.
ఏ సీజన్ బెటర్?
* నిజానికి ఏ నెల్లోనైనా దక్షిణాఫ్రికాకు వెళ్లొచ్చు. ఏప్రిల్ - అక్టోబరు మధ్య సీజన్‌ను అత్యుత్తమంగా చెబుతారు. నవంబరు - మార్చి మధ్య కాలం కూడా మరీ ప్రతికూలమైనదేమీ కాదు.
* జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉదయం- రాత్రి వేళల్లో కాస్త చలి బాగా ఉంటుంది. ఏప్రిల్-మే, సెప్టెంబరు-అక్టోబరు సమయం సమశీతోష్ణంతో ఉంటుంది.