లోక్‌పాల్ ఎంపిక ప్రక్రియ షురూ
పదవుల భర్తీకి దరఖాస్తులు కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: అవినీతి నిరోధక వ్యవస్థ అయిన లోక్‌పాల్ నియామక ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. లోక్‌పాల్ చైర్పర్సన్, 8 మంది సభ్యుల పదవుల భర్తీకి గాను అర్హుల నుంచి శనివారం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో నాలుగు జ్యుడీషియల్ పదవులు. అవి న్యాయ వ్యవస్థతో సంబంధమున్న వారికి రిజర్వయ్యాయని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. వాటికి అర్హులైన అధికారుల నుంచి దరఖాస్తులు కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టుల రిజిస్ట్రార్లకు లేఖ పంపామన్నారు. అంతేగాక రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా కేంద్రం లేఖ రాసిందన్నారు. చైర్మన్, సభ్యుల పదవుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ త్వరలో ప్రఖ్యాత దినపత్రికల్లో ప్రకటనలు కూడా ఇస్తామని తెలిపారు. దరఖాస్తులను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శికి ఫిబ్రవరి 7లోగా చేరేలా పంపాల్సి ఉంటుంది.
ప్రభుత్వంలో పలు స్థాయిల్లో ఉండే అధికారులు, మంత్రులు తదితరులతో పాటు ఏకంగా ప్రధానిపై వచ్చే అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపే అధికారం లోకాయుక్తకు ఉన్న విషయం తెలిసిందే. ఈ దిశగా కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల స్థాయిలో లోకాయుక్తల ఏర్పాటుకు వీలు కల్పించే లోక్‌పాల్, లోకాయుక్తల బిల్లు-2013ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జనవరి 1న ఆమోదించారు.
ఇవీ అర్హతలు: లోక్‌పాల్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా నియమితులయ్యే వారికి ఆ పదవిని చేపట్టేనాటికి కనీసం 45 ఏళ్లుండాలి. పార్లమెంటులో గానీ, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల్లో సభ్యత్వం ఉండరాదు. లోకాయుక్త పదవులు చేపట్టాలంటే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో సభ్యులై ఉండకూడదు. నైతికంగా తలదించుకునే నేరాలు చేశారని కోర్టులు నిర్ధారించిన వారు అనర్హులు. ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి వీరిని పదవుల్లో నియమిస్తారు. లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన నామినేట్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఓ ప్రఖ్యాత న్యాయ కోవిదుడు కమిటీలో ఉంటారు. న్యాయ కోవిదుడిని రాష్ట్రపతి గానీ, ఇతర సభ్యుల్లో ఎవరైనా గానీ నామినేట్ చేయవచ్చు.
పదవీకాలం: ఐదేళ్లు, లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు
జీతభత్యాలు: చైర్‌పర్సన్‌కు సీజేఐతో సమానంగా
సభ్యులకు: సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా
చైర్పర్సన్, సభ్యుల ఎంపికకు లోక్‌పాల్ చట్టంలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాలు ఇలా ఉన్నాయి...
లోక్‌పాల్ చైర్మన్: భారత ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తి. లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్న వారు. లేదా తిరుగులేని నీతి నిజాయితీలున్న ప్రముఖులు
జ్యుడీషియల్ సభ్యులు: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్న వారు. లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన/చేస్తున్నవారు
నాన్ జ్యుడీషియల్ సభ్యులు: తిరుగులేని నీతి నిజాయితీలతో పాటు అవినీతి నిరోధక విధానాలు, పాలన, విజిలెన్స్, బీమా, బ్యాంకింగ్ వంటి అంశాలపై కనీసం 25 ఏళ్లకు తగ్గని అనుభవం, ప్రత్యేక పరిజ్ఞానమున్న ప్రముఖులు