ప్రియుడి కోసం సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు
కరీంనగర్ : ప్రేమించుకున్నారు...పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే అమ్మాయి తండ్రికి ఈ ప్రేమ వ్యవహారం నచ్చలేదు. కూతురికి నచ్చచెప్పాడు. ఫలితం లేకపోయింది. దాంతో కూతురు ఇష్టపడిన వ్యక్తిని బెదిరించి, దాడి చేయించాడు. అయినా ప్రేమికుల్లో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో యువకుడు అదృశ్యం కావడంతో ఈ ప్రేమ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనకు న్యాయం చేయాలంటూ న్యాయం కోసం కరీంనగర్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు కథనం ప్రకారం.. వరంగల్‌లోని గాయత్రి సైన్స్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్ డైరెక్టర్ సుదిర శ్రీనివాస్ గుప్తా కుమార్తె శృతి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో తన సహోద్యోగి అనుదీప్ వర్మతో పరిచయం ఏర్పడింది. అనుదీప్ కూడా వరంగల్‌కు చెందిన వాడే కావడంతో పరిచయం కాస్తా స్నేహంగా మారి అనంతరం ప్రేమగా మారింది. అయితే విషయం తెలుసుకున్న శృతి తండ్రి ఎలాగైన తన కూతురు మనసు మార్చాలని విశ్వప్రయత్నాలు చేశాడు. అయినా లాభం లేకపోవడంతో.. ఆర్నెళ్ల క్రితం అనుదీప్‌పై కొందరు వ్యక్తులతో దాడి చేయించి తీవ్రంగా కొట్టించాడు. అప్పటి నుంచి కూతురు పై గట్టి నిఘా ఏర్పాటు చేసి.. అనుదీప్‌తో కలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వేరే యువకుడితో పెళ్లి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు.
దీంతో శృతి తనకు పెళ్లి చేయడానికి చూస్తున్నారంటూ అనుదీప్‌కు చెప్పి ఇంటి నుంచి పారిపోయి వరంగల్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై వరంగల్ పోలీసులు శ్రీనివాస్ గుప్తాను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అయితే తనకున్న రాజకీయ పలుకుబడితో శ్రీనివాస్ గుప్తా కూతుర్ని బలవంతంగా స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. కాగా.. గత మూడు రోజులుగా అనుదీప్ ఆచూకీ తెలియకపోవడం.. ఆవేదనకు గురైన శృతి మరోసారి ఇంటి నుంచి పరారై అనుదీప్ సోదరి నివాసమైన కరీంనగర్‌కు చేరుకుంది.
ఆమె సాయంతో సోమవారం కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి కలిసి ఫిర్యాదు చేసింది. తాను వరంగల్, హైదరాబాద్‌లలో ఉండలేనని.. ఎక్కడున్న తన తండ్రి బలవంతంగా తీసుకెళ్తాడని.. ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించాల్సిందిగా ఆ ఫిర్యాదులో పేర్కొంది. అప్పటివరకు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. దీంతో సీపీ ఆమెకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు తరలించారు.