22న అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఐపీవో
ప్రైస్ బ్యాండ్ రూ.171–175 రూ.152 కోట్లు సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల ఉత్పత్తి రంగంలో ఉన్న అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఆగస్టు 22న ఐపీవోకి వస్తోంది. ప్రైస్‌బ్యాండ్ రూ.171–175గా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 87,00,000 షేర్లను ఆఫర్ చేయనుంది. వీటిలో ఫ్రెష్ ఇష్యూ కింద 72,50,000 షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు చెందిన 14,50,000 షేర్లున్నాయి. ఆగస్టు 24న ఐపీవో ముగియనుంది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్లను లిస్ట్ చేస్తారు. ఐపీవో ద్వారా సుమారు రూ.152 కోట్ల దాకా సమీకరించనున్నారు.
ఇందులో రూ.90 కోట్లను కాకినాడ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ కోసం వ్యయం చేయనున్నట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ సీఎండీ కారుటూరి సత్యనారాయణ మూర్తి శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100 శాతం ఉన్న ప్రమోటర్ల వాటా ఇష్యూ అనంతరం 72 శాతానికి చేరుతుందని చెప్పారు. కంపెనీ 1,340 ఎకరాల్లో రొయ్యలు పండిస్తోంది. రెడీ టు కుక్, రెడీ టు ఈట్ ఉత్పత్తులను యూఎస్, యూరప్ తదితర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ప్రాసెసింగ్ సామర్థ్యం 9,240 మెట్రిక్ టన్నులు. థర్డ్ పార్టీ ప్లాంటు ద్వారా మరో 6,000 మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేస్తోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తులను సరఫరా చేయలేకపోతోంది. దీంతో విస్తరణకు వెళ్తున్నట్టు అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ ఈడీ సుబ్రహ్మణ్య చౌదరి తెలిపారు.