arvind-kejriwal
-
కేజ్రీవాల్, కిరణ్ బేడీ ఎన్నికల ప్రచారం
-
'కేజ్రీవాల్... ఎల్లుండిలోగా వివరణ ఇవ్వండి'
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆప్కే వేయాలంటూ ఢిల్లీ ఓటర్లకు సలహా ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనకు నోటీసు పంపింది. ఎల్లుండి(గురువారం)లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈసీకి కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
కిరణ్ బేడీని వేడుకుంటున్నా: కేజ్రీవాల్
ఒకరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. మరొకరు తాజాగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థిని. ఇద్దరూ ఒకప్పుడు మంచి సహచరులే. కానీ తర్వాత విధానాలు మారాయి, దాంతో విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు దయచేసి తనను ఫాలో కానివ్వాలంటూ ఆయన ఆమెను వేడుకుంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ. ఆయన అరవింద్ కేజ్రీవాల్, ఆమె కిరణ్ బేడీ. ఇంతకుముందు తాను ట్విట్టర్లో కిరణ్ బేడీని ఫాలో అయ్యేవాడినని, కానీ ఇప్పుడు తనను బ్లాక్ చేశారని, దయచేసి అన్‌బ్లాక్ చేయాలంటూ బేడీని కేజ్రీవాల్ వేడుకున్నారు. కానీ దానికి కిరణ్ బేడీ ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. సుమారు 15 నెలల క్రితం ఆయన తనను తాను అరాచకవాదిగా చెప్పుకొన్నప్పుడే కేజ్రీవాల్‌ను బ్లాక్ చేశానని, ఆయనను ఇక అన్‌బ్లాక్ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలుకొట్టారు. ఆయన నెగెటివ్ వ్యాఖ్యలు రాస్తున్నారని, తన 40 లక్షల మంది ఫాలోవర్లకు ఆ వ్యాఖ్యలు చూపించి, తన ఖాతాను కలుషితం చేయలేనని చెప్పారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ అడుగుతున్నట్లుగా బహిరంగ చర్చ ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదని కూడా కిరణ్ బేడీ చెప్పారు. కేజ్రీవాల్ కేవలం చర్చలనే నమ్ముకుంటారని, తాము మాత్రం సేవలు అందించడాన్నే నమ్ముకుంటామని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయనతో తాను చర్చిస్తానని చెప్పారు. దేశంలోనే మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి అయిన కిరణ్ బేడీ.. పోలీసు విభాగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి కాల ఉద్యమకారిణిగా మారారు. ఇక ఐఆర్ఎస్ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కేజ్రీవాల్.. సమాచారహక్కు చట్టం సాధన, అన్నాహజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో ముందుండి అటునుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో కిరణ్ బేడీ కూడా అన్నా హజారేకు శిష్యురాలిగానే ఉండేవారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ప్రత్యర్థులుగా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనందుకు కిరణ్ బేడీకి కేజ్రీవాల్ అభినందనలు కూడా తెలిపారు. .@thekiranbedi congrats 4 being nominated as BJP's CM candidate. I invite u 4 a public debate moderated by neutral person n telecast by all — Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015 .@thekiranbedi Kiranji, i used to follow u on twitter. Now, u have blocked me on twitter. Kindly unblock me. — Arvind Kejriwal (@ArvindKejriwal) January 20, 2015 -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్, బేడీ పోటాపోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేత కిరణ్ బేడీల మధ్యే పోటీ నెలకొందని ఏబీపీ న్యూస్-నీల్సన్ ‘స్నాప్ పోల్’లో వెల్లడైంది. ఢీల్లీ సీఎం పదవికి ఉత్తమ అభ్యర్థిగా కేజ్రీవాల్ 47 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, ఇటీవలే బీజేపీలో చేరిన కిరణ్ బేడీ సర్వేలో 44 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ఢిల్లీలో ఈ నెల 17-19 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,489 మంది పాల్గొన్నారు. కాగా, ఢిల్లీలో మరోసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని జనవరి 11-15 తేదీల మధ్య న్యూస్ నేషన్ నిర్వహించిన మరో ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. -
'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం'
న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖమని మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ అభివర్ణించారు. ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె .. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖంగా వెలిగిపోతుందని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో పోటీచేయడానికి బీజేపీకి సరైన ముఖం లేకపోవడంతోనే కిరణ్ బేడీని మోదీ తెరపైకి తీసుకొచ్చారన్న ఆప్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.'బీజేపీ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్. నేను నరేంద్ర మోదీ నాయకత్వం పనిచేయడానికే పార్టీలో చేరా. ఆయన నాయకత్వంలో పనిచేసే మేము కేవలం స్టార్స్ మాత్రమే' అని ఆమె తెలిపారు. -
ఆ పార్టీలను ఫూల్స్ చేయండి!
బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని.. ఆప్‌కు ఓటేయండి కేజ్రీవాల్ క్రేజీ వ్యాఖ్య న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం ఆప్కే వేయాలంటూ ఢిల్లీ ఓటర్లకు సలహా ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదానికి తెర లేపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ ఢిల్లీలోని నవాడలో ఆదివారం ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్.. ‘ఇది ఎన్నికల సమయం. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి అభ్యర్థులు డబ్బులిస్తాం... ఓటేయమంటూ మీ వద్దకు వస్తారు. ఆ డబ్బును వద్దనకండి. తీసుకోండి. ఎవరైనా మీ వద్దకు రాకపోతే.. మీరే వారి పార్టీ ఆఫీసుల దగ్గరకు వెళ్లి మరీ డబ్బులు వసూలు చేయండి. ఆ రెండు పార్టీల నుంచి డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆప్కే వేయండి’ అని అన్నారు. ‘గత 65 ఏళ్లుగా మనల్ని పిచ్చోళ్లను చేస్తున్న ఆ నేతలను ఈ సారి మనం ఫూల్స్ చేద్దామ’ని సూచించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్పందించారు. రామ్‌లీలా మైదాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో.. సగం సమయం తనను నక్సలైటుగా, మరోసగం తనను ధర్నాలు చేసేవాడిగా చిత్రించేందుకే సరిపోయిందని విమర్శించారు. సీఎంగా రాజీనామా చేయడం తన తప్పేనని మరోసారి ఒప్పుకున్న కేజ్రీవాల్.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లు మండిపడ్డాయి. అవి ఎన్నికల సంఘం అధికారాలనే ప్రశ్నించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విషయంపై న్యాయ సలహా తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్, పార్టీ అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ సీనియర్ నేత తెలిపారు. సోనియా ఒక సభలో, రాహుల్ రెండు సభల్లో, ఒక రోడ్ షోలో పాల్గొంటారన్నారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వార్తా చానళ్లు బహిరంగ ప్రదేశాల్లో చర్చా కార్యక్రమాలను నిర్వహించడాన్ని ఢిల్లీ పోలీసులు నిషేధించారు. జనవరి 3న ఒక చానెల్ నిర్వహించిన చర్చాకార్యక్రమం షూటింగ్ సందర్భంగా ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగి 12 మంది గాయాల పాలయ్యారు. అందమైన ముఖం బీజేపీకి ఉంది: బేడీ ఢిల్లీలో బీజేపీకి సరైన ప్రాముఖ్యత, సొంత గుర్తింపు ఉన్న నేత లేకపోవడం వల్లనే కిరణ్ బేడీని ఆ పార్టీలోకి తీసుకున్నారన్న అరవింద్ కేజ్రీవాల్ విమర్శలపై కిరణ్ బేడీ స్పందించారు. ప్రధాని నరేంద్రమోదీకున్న ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ‘నరేంద్రమోదీ అనే ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం బీజేపీ కలిగి ఉంది’ అని వ్యాఖ్యానించారు. ‘మేమంతా ఆయన చుట్టూ తిరుగుతున్న నక్షత్రాలం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ఆదివారం బీజేపీలో చేరారు. అర్విందర్ పోటీ చేయరు: కాంగ్రెస్ దేశ రాజధానిలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేయరని ఏఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు వీలుగా ఆయన్ను పోటీ నుంచి విరమింపచేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో తెలిపారు. ఎన్నికల కమిటీ సారథిగా పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్‌ను నియమించిన నేపథ్యంలో అర్విందర్ పోటీకి దూరమవడం గమనార్హం. ‘బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది’ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయంపై పార్టీ పార్లమెంటరీ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా కొన్ని రోజుల కిందట పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ పేరు ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు: అమిత్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పరీక్ష వంటివని, వాటిని తేలిగ్గా తీసుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీలో తమ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారమిక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని దేశమంతా ఆమోదించిందని, ఆయన హవాతో ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.