'శభాష్.. గణేష్'
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రయాణికుడు ఆటోలో పోగొట్టుకున్న 15 తులాల బంగారు నగలను పోలీసులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఆటో డ్రైవర్ మెరుగు గణేష్. అఫ్జల్‌గంజ్ పోలీస్ ష్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపిన మేరకు.. చాంద్రయాణగుట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారి మహ్మద్ ఇబ్రహీం (45) శనివారం సాయంత్రం షాపింగ్ చేసి ఆటో ఎక్కి పుత్లీబౌలీలో దిగాడు. ఆటో దిగే సమయంలో జోరుగా వర్షం కురుస్తుండడంతో బంగారు ఆభరణాలు ఉన్న పాలిథిన్ కవర్‌ను ఆటోలోనే మర్చిపోయి వెళ్లిపోయాడు. తరువాత కవర్‌ను మర్చిపోయానని గ్రహించిన ఇబ్రహీం ఆటో కోసం వెతకగా ఫలితం లేకపోవడంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ టీవి ఫుటేజ్ ఆధారంగా, స్థానికుడు ఇస్మాయిల్ ఇచ్చిన సమాచారంతో ఆటో డ్రైవర్ మలక్‌పేట్‌కు చెందిన మెరుగు గణేష్‌గా గుర్తించారు. అతని కోసం గాలిస్తున్న క్రమంలో అతనే స్వయంగా ఆదివారం మధ్యాహ్నం పోలీసు ష్టేషన్కు వచ్చి తన ఆటోలో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయాడంటూ ఆభరణాలు గల కవర్‌ను అందజేశాడు. సుల్తాన్‌బజార్ ఏసీపీ దేవేందర్, అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి బాధితుడిని పిలిచి ఆభరణాలను అందజేయడంతో పాటు ఆటో డ్రైవర్ గణేష్‌ను, సహకరించిన ఇస్మాయిల్‌ను ఘనంగా సత్కరించారు.