ఎస్ఐ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి
బక్కమంతులగూడెం (మఠంపల్లి) : మెదక్ జిల్లా కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తూ అధికారుల వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణారెడ్డి మృతిపై ఐపీఎస్ అధికారిచే విచారణ జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మృతుడి స్వగ్రామమైన మండలంలోని బక్కమంతులగూడెంలో రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నెలరోజులలో రిటైర్డ్ కానున్న ఏఎస్పీని విచారణాధికారిగా నియమించడం సరికాదన్నారు. మెదక్ జిల్లాలో పనిచేసి బదిలీ అయిన సునితా ఐపీఎస్‌ను విచారణాధికారిగా నియమించాలన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరిగితే స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆయన వెంట ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, మండల కార్యదర్శులు ములకలపల్లి సీతయ్య, భూక్యా పాండునాయక్, డివిజన్ కమిటీ సభ్యులు జగన్మోహన్రెడ్డి, పల్లె వెంకటరెడ్డి, శేషగిరిరాజు, మాలోతు బాలు, కె.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.