నేనిప్పుడు బాత్రూమ్ సింగర్‌ని కాదు!
‘‘మా ఇంట్లో అంతా నన్ను బాత్రూమ్ సింగర్ అని ఆటపట్టిస్తుంటారు. బయటివాళ్ల ముందు పాడటానికి సాహసించని నేను ఇప్పుడు అందరికీ వినపడేట్లు పాడా’’ అని సంబరపడిపోతూ చెబుతున్నారు అలియా భట్... డాటరాఫ్ ది గ్రేట్ డెరైక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మహేష్‌భట్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన అలియా ప్రస్తుతం ‘హైవే’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ పాటల్లో ‘సూహా సాహా...’ అనే పాటను ఎవరితో పాడిస్తే బాగుంటుందా అని రహమాన్ అనుకుంటున్నప్పుడు, అలియా గొంతు బాగుంటుందనీ తనతో పాడిద్దామని ఇంతియాజ్ అన్నారు.
వాస్తవానికి ఈ దర్శకుడి ముందు అలియా ఎప్పుడూ పాడలేదు. కానీ, ఆయన అలియాలోని సింగర్‌ని గమనించారు. ఆ విషయమే రహమాన్ దగ్గర చెప్పారు ఇంతియాజ్. దాంతో అలియాతో పాడించాలని రహమాన్ కూడా ఫిక్స్ అయ్యారు. కానీ, అలియా మాత్రం చాలా టెన్షన్ పడ్డారట. ముందు పాడటానికి సంశయించానని, రహమాన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పాడగలిగానని ఆమె పేర్కొన్నారు. రెండు సార్లు రఫ్ ట్రాక్ పాడిన తర్వాత మూడోసారి ఫైనల్ వెర్షన్ పాడానని, రహమాన్‌గారు మెచ్చుకున్నారని కూడా చెప్పారు. బాత్రూమ్ సింగర్ అయిన తనతో పాట పాడించిన ఘనత రహమాన్‌కే దక్కుతుందని అలియా తెలిపారు.