కొల్లూరును దత్తత తీసుకున్న బయ్యారపు
కొల్లూరు: గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామాన్ని స్వచ్ఛభారత్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి బయ్యారపు ప్రసాదరావు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొల్లూరుకు వచ్చిన ప్రసాదరావు ఇక్కడి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పచ్చదనం పరిశుభ్రతలో కొల్లూరు గ్రామం ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పరిశుభ్రత పెంపొందించాలనీ, మొక్కలు నాటాలనీ, తాగు నీరు సమస్య లేకుండా మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చూడాలనీ చెప్పారు. గ్రామంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు కోసూరి అప్పయ్య, ఎంపీడీవో జి.శ్రీనివాసరావు, తహశీల్దారు ఎ.శేషగిరిరావు, సర్పంచ్ మార్గాని శివకుమారి, తదితరులు పాల్గొన్నారు.