బీడీ పరిశ్రమకు జీఎస్టీని మినహాయించండి
కేంద్ర మంత్రి అర్జున్రాంను కోరిన బీడీ మజ్దూర్ సంఘ్
సాక్షి, న్యూఢిల్లీ: అధికశాతం మహిళలు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నందున వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మెగ్వాల్ను అఖిల భారత బీడీ మజ్దూర్ మహా సంఘ్ నేతలు కోరారు.
శనివారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసిన సంఘం నేతలు.. జీఎస్టీలో బీడీ ఆకులపై 18 శాతం, బీడీలపై 28 శాతం పన్ను విధించడం వల్ల బీడీ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వివరించారు. బీడీ పరిశ్రమలపై దాదాపు కోటి మంది వరకు ఆధారపడి బతుకుతున్నారని, జీఎస్టీలో పన్నులు పెంచడం వల్ల వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మెగ్వాల్ను కలసిన వారిలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ తదితరులున్నారు.