'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..'
లాస్ ఏంజిల్స్ : 'ఈ అవార్డు నిర్భయ ఆత్మకే..' అంటూ ప్రముఖ భారతీయ యువ శబ్దగ్రాహకుడు రెసూల్ పోకుట్టి ట్వీట్ చేశారు. రెసూల్ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును తన ఖాతాలో వేసుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరుగుతున్న మోషన్ పిక్చర్స్ సౌండ్ ఎడిటర్స్ 63వ 'గోల్డెన్ రీల్ అవార్డ్స్' వేడుకలో 'బెస్ట్ సౌండ్' అవార్డును సొంతం చేసుకున్నారు. 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీకి సమకూర్చిన శబ్దానికిగాను రెసూల్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ మేరకు ఆయన తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు భారతీయ యువతలో ఉన్న నిజమైన చైతన్యానిదని, నిర్భయ ఆత్మకే చెందుతుందంటూ ట్వీట్ చేశారు. ఆసియాలో గోల్డెన్ రీల్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు రెసూల్ పోకుట్టి కావడం విశేషం. 'ఇండియాస్ డాటర్', 'అన్ ఫ్రీడమ్' అనే రెండు చిత్రాలకు రెసూల్ పోకుట్టికి నామినేషన్లు లభించాయి. ఈ రెండు చిత్రాలు భారత్‌లో నిషేధానికి గురికావడం గమనార్హం.
ఇదివరకే 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికిగాను బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో మరో ఇద్దరితో కలిపి రెసూల్ ఆస్కార్ అందుకున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంగా వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీ భారత్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. లెస్లీ ఉడ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసింది.
And the Golden Reel goes to.... pic.twitter.com/cveHza7hJo
— resul pookutty (@resulp) February 28, 2016
Is it true that I really got it....it's for the true spirit of the youth of India. This goes to Nirbhaya's soul..! pic.twitter.com/8ziq8mK7Zp
— resul pookutty (@resulp) February 28, 2016