భృంగి వాహనంపై ఆదిదంపతులు
- శ్రీశైలంలో ఘనంగా ప్రారంభమైన ఉగాది ఉత్సవాలు
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఆదివారం స్వస్తిశ్రీ హేవళంబినామ సంవత్సర ఉగాది ఉత్సవాలకు శాస్త్రోక్త పూజలతో ఈఓ నారాయణభరత్‌గుప్త దంపతులు, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్‌లు శ్రీకారం చుట్టారు. ఉదయం 8.30గంటలకు యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణపూజ, కంకణధారణ, అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, పంచావరణార్చన, రుద్రకలశస్థాపన, మూలమంత్ర అనుష్ఠాన కార్యక్రమాలను చేశారు. దీక్షా వస్త్రాలకు, కంకణాలకు విశేష పూజలు చేసిన తర్వాత వేద పండితులు ఈఓ చేతికి కంకణాధారణ చేశారు. ఈఓ ఆయన సతీమణికి దీక్షా కంకణాన్ని కట్టారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, భజంత్రీలకు సంబంధిత ఆలయ సిబ్బందికి ఈఓ దీక్షా వస్త్రాలను అందజేశారు.