ఎవడ్రా అక్కడ?
‘ఎవర్గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా’గా మహాత్ముని చేత పిలవబడిన త్రివేండ్రంలో సొంత ఇల్లు ఒకటి ఉండాలనే మా కల, నాన్న రిటైర్మెంట్ తరువాతగానీ సాధ్యం కాలేదు. కొద్దిరోజుల్లోనే తంపనూర్లో ఒక ఇంటిని కొన్నాం. మంచి ముహూర్తం చూసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యాం. ‘‘ఈ ఇంటాయన భార్య చనిపోయిందట. ఒంటరిగా ఉండలేక అమెరికాలో ఉన్న కొడుకు దగ్గర ఉండటానికి ఇల్లు అమ్మాడు. లేకుంటే ఇలాంటి ఇంటిని అమ్మడానికి ఎవరైనా ఇష్టపడతారా?’’ కాఫీ తాగుతూ అన్నాడు నాన్న. ‘‘మన అదృష్టం’’ అంది అమ్మ.
ఇంట్లో మా సామాన్లు సర్దడం అనే కార్యక్రమం మొదలైంది. పాతసామాన్ల రూమ్‌లో పెద్ద బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి కనిపించింది. ఫొటోలో ఉన్నావిడ చాలా అందంగా నవ్వుతోంది. ‘‘ఈ ఇంటి యజమాని భార్యలా ఉంది. ఈ ఫొటో గురించి ఆయన మరిచిపోయినట్లు ఉన్నాడు. ఇది ఎలాగైనా సరే ఆయనకు చేరవేయాలి. అప్పటి వరకు ఈ చీకట్లో ఉండటం ఎందుకు?’’ అని ఆ ఫొటోను ఇంట్లో గోడకు తగిలించాడు నాన్న. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నేను రాత్రి ఒంటి గంటా రెండు గంటల వరకు మెలకువతోనే ఉండేదాన్ని. ఒకరోజు ఒంటిగంట సమయంలో రిలాక్స్ కావడం కోసం ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాను. గోడ మీద ఉన్న ఫొటో కనిపించింది. ‘‘ఈవిడ నవ్వు ఎంత అందంగా ఉంటుంది’’ అని ఒకసారి పరిశీలనగా చూశాను. అంతే...ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఫొటోలో ఆమె నవ్వు కనిపించడం లేదు. నాలుక మాత్రం ఎర్రగా ఫొటో నుంచి ఫ్లోర్‌ను తాకుతోంది. ఆమె కళ్లు చింత నిప్పుల్లా ఉన్నాయి. విషయం ఎవరితో చెప్పలేదు.
లైట్లు ఆఫ్ చేసి పడుకున్నాను. ఉదయాన్నే లేచి ఫొటో చూస్తే ఎప్పటిలాగే అదే అందమైన నవ్వు. ‘‘ఈరోజు ఎలాగైనా సరే.. సంగతేమిటో తేల్చుకుందామని రాత్రి ఒంటగంట వరకు మేలుకొని గుండెలు దడదడలాడుతుండగా ఆ ఫోటో దగ్గరికి వెళ్లి చూశాను. ఫ్యాన్ ఎలా తిరుగుతుందో... అలా తిరుగుతుంది ఫోటో! ఆ రాత్రి నాకు ఎలా నిద్ర పట్టిందో ఆ దేవుడికే తెలుసు! జస్ట్ రెండు రోజుల తరువాత...‘‘యంజీ రోడ్ దగ్గర మంచి ఇల్లు ఒకటి కొన్నాను. రేపే మనం ఇల్లు ఖాళీ చేయాలి’’ అన్నాడు నాన్న. మరో సందర్భంలోనైతే ‘మీకేమైనా పిచ్చిపట్టిందా? ఈ ఇల్లు కొని నెల రోజులు కాలేదు. అప్పుడే కొత్త ఇల్లా?’’ అని అరిచేదాన్ని. కానీ ఒక్కమాట మాట్లాడలేదు. కొత్త ఇంట్లోకి మారాం. ఆ ఇంటితో పోల్చితే ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది.
ఒకరోజు నాన్న నా దగ్గరకు వచ్చి ‘‘నీకో విషయం చెప్పాలి దీప్తి’’ అన్నాడు. ‘‘పాత ఇంటి గురించేనా. నాకేమీ కోపం లేదు. ఈ ఇల్లు బాగానే ఉంది’’ అన్నాను. ‘‘నేను చెప్పదల్చుకుంది అది కాదు...ఒకరోజు పాత ఇంట్లో..’’ అనబోయాడు. ‘‘ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో నుంచి ఒక నాలుక బయటికి వచ్చింది, ఫ్యాన్‌లా గిర్రున తిరిగింది’’ అన్నాను. ‘‘కాదు... ఒకరోజు అర్ధరాత్రి... మనోహర్ అనే పిలుపుతో నిద్ర లేచాను. డ్రాయింగ్‌రూమ్‌లో ఉండాల్సిన ఫొటో బెడ్రూమ్ గోడకు కనిపించింది. ఫొటోలో ఉన్న ఆమె నన్ను చూపుడు వేలుతో ఏదో హెచ్చరిస్తోంది. ఆ భయంలోనే కళ్లు తిరిగి పడిపోయాను. ఎలా నిద్రపోయానో తెలియదు. తెల్లారి లేచి చూస్తే... ఆ ఫొటో ఎప్పటిలాగే డ్రాయింగ్ రూమ్‌లో ఉంది’’ అని చెప్పాడు.
పాత ఇంట్లో ఉన్నరోజుల్లో... ఒకరోజు అర్ధరాత్రి బాగా దాహమేసి ఫ్రిజ్ తలుపులు తెరిచిన అమ్మ గట్టిగా అరవడంతో మేమందరం పరుగెత్తుకు వచ్చాం. ‘‘బొద్దింక కనిపించింది’’ అనడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆమెకు బొద్దింకలంటే చాలా భయం. అమ్మ ఆరోజు అరిచింది బొద్దింకను చూసి కాదని, ఫ్రిజ్ తలుపులు తీయగానే వికృతంగా నవ్వుతున్న ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోని చూసి అని కొన్ని రోజుల తరువాతగానీ మాకు తెలియలేదు!
– దీప్తి మీనన్, త్రివేండ్రం