‘హద్దు’ మీరుతున్న అక్రమాలు
అశ్వారావుపేట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దున అశ్వారావుపేట పట్టణ శివారులో ఏర్పాటు చేసిన బోర్డర్ చెక్‌పోస్టు రవాణా శాఖ అధికారులకు కల్పతరువుగా మారింది. సంవత్సరం పాటు రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి రవాణా పన్నులు ఉండవని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ శాఖ అధికారులు ముందుగానే చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశారు. రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రద్దీని అధ్యయనం చేసేందుకే ముందస్తుగా చెక్‌పోస్టును ఏర్పాటు చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. కానీ లోనికి వెళ్లి చూస్తే అక్కడి సిబ్బంది పాల్పడే అవినీతికి ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.
డబ్బుంటే చాలు.. డాక్యుమెంట్లతో పనిలేదు..
ఎక్కడయినా చెక్‌పోస్టు, వాహనాల తనిఖీ, నాకాబందీ జరిగే చోట ముందుగా లారీ, అందులో రవాణా అయ్యే వస్తువులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవర్‌కు సరైన లెసైన్స్ ఉందా లేదా అని ఆయా అధికారులు, సిబ్బందికి పరిశీలిస్తారు. కానీ అశ్వారావుపేటలోని రవాణా చెక్‌పోస్టులో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. లారీ దిగి చెక్‌పోస్టుకు వచ్చే డ్రైవర్ లేదా క్లీనర్ నేరుగా పాకలో ఉన్న ఎంవీఐ/ఏఎంవీఐ వద్దకు కాకుండా పాక వెనకాల ఉన్న రేకులషెడ్లోని ఓగదిలో కూర్చున్న ఓ అనధికార వ్యక్తి వద్దకు వెళ్తారు.
అతడి చేతిలో చకచకా డబ్బులు పెట్టి సెకన్లలో పని ముగించుకుని బయటపడతారు. వాహనానికి పర్మిట్ ఉందా.. డ్రైవర్‌కు లెసైన్స్ ఉందా.. ఫిట్నెస్, టాక్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలను పరిశీలించాలంటే ఒక్కో వాహనానికి కనీసం 5 నిమిషాలకు పైగానే పడుతుంది. కానీ ఇక్కడ డబ్బు చేతిలో పెడితే ఇవేమీ పరిశీలించకుండానే ఇక వెళ్లమంటారు.
వాహనానికో రేటు..
అవినీతికీ.. నిజాయితీ ఉంటుందంటే ఇక్కడేనేమో..! లారీ డ్రైవర్లు వారి వాహనం, లోడు, ఇతర వివరాలు చెప్పేస్తే ధర ఎంతో అనధికార ఎంవీఐ చెప్పేస్తాడు. వెంటనే ఆ సొమ్ము చేతిలో పెట్టి డ్రైవర్ వెళ్లిపోతాడు. వాహనాన్ని బట్టి ముందుగా నిర్ధారించిన రేటు ప్రకారం ముడుపులు చెల్లించాల్సిందే. రేటులో తేడావచ్చినా.. బేరమాడినా.. లోపలినుంచి అసలు అధికారి వస్తారు.
అన్నింటినీ నిశితంగా పరిశీలించి.. అన్నీ సరిగానే ఉన్నప్పటికీ.. డ్రైవర్‌కు యూనిఫాం లేదనో.. మరేదైనా సాకుతోనో ఎంతోకొంత ఫైన్ రాస్తారు. ఇలాంటి అనుభవాలు ఎదురు కావడంతో సదరు డ్రైవర్లు ఈ గొడవంతా ఎందుకులే.. అని వారు అడిగినంత ఇచ్చేస్తారు. ఇలా వాహనాన్ని బట్టి రూ.100 నుంచి రూ. 500 వరకు నిర్ధాక్షణ్యంగా వసూలు చేస్తున్నారు.
ఒకేసారి మారిన సీన్..!
ఈ చెక్‌పోస్టులో ఆదివారం మధ్యాహ్నం విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అనధికార సిబ్బంది వసూళ్లను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించగానే.. సీన్ మారిపోయింది. నకిలీలంతా కనుమరుగై విధి నిర్వహణలో ఉండాల్సిన ఓ మహిళా ఏఎంవీఐ సీట్లోకి వచ్చేశారు. అప్పటిదాకా ఎంవీఐ బిల్డప్‌తో లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసిన మేడం కారు డ్రైవర్ పరారయ్యాడు. దీంతో పాకలో టేబుల్ వద్ద కూర్చున్న మేడం వద్దకు డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన లారీ డ్రైవర్లు చేతిలో రూ.100 నుంచి రూ.500 వరకు పట్టుకుని రాగా.. ‘ఇదర్ పైసా నై లేతా.. గాడీకా ఫైల్ లేకేఆవ్..’ అంటూ వెనక్కు పంపించసాగారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పరిశీలించగా దాదాపు వచ్చిన ప్రతి వాహనానికీ రూ.1000 చొప్పున ఫైన్ రాసేశారు. లారీ డ్రైవర్లు ఎంత బతిమాలినా ససేమిరా అంటూ కేసులు రాసేశారు. ‘ఉదయం నుంచి రాయని కేసులు ఇప్పుడే ఎందుకు రాస్తున్నారు..?’ అని ఏఎంవీఐని ‘సాక్షి’ అడగగా ‘వివరాలు చెప్పడం వీలుకాదు.. ఇలా ఫొటోలు తీస్తూ ఇబ్బంది పెట్టకండి.. మా ఇన్ఛార్జ్ మీతో మాట్లాడతారు.. రేపు ఉదయం చెక్‌పోస్టుకు రండి’ అన్నారే తప్ప వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. ఈ విషయమై ఎంవీఐ శంకర్‌ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా.. ఇలాంటి ఘటనలు ఇకముందు జరుగకుండా చూస్తామని చెప్పారు.