స్పైస్‌జెట్‌కు త్వరలో రూ. 1,500 కోట్లు!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ యాజమాన్య మార్పు ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రస్తుత ప్రమోటర్ కళానిధి మారన్ కుటుంబానికి, కాల్ ఎయిర్వేస్కి కంపెనీలో ఉన్న మొత్తం 58.46 శాతం వాటాలను వ్యవస్థాపకుడు అజయ్ సింగ్‌కు బదలాయించే ప్రతిపాదనను స్పైస్‌జెట్ బోర్డు ఆమోదించింది. ఈ వాటాల విలువ ప్రస్తుతం రూ. 700 కోట్ల మేర ఉంటుంది. సింగ్‌కు బదలాయించేందుకు సంబంధించి షేరు విలువను ఎంత మేర నిర్ణయించినదీ వెల్లడి కాలేదు.
ఇక కొత్తగా షేర్లు లేదా వారంట్లు మొదలైన వాటిని జారీ చేయడం ద్వారా రూ. 1,500 కోట్లు సమీకరించేందుకు కూడా బోర్డు ఆమోదముద్ర వేసింది. కంపెనీలో మొత్తం వాటాలన్నింటినీ విక్రయించేసినప్పటికీ.. మారన్ కుటుంబం మరో రూ. 375 కోట్లు సంస్థలో ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు ప్రతిగా స్పైస్‌జెట్ ఒక్కోటి రూ. 1,000 విలువ చేసే 37.5 లక్షల నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లు జారీ చేయనుంది. కంపెనీలో సింగ్ స్వయంగా కొంత ఇన్వెస్ట్ చేయడంతో పాటు మరికొంత విదేశీ ఇన్వెస్టర్లను కూడా పెట్టుబడులు తీసుకురావొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు, ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి కళానిధితో పాటు మేనేజింగ్ డెరైక్టర్ ఎస్ నటరాజన్ కంపెనీ బోర్డు నుంచి వైదొలిగారు. కొత్త డెరైక్టర్లకు చోటు కల్పించే దిశగా ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్పైస్‌జెట్.. స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. కంపెనీ అధీకృత మూలధనం రూ. 2,000 కోట్లకు పెంచాలని బోర్డు నిర్ణయించినట్లు వివరించింది. ఈ ప్రతిపాదనలన్నింటికీ సంబంధించి పోస్టల్ బ్యాలట్ ద్వారా షేర్‌హోల్డర్ల ఆమోదం పొందనున్నట్లు పేర్కొంది.