కేన్సర్ నొప్పి నివారణకు పాలియేటివ్ కేర్
ఏపీ, తెలంగాణల్లో అమలు చేయడానికి ఏర్పాట్లు
పాలియేటివ్ కేర్ సదస్సులో ఇరు రాష్ట్రాల వైద్య శాఖ ముఖ్య కార్యదర్శులు
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారి సోకిన రోగులు నొప్పిని భరించలేరు. ఈ నొప్పి నివారణకు సరికొత్త వైద్య పద్ధతులు వచ్చాయి. దీన్నే పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ అంటారని, కొత్తగా తెలంగాణ, ఏపీల్లోని కేన్సర్ ఆస్పత్రుల్లో ఈ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ, తెలంగాణల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు ఎల్వీ సుబ్రమణ్యం, డాక్టర్ సురేష్చందాలు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ హోటల్లో గురువారం జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ 22వ అంతర్జాతీయ సదస్సు సన్నాహక కార్యక్రమంలో ఇరువురూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఏపీలో తిరుపతి, కర్నూలు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే, కేన్సర్ రోగులకు వాడే నార్కొటిక్ డ్రగ్స్ వాడకానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు పాసైందని, ఈ మందుల వాడకంపై నిబంధనలు సడలిస్తే రోగులకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. న్యూరోపతి, హెచ్ఐవీ, కేన్సర్ తదితర జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం కేరళలో పాలియేటివ్ కేర్ బాగా అమలు చేస్తున్నారని, ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వైద్య పద్ధతులను ప్రవేశ పెట్టనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 600 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. కార్యక్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలియేటివ్ కేర్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్ సింహ, హైదరాబాద్ ఐఏపీసీ అధ్యక్షులు డాక్టర్ మంజుల, ఐఏపీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు.