cashew nut
-
జీడి పప్పు తొక్కతో లాభాలెన్నో.. లక్షల్లో సంపాదన!
కాశీబుగ్గ: జీడి పప్పు రుచి అందరికీ తెలిసిందే. జీడి పప్పు తయారీ విధానం, వ్యాపారం కూడా చాలా మందికి పరిచయమే. కానీ ఆ జీడిపప్పుకు కవచంలా ఉండే తొక్కతో కూడా లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుందని తెలుసా..? ఈ తొక్కతో తయారు చేసే ఆయిల్ మిశ్రమానికి విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అందుకే పలాస నుంచి మన దేశంలోని ఇతర ప్రాంతాలకే కాకుండా విదేశాలకు కూడా ఈ ఆయిల్‌ను ఎగుమతి చేస్తున్నారు. ఆ రక్షణ కవచమే.. జీడి చెట్టు పువ్వుల నుంచి జీడి పిక్కలు కాస్తాయి. పిక్కల దశ నుంచి పప్పు తయారీ వరకు సహజ సిద్ధంగా ఉండే రక్షణ కవచాలే జీడి తొక్కలు. జీడి గుడ్డు సేకరణ అనంతరం ఈ తొక్క ఎందుకూ పని రాదని ఒకప్పుడు పడేసేవారు. అవే నేడు కోట్లు కురిపిస్తున్నాయి. ఇప్పుడు తొక్క కిలో రూ.10 పలుకుతోంది. రోజుకు 300 నుంచి 400 టన్నుల వరకు జీడి తొక్కను ఆయిల్ తీయడానికి వినియోగిస్తున్నారు. ఈ మూలంగా 8000 లీటర్ల ఆయిల్‌ను సేకరిస్తున్నారు. ముడి సరుకుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఫుల్ డిమాండ్.. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 300 వరకు జీడిపరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మరో 100 పరిశ్రమల్లో జీడి పప్పు తయారీ జరుగుతుంది. పప్పు సేకరణ అనంతరం జీడితొక్కను పక్కన పడేయకుండా, కొందరు వంట చెరకుగా వినియోగిస్తుంటే మరికొందరు కిలోల లెక్కన ఆయిల్ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. పలాస పరిసరాల్లో సుమారు 12 జీడి ఆయిల్ పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 4 లక్షల కేజీల జీడి పిక్కలను వినియోగించి వాటి నుంచి వచ్చే 3 లక్షల కేజీల తొక్కతో 8000 లీటర్లు ఆయిల్ సేకరిస్తారు. అనంతరం మిగిలిన పదార్థాన్ని వంటచెరకు కింద వాడుతున్నారు. రెండోసారి సది్వనియోగమయ్యే వస్తువుగా పరిగణించిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. పూర్తి ప్రోత్సాహకాలతో పాటు జీఎస్టీ రేట్లను సైతం పూర్తిగా తగ్గించింది. పరిశ్రమల్లో మంట కోసం ఇలాంటి వాటిని వినియోగించాలని కోరుతోంది. ఆయిల్ ఉత్పత్తి ఇలా.. జీడి పరిశ్రమలో లభించిన తొక్క బస్తాలను వ్యాను, లారీల్లో వే బ్రిడ్జిల వద్ద తూస్తారు. అక్కడి నుంచి కూలీల సహకారంతో ఆయిల్ పరిశ్రమలకు చేరుస్తారు. అక్కడే అసలు పరీక్ష ఉంటుంది. జీడి తొక్కలో ఆయిల్ ఉందా లేదా అని తొక్కకు పరీక్షలు జరిపి వాటిని ఆయిల్ పరిశ్రమలో మిషనరీకి బెల్టుతో పంపుతారు. కిలోల చొప్పున పంపించి వాటిని పిండి పిప్పి చేసి ఆయిల్‌ను ప్రత్యేకమైన కెనాల్ ద్వారా సిమెంట్ బావికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులు తేటగా మారిన అనంతరం తిరిగి ట్యాంక్‌లోకి పంపించి 90 డిగ్రీల వరకు వేడి చేసి నీటిని ఆవిరి రూపంలో బయటకు పంపిస్తారు. అనంతరం డ్రమ్ములతో నింపి ట్రాన్స్‌పోర్టు లారీల్లో వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. మన దేశంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజస్థాన్, పంజాబ్, బెంగళూర్‌తోపాటు విదేశాలకు పంపిస్తారు. అక్కడ ఆయిల్‌ను ఆయా కంపెనీలు వివిధ రకాలుగా రూపాంతరం గావించి వాటిని సౌత్ కొరియా, ఖతార్, వియత్నాం, రష్యా, చైనా వంటి విదేశాలకు పంపుతారు. ఉపాధి కోణం.. జిల్లా వ్యాప్తంగా జీడి పరిశ్రమలపై ఆధారపడి 20వేల మంది వరకు జీవిస్తుండగా.. జీడి తొక్క ఆయిల్ పరిశ్రమలు కూడా మరో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉపయోగాలెన్నో.. ఈ ముడి సరుకును రోడ్లకు వాడే తారు ఫ్యాక్టరీల్లో తారు తయారీకి, పెయింటింగ్స్ తయారీలో, వార్నిష్లు, బయోడీజిల్ తయారీకి వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీటి కారణంగా పెద్ద పెద్ద షిప్‌లు, బోట్లు, స్టీమర్లు, పాడైపోకుండా ఈ ఆయిల్‌ను తరచుగా పూస్తారు. విదేశాలకు ఎగుమతి.. పలాస నుంచి విదేశాలకు జీడిపప్పే కాదు జీడి ఆయిల్ సైతం ఎగుమతి కావడం మన ప్రాంత గొప్పతనంగా భావిస్తున్నాను. ప్రపంచమంతా వినియోగించే తారు, పెయింటింగ్స్, బయోడీజిల్ తయారీలో మన పలాస ఆయిల్ వాడటం మనం గొప్పగానే చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఆయిల్ సేకరణ పెరిగి మరింత మందికి ఉపాధి కలుగుతుంది. వైఎస్సార్ చలవతో పలాస ఇండస్ట్రియల్ ఏరియాలో మేము జీడి పరిశ్రమతో పాటు ఆయిల్ సేకరించే పరిశ్రమను ఏర్పాటు చేసుకుని నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో రాయితీలు అందించింది. ఔత్సాహికులకు ఇలాంటి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తే మరింత మేలు జరుగుతుంది. – కోరాడ శ్రీనివాసరావు, ఆయిల్ పరిశ్రమ యజమాని, ఇండ్రస్టియల్ ఏరియా, పలాస. -
జీడిమామిడి పండు.. పోషకాలు మెండు
రాజానగరం(తూర్పుగోదావరి జిల్లా): మెట్ట ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. ఈ పంటలో జీడిగింజల ద్వారానే ఆదాయం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణంగా ఉన్న జీడి మామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా దేశంలో సాలీనా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మంచి రంగు, రుచి మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగివున్న జీడిమామిడి పండు తినగానే గొంతులో ఒక రకమైన జీర వస్తుంది. అందుకే చాలామంది దీనిని తినడానికి ఆసక్తిని చూపించరు. ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగివుండంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసిపోతున్నాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే వీటి వినియోగం పై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. పలు రకాల ఆహార ఉత్పత్తులు జీడిమామిడి పండ్లతో పలురకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటి రసంతో శీతల పానీయాలు, గుజ్జుతో జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, చట్నీ, ఊరగాయ, కాండీ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్, తయారు చేయవచ్చు. గోవాలో లభించే ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం జీడిమామిడి పండ్ల రసం నుంచి తయారవుతుంది. రసం తీసే విధానం బాగా ముగ్గిన జీడిమామిడి పండ్లను సేకరించి, నీటితో శుభ్రం చేసిన తరువాత చేతులతోగాని, ప్రత్యేక మెషీన్‌తోగాని రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్ ఎక్స్‌ట్రాక్టరుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పండు నుంచి 70 శాతం రసాన్ని తీయడమే కాకుండా గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్‌ని (గొంతులో జీరను కలిగించే వగరు) తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారు చేసిన గంజిని ఉపయోగిస్తుంటారు. జీడిమామిడి పండ్లతో మామిడి కాయల మాదిరిగా ఆవకాయ పెట్టవచ్చు. తీరిక సమయంలో తినేందుకు పొటాటో చిప్స్ మాదిరిగా చిప్స్ కూడా తయారు చేసుకోచ్చు. పిప్పితో ఉపయోగాలు ► రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. ►వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ఈ కంపోస్టులో 1.60 శాతం నత్రజని, 0.44 శాతం భాస్వరం, 0.58 శాతం పొటాషియం ఉంటాయి. ►గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్ తయారీకి వాడతారు. ►ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’ అనే ముఖ్యమైన ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్ తయారీలలో చిక్కదనం రావడానికి తోర్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను కూడా వాడతారు. ఔషధకారిగా.. ►ఈ పండులో లభ్యమయ్యే సి–విటమిన్ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ►జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ►మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు ఆరగించడం ద్వారా అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. ►జీడిమామిడి రసంతో తయారు చేసిన ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం పెద్దలకు, పిల్లలకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ►వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు. యువతకు ఉపాధి ఫుడ్ ప్రాసెంగ్ యూనిట్ల ద్వారా జీడిమామిడి పండ్లను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చే ప్రొసెస్‌ని చేపడితే మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధిని చూపవచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్టా ప్యాకింగ్ చేసి విక్రయించే ప్రక్రియ ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. పచ్చడి పెట్టుకోవచ్చు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జీడిమామిడి పండ్లతో ఏఏ రకాల ఆహార పదార్థాలను, రసాలను, జ్యూస్‌లను, జామ్‌లను తయారు చేయవచ్చునో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వీటితో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అదెలాగో శిక్షణలో తెలియజేస్తున్నాం. – డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు, ప్రధానాధికారి, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా 600 మందికి శిక్షణ ఇచ్చాం కేరళ, గోవాలో మాదిరిగా జీడిమామిడి పండ్లను వినియోగం లోకి తీసుకువచ్చేందుకు డీసీసీడీ కొచ్చిన్ (కేరళ) సహకారంతో కేవీకేలో బ్యాచ్‌ల వారీగా గత ఆరు సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. – జేవీఆర్ సత్యవాణి, గృహ విజ్ఞాన విభాగం అధికారి, కేవీకే, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా -
సంక్షోభంలో పలాస జీడి పరిశ్రమలు
సాక్షి, పలాస: జీడిపప్పు ఉత్పత్తిలో జాతీయస్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా పలాస జీడి పరిశ్రమలు నేడు సంక్షోభంలో పడ్డాయి. వేతనాల కోసం కార్మికులు రోడ్డున పడ్డారు. వారి సమ్మెతో జీడి పరిశ్రమ లు పూర్తిగా మూతపడ్డాయి. ఉగాది నుంచి కొత్త జీడిపప్పు ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంది. అయితే ఓ పక్క ముడిసరుకు కొరత, మరోపక్క కార్మికుల ఆందోళన, రాష్ట్ర విడిపోవడం తదితర కారణాల వల్ల ఒకప్పుడు కళకళలాడిన జీడి పరిశ్రమ నేడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. వారం రోజులుగా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. జిల్లాలోని ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు ఐదు లక్షల క్వింటాళ్ల జీడిగింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పంట, పరిశ్రమలే ఉద్దానం ప్రజల జీవనాధారం. పంట ఇలా వచ్చింది... 16వ శతాబ్దంలో తీరప్రాంతం కోతకు గురి కాకుండా పోర్చుగీసు వారు జీడి మొక్కలు నాటడం ప్రారంభించారు. వీటి నుంచి వచ్చే జీడిగింజలు మొదట్లో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఉండేవి. తరువాత కాలంలో ఇక్కడి ప్రజలు జీడిగింజలను కాల్చి అందులోని పప్పును తినడం ప్రారంభించారు. సుమారు 7 దశాబ్దాల క్రితం జీడి పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. 1945 నుంచి పలాస కేంద్రంగా జీడిపిక్కల కొనుగోలు ప్రారంభమైంది. అప్పటి వరకు ఇక్కడ రైతులకు వాటి విలువేంటో తెలియలేదు. రాష్ట్రంలో జీడి ఉత్పత్తికి కేంద్రమైన మోరి ప్రాంతం నుంచి వ్యాపారులు పలాసకు వచ్చి జీడిగింజల కొనుగోలు చేపట్టారు. ఆ తరువాత వేటపాలెం ప్రాంతానికి చెందిన వ్యాపారి రాధాకృష్ణ పలాసలో జీడి పరిశ్రమ ఏర్పాటు చేశారు. అప్పటికే పలాసకు చెందిన మల్లా జనార్దన అనే వ్యాపారి పెన ంపై జీడి గింజలను కాల్చి పప్పు తీసి మార్కెట్లో విక్రయించేవారు. ఆ విధంగా ప్రారంభమైన జీడి పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగింది. 1986 నాటికి రోస్టింగ్ విధానంతో నడిచే 30 పరిశ్రమలు ఉండగా, నేడు వాటి సంఖ్య పలాసతో పాటు పరిసర ప్రాంతాల్లో కలిపి 250కి పెరిగింది. ఇక్కడ తయారైన జీడిపప్పును దేశంలోని ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముడిసరుకు కొరత జీడి పరిశ్రమలకు అవసరమైనంత ముడిసరుకు స్థానికంగా అందడంలేదు. ఏడాదికి 10.80 లక్షల టన్నుల జీడి గింజలు అవసరం కాగా అంత దిగుబడి లేకపోవడంతో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన 35 దేశాల నుంచి జీడిపిక్కలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 22 కిలోల జీడిపప్పు దిగుబడి వచ్చే 80 కిలోల జీడిగింజల బస్తా ప్రస్తుతం మార్కెట్లో రూ.7,200 పలుకుతోంది. గ్రేడింగ్‌ను బట్టి పలాసలో 16 రకాల జీడిపప్పు ఉత్పత్తి అవుతోంది. ఈ పరిశ్రమ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ పరిశ్రమలు, కార్మికుల స్థితిగతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తరువాత పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. విజయవాడ దాటి హైదరాబాదు వెళ్లాలంటే పన్ను పోటు పెరిగింది. అలాగే తిరుపతి, ఇతర దేవస్థానాలు పలాస జీడిపప్పు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రముఖ దేవస్థానాలన్నీ ఇతర రాష్ట్రాల నుంచి పప్పు కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు ఇక్కడి పరిశ్రమలకు రాయితీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు, కనీస వేతనాలు కల్పించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఫలితంగా యాజమాన్యాలు, కార్మికుల మధ్య వేతన ఒప్పందాల విషయంలో ప్రతిసారీ వివాదాలు తలెత్తి పరిశ్రమలు మూత పడుతున్నాయి. ముడిసరుకు అందడం లేదు పరిశ్రమలకు కావలసిన ముడిసరుకు అందడం లేదు. దిగుబడి తగ్గిపోయింది. ఈసరికే జీడి పంట రైతుల చేతికి అందాల్సి ఉండగా అందలేదు. ప్రస్తుతం ఇతర దేశాల పిక్కలపైనే ఆధారపడి ఉన్నాం. ప్రభుత్వం రాయితీలు కల్పించి పరిశ్రమల అభివృద్ధికి సహకరించాలి. - మల్లా శ్రీనివాసరావు, పీసీఎంఏ అధ్యక్షుడు, పలాస కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి పరిశ్రమల్లో కార్మికులకు సదుపాయాలు కల్పించాలి. పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతన చట్టాలను అమలు చేయాలి. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. - బొంపల్లి సింహాచలం, జీడి కార్మిక సంఘం అధ్యక్షుడు, పలాస