డబుల్ ధమాకా!
– టెన్త్, సీసీఈ రెండు పాయింట్లూ వినియోగించుకున్న అయ్యవార్లు
– డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు
– ఉపాధ్యాయుల బదిలీల్లో కొనసాగుతున్న లీలలు
అనంతపురం ఎడ్యుకేషన్: బదిలీ కౌన్సెలింగ్లో ఒక పాయింటు అదనంగా వచ్చినా సీనియారిటీ జాబితాలో 50–60 మంది కంటే ముందుకు వెళ్లొచ్చు. అదే నాలుగైదు పాయింట్లు అప్పనంగా వచ్చి పడితే వారికి అన్ని విధాలా సౌకర్యవంతమైన స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి. పాయింట్లు ఎలాగొచ్చాయనేది కాదు.. ఎంత మంచి స్థానం వచ్చిందనేది ముఖ్యం అనే ధోరణిలో కొందరు ఉపాధ్యాయులు వెళ్తున్నారు. ఈ క్రమంలో అడ్డదారుల్లో పాయింట్లు పొందేందుకు వెనుకాడడం లేదు. సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సిన గురువులే అక్రమాలకు పాల్పడుతుండడం సిగ్గుచేటు. అర్హత లేదని తెలిసికూడా పాయింట్లు పొందేందుకు వక్రమార్గం ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు టీచర్లు పదో తరగతి, సీసీఈ పాయింట్లు రెండు వేసుకుంటూ ‘డబుల్ ధమాకా’ కొడుతున్నారు. ‘దొరికితే దొంగ దొరక్కపోతే దొర’ అనే ధోరణిలో పాయింట్లు వేసుకుంటున్నారు. అధికారులు గుర్తిస్తే రద్దు చేసుకుందాం లేదంటే పాయింట్లు వస్తాయనే దురాలోచనతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు.
ఒకటికే పాయింట్లు వేసుకోవాలి
ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి బోధించిన పాయింట్లు కాని, సీసీఈ పాయింట్లు కాని ఏవైనా ఒక్కటే వేసుకోవాలి. పదో తరగతి పాయింట్లు ఉత్తీర్ణత శాతాన్ని బట్టి 2–5 వరకు వస్తాయి. అదే సీసీఈ పాయింట్లు కూడా ఆ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన వివిధ పరీక్షల్లో వచ్చిన ఉత్తీర్ణత శాతం ఆధారంగా 2–5 పాయింట్లు వస్తాయి. అయితే టీచరు వారి సౌలభ్యాన్ని పట్టి ఎక్కువ పాయింట్లు వచ్చే వాటిని ఉపయోగించుకుంటారు. అయితే కొందరు టీచర్లు రెండిటిలోనూ పాయింట్లు వేసుకున్నారు.
గణితం ‘లెక్క’ తప్పింది
గణితం టీచర్లకు సంబంధించిన ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ఆన్లైన్లో ఉంచారు. జిల్లాలో 827 మంది గణితం టీచర్లతో జాబితాను రూపొందించారు. అయితే జాబితాను ఒకసారి పరిశీస్తే లీలలు కనిపిస్తున్నాయి. 32వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 4 పాయింట్లు నమోదయ్యాయి. 34వ నంబర్ టీచరుకు పదోతరగతి పాయింట్లు 5, సీసీఈ పాయింట్లు 3 వచ్చాయి. 61వ సీరియల్ నంబర్ టీచరుకు పదో తరగతికి 2, సీసీఈకి 2 పాయింట్లు వచ్చాయి. 85వ నంబర్ టీచరుకు పదో తరగతి 1 పాయింటు, సీసీఈకి 3 పాయింట్లు వేశారు. 147, 479, 560 సీరియల్ నంబర్ టీచర్లు పదో తరగతి 3, సీసీఈకి 3 పాయింట్లు వేసుకున్నారు. 544 నంబర్ టీచరు పదో తరగతికి 2.5, సీసీఈకి 2 పాయింట్లు వేసుకున్నారు. ఇవి ఉదాహరణకు మాత్రమే. ప్రతి సబ్జెక్టు, ప్రతి కేడరులోనూ ఇదే పరిస్థితి.
డీఈఓ కార్యాలయ సిబ్బంది సహకారంతోనే అక్రమాలు
పాయింట్లు ఇష్టానుసారంగా నమోదు చేయడంలో కొందరు డీఈఓ కార్యాలయ సిబ్బంది చక్రం తిప్పుతున్నారు. కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి వారికి అనుకూలమైన టీచర్లందరికీ ఇలా అక్రమార్గాన పాయింట్లు వచ్చేలా సహకారం అందిస్తున్నట్లు తెలిసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ‘మిడిల్ బాస్’గా వ్యవహరిస్తున్న ఓ అధికారి నేతృత్వంలోనే అక్రమాల తంతు జరుగుతున్నట్లు సమాచారం.
లబోదిబోమంటున్న టీచర్లు
నిజాయితీగా రావాల్సిన పాయింట్లు మాత్రమే వేసుకుని బదిలీకి దరఖాస్తు చేసుకున్న టీచర్లు అడ్డదారుల్లో పాయింట్లు పొందుతున్న అయ్యవార్లతో బెంబేలెత్తుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ అబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్హత లేకుండా పాయింట్లు వేసుకున్న టీచర్లకు ఆ పాయింట్లు తొలిగించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.