రూ.110 కోట్లతో చెక్‌పోస్టుల ఆధునీకరణ
హైదరాబాద్ సిటీ: రాష్ట్ర సరిహద్దుల్లో సరకు అక్రమ రవాణాను నివారించే చర్యలకు వాణిజ్యపన్నుల శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 12 చెక్‌పోస్టులను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో పాటు సరకు అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా రూపొందించాలని నిర ్ణయించింది. ఇందుకోసం రూ. 110 కోట్లు విడుదల చేయాలని ఇటీవలే వాణిజ్య పన్నుల శాఖ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్ జిల్లా జోరజ్, నిజామాబాద్ జిల్లా తాలూరా గ్రామాల వద్ద రూ. 90 కోట్లతో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. అధునాతన పద్ధతిలో రాష్ట్రం లోపలికి, బయటకు రాకపోకలు సాగించే ప్రతి వాహనం, వాటిలోని సరుకు వివరాలు ఇక్కడ నమోదవుతాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి అక్రమ సరకు ఈ రెండు మార్గాల గుండానే తెలంగాణలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మిగతా 10 చెక్‌పోస్టుల ఆధునీకరణకు మరో 20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు.