‘చిట్టితల్లి’కి కాలేయ మార్పిడి
జ్ఞానసాయికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో శస్త్ర చికిత్స
తండ్రి నుంచి కాలేయం సేకరించిన వైద్యులు
సాక్షి, చెన్నై/ములకల చెరువు: పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధ పడుతున్న తమ బిడ్డ బాధ చూడలేక..ఆపరేషన్ చేయించే స్తోమత లేక దిక్కు తోచని స్థితిలో కారుణ్య మరణానికి అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆ తల్లిదండ్రుల మొర ప్రభుత్వాన్ని కదిలించింది. చిట్టితల్లి జ్ఞానసాయికి (9 నెలలు) చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీలో శనివారం కాలేయ మార్పిడి చికిత్స జరిగింది. డాక్టర్ మహ్మద్ రేల నేతృత్వంలో 12 మంది వైద్యులబృందం ఈ శస్త్ర చికిత్స నిర్వహించింది.
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురం రైల్వేస్టేషన్‌కు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల తొమ్మిది నెలల కుమార్తె జ్ఞానసాయి కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తమ చిట్టితల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని రమణప్ప కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం మీడియా దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్లోబల్ ఆస్పత్రి చైర్మన్ రవీంద్రనాథ్‌కు సూచించింది. దీంతో జ్ఞానసాయిని జూన్ 27న చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీకి తీసుకొచ్చారు. డాక్టర్ రేల నేతృత్వంలోని వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి అనివార్యమని తేల్చింది.
శనివారం ఉదయం శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు తండ్రి రమణప్ప కాలేయంలో కొంత భాగాన్ని సేకరించి జ్ఞానసాయికి అమర్చారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగియడంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జ్ఞానసాయిని ఐసీయూకు మార్చారు. శస్త్ర చికిత్సలు ఇద్దరికి చక్కగా జరిగాయని, ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. 24 గంటల తరువాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని గ్లోబల్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.