ఇచ్చినట్లే ఇచ్చి..
ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం కోత
ఆపై చెక్‌పవర్‌కు చెక్
ఆందోళనబాటలో సర్పంచులు
కరీంనగర్ సిటీ : కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే వచ్చాయనే సంతోషం సర్పంచులకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ నిధుల్లో నుంచి దాదాపు అరవై శాతం వివిధ పద్దుల ఖర్చులకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నిధులు ఖర్చుపెట్టే విషయంలోనూ ఈవోపీఆర్డీలు, డీఎల్పీవోలతో జాయింట్ చెక్‌పవర్ కల్పించడాన్ని నిరసిస్తూ సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
గతంలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్ నిధులే అగ్రభాగాన ఉండేవి. ఈ ఏడాది ప్రభుత్వం బీఆర్‌జీఎఫ్‌ను రద్దుచేసింది. ఆర్థిక సంఘం నిధులను నూటికి నూరుశాతం నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడగా... పంచాయతీలు మాత్రం సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం పంచాయతీలకే రానుండటంతో ఇక నిధులకు కొదువ ఉండదని సర్పంచులు సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఇంకా పూర్తిస్థాయిలో 14వ ఆర్థిక సంఘం నిధులు రాన ప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొర్రీలపై సర్పంచులు మండిపడుతున్నారు.
ఆర్థిక సంఘం నిధుల నుంచే పంచాయతీలు విద్యుత్ బిల్లుల బకాయిలు, నీటి సరఫరా పథకాలు నిర్వహణ, కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలు చెల్లించాలనే షరతులు విధించడం వారికి మింగుడుపడటం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లోంచి 30 శాతం విద్యుత్ బిల్లులకు, 20 శాతం తాగునీటి పథకాలకు, 10 శాతం ఈ–పంచాయతీలు, క్లస్టర్ పంచాయతీల్లోని కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలకు వెచ్చించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆర్థిక సంఘం నిధుల నుంచి 40 శాతం మాత్రమే గ్రామాల్లో వివిధ పనులకు ఖర్చుచేసే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులతో ఆ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయినేజీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ తదితర పనులు చేపడుతుంటారు.
వర్షాకాలం.. వ్యాధుల సీజన్ కావడంతో పంచాయతీలకు నిధులు అత్యవసరం. అయితే 60 శాతం నిధులు ముందే ఖర్చవుతుండటంతో, మిగిలిన 40 శాతం నిధులు ఏ మూలకూ సరిపోవని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం రూపంలో నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందులో నుంచి కోత విధించడం సరికాదని తమ అసంతప్తిని వ్యక్తపరుస్తున్నారు. దీనికితోడు బిల్లులు డ్రా చేసేందుకు సంబంధిత ఈవోపీఆర్డీలు, డీఎల్పీలతో సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ అప్పగించింది. దీంతో కొంతమంది అధికారులు కమీషన్ ఇస్తేనే బిల్లులు డ్రా చేసేందుకు సంతకాలు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
22న కలెక్టరేట్ ముట్టడి
ఆర్థిక సంఘం నిధుల ఖర్చులో నిబంధనలు ఎత్తివేయాలని, సీనరేజీ, తదితర నిధుల బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈనెల 22న కలెక్టరేట్ ముట్టyì తలపెట్టినట్లు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ తెలిపారు. విద్యుత్ బిల్లుల బకాయిలు ప్రభుత్వమే భరించాలని, జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని సర్పంచులందరూ తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.