సీఐటీయూ నాయకులపై కలెక్టర్ ఆగ్రహం
కడప అర్బన్ : ‘యూజ్లెస్ ఫెలోస్... గెటవుట్ ...వీళ్లను అరెస్టు చేయండి...అంటూ కలెక్టర్ కేవీ సత్య నారాయణ సీఐటీయూ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శనివారం రిమ్స్‌లో జిల్లా బాలల భవిత కేంద్రం నిర్మాణానికి శిలాఫలకాన్ని రాష్ట్ర వైద్యవిద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిమ్స్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు సీఐటీయూ నాయకులు ఓ. శివశంకర్, రామమోహన్ తదితరులు వచ్చారు. ఆ సమయంలో ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నాకేం సంబంధం.. ఈ విషయంపై కలెక్టర్‌ను అడగాలని’ మంత్రి సూచించారు. అంతలోపు కలెక్టర్ జోక్యం చేసుకుని మీరెందుకు మంత్రిని అడుగుతున్నారని చెప్పడంతో ‘తాము ప్రభుత్వం తరపున వచ్చిన మంత్రిని కాక ఇంకెవరిని అడగాలి సార్’ అంటూ వారు కలెక్టర్‌తో అన్నారు. వారి మాట తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్లెస్ ఫెలోస్...గెటౌట్ అంటూ వారిని వెంటనే అరెస్టు చేయండంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, కార్మిక నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కలెక్టర్, మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ ఆదివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.