గ్రేటర్లో ‘ఈ-పాస్’కు బ్రేక్
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చౌకధరల దుకాణాల్లో ‘ఈ-పాస్’ అమలు నిలిచిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా.. రేషన్ షాపుల్లో అమలు తలపెట్టిన ఈ-పాస్ విధానానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 1545 రేషన్ షాపుల్లో ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ అమలును నిలిపివేయాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్ డాక్టర్ రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిణి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అమలుకు ముందే నిలిపివేత
ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ-పాస్ అమలుకు అవాంతరాలు ఏర్పడ్డా.. రేషన్ షాపుల్లో అమలుకు ముందే ఈ-పాస్ ప్రక్రియ ఆగిపోయింది. డీలర్లు ఈ-పాస్‌పై ఆది నుంచి నిరాసక్తత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పౌర సరఫరాల శాఖ గత నెలలో సర్కిల్ వారిగా ఈ-పాస్ యంత్రాలపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే.. పెండింగ్ సమస్యల సాకుతో డీలర్లు శిక్షణను బహిష్కరించారు.
తిరిగి ఈనెల రెండో వారంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చినా.. తూతూ మంత్రంగా సాగాయి. సర్కిల్ వారీగా యంత్రాలు అందుబాటులో ఉంచినా వాటిని తీసుకునేందుకు డీలర్లు ముందుకు రాలేదు. సంబంధిత అధికారులు డీలర్లకు బలవంతంగా యంత్రాలను అప్పజెప్పినా..వాటిని వినియోగించకుండా పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ ప్రారంభించారు.
మరోవైపు డీలర్ల సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఈ-పాస్ అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.
మూడున్నరేళ్లుగా అడ్డంకులే..
గ్రేటర్ పరిధిలో గత మూడున్నరేళ్లుగా ఈ-పాస్ అమలుకు అడ్డంకులు తప్పడం లేదు. నగరంలోని సర్కిల్‌కు ఐదు చొప్పున 45 రేషన్ షాపుల్లో ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ (ఈ-పాస్) అమలవుతున్నా విస్తరణ మాత్రం ముందుకు సాగలేదు. అమలవుతున్న షాపుల్లో మాత్రం ప్రతి నెలా సుమారు 34 శాతం సరుకు మిగులుతోంది. అయితే, ఈ-పాస్ ప్రయోగాన్ని అన్ని రేషన్ షాపులకు విస్తరించకుండా డీలర్లు అడ్డుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుత ఉత్తర్వులతో డీలర్లు పైచేయి సాధించారు. గ్రేటర్లో మొత్తం 12 సర్కిళ్లలో సుమారు 1545 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 13.96 లక్షల కార్డులు ఉండగా, ప్రతి నెలా 29,459 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం కేటాయింపు జరుగుతోంది. ఇందులో కనీసం 30 శాతం సరుకు పక్కదారి పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ-పాస్ అమలుతో పక్కదారి పట్టే బియ్యం మిగులు నిల్వగా మారే అవకాశం ఉంది.