'తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
విజయవాడ: తుఫాను నేపథ్యంలో జిల్లాలోని తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు బుధవారం విజయవాడలో విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తీర ప్రాంత గ్రామాల వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు వివరించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి తుఫానుగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని కలెక్టర్ బాబు హెచ్చరించారు.