మండుటెండల్లో చలువ పందిళ్లు...
శీతల పవనాలు మేనిని తాకి గిలిగింతలు పెట్టాలి... మంచుదుప్పటి కప్పుకున్న గిరులు మదిని పులకరింపజేయాలి... నేలంతా పరుచుకున్న పచ్చదనం, ఆకాశాన్నంటే తరువులు హృదయాన్ని పరవశింపజేయాలి.. ఆశలు బాగానే ఉన్నాయి కాని, వేసవిలో ఇవన్నీ సాధ్యమా?! అని నిరుత్సాహపడకండి. సాధ్యమే! జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభవాలను మూటకట్టుకోవడానికి సిద్ధం కండి. ఎలా అంటారా.. ఈ వారం విహారితో కలసి వేసవి విహారానికెళదాం రండి.
వేసవి వస్తుందనగానే చాలామంది ప్రముఖులు శీతలదేశాలలో గడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సినిమా స్టార్లయితే షూటింగ్‌ల వంకతో విదేశాలకు వెళ్లిపోతారు. మరి మనమాటేమిటి? ఇప్పటికే ఓ వైపు పరీక్షల వేడి, ఇంకోవైపు ఎలక్షన్ల వేడితో భానుడు మరింత నిప్పులు చెరుగుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ సందడి కాస్త సద్దుమణిగాక సరదాగా కుటుంబంతో కలిసి చల్లగా సేదతీరాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకు తగినట్టే ముందుగానే ఏర్పాట్లు చేసుకునేవారు చల్లని ప్రదేశాలు ఏవో తెలుసుకుంటే ఎంపిక సులువు అవుతుంది.
శిఖరాల గని
సిక్కిం
హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగిన భారతదేశ రాష్ట్రం సిక్కిం. ఉత్తరాన నేపాల్, తూర్పున టిబెట్, ఆగ్నేయాన భూటాన్ అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచంలో 3వ ఎత్తై శిఖరమున్న కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్‌లలో విస్తరించి ఉంది. ఎన్నో ప్రకృతి సౌందర్యాలకు నెలవైన ప్రాంతం కావడంతో పర్యాటకులను వేసవిలో విశేషంగా ఆకర్షిస్తోంది సిక్కిం. ఇక్కడ 1500 మీటర్ల ఎత్తై ఓక్, బిర్ ఆల్డర్.. వంటి ఎత్తై చెట్లు, 5 వేలకు పైగా పుష్పించే మొక్కలు, కస్తూరి జింకలు, నల్ల ఎలుగుబంట్లు, పాండాలు కనిపిస్తాయి. జనాభా తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో భౌగోళిక కారణాల వల్ల రైలు, విమానమార్గాలు లేవు. పొరుగు రాష్ట్రమైన పశ్చిమబెంగాల్లోని గ్యాంగ్‌టక్ విమానాశ్రయం 124 కి.మీ. దూరంలో ఉంది. 16 కి.మీ. దూరంలో ఉన్న సిలిగిరిలో రైలు స్టేషన్ ఉంది. సిలిగిరినీ, గ్యాంగ్‌టక్‌ను కలుపుతూ జాతీయరహదారి ఉంది.
www.sikkimtourism.travel.com
సౌందర్యసీమ
కులూమనాలి
దేవతల లోయగా పిలువబడే కులూ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ అందమైన జిల్లా. సముద్రమట్టానికి 1,230 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతం చుట్టూ ఎత్తై కొండలు, దేవదారు వనాలు, నదులు, యాపిల్ తోటలు ఉన్నాయి. ఇవే గాక కోటలు, ధార్మిక క్షేత్రాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. కులూ లోయకు ఉత్తర కొసన 45 కి.మీ దూరంలో మనాలీ మంచుతో కప్పబడిన శిఖరాలతో కనువిందు చేస్తుంటుంది.ఇది ప్రసిద్ధి చెందిన హనీమూన్ స్పాట్! వేసవిలో ట్రెక్కింగ్‌కి, శీతాకాలంలో స్నో స్కీయింగ్‌కి పేరు గాంచింది సమీప విమానాశ్రయం భుంటార్. సమీప రైల్వేస్టేషన్ జోగీందర్ నగర్ బస్సు సౌకర్యం ఉంది.
సిమ్లా!
హిమాచల్‌ప్రదేశ్ రాజధాని, దేశంలో ప్రఖ్యాతిగాంచిన హిల్ రిసార్ట్‌గా పేరొందిన సిక్కిం హిమాలయాల దిగువన ఉంది. పైన్, ఓక్ చెట్ల సౌందర్యం, ఉత్తరాన మంచుతో కప్పబడిన ప్రాంతాలు, విస్తారమైన లోయలను చూస్తుంటే అద్భుతమైన అనుభూతి సొంతమవుతుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్.
email: shimla@hptdc.in
చిన్న టిబెట్
లడఖ్
హిమాచల్ ప్రదేశ్ చిట్టచివర ఉండే లాహుల్ జిల్లాను దాటి వెళితే లడఖ్‌లోని మంచుశిఖరాలను దర్శించవచ్చు. టిబెట్ సంస్కృతిని తెలుసుకోవచ్చు. భూతల స్వర్గమైన కాశ్మీర్ అందాలనూ తిలకించవచ్చు. జీవితకాల అనుభూతిని మిగిల్చే లడఖ్ ప్రాంతం జమ్మూ, కాశ్మీర్‌కు ఉత్తరాన లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలలో విస్తరించి ఉంది. ఇక్కడ నుంచి 434 కి.మీ దూరంలో శ్రీనగర్, 474 కి.మీ. దూరంలో మనాలీ, శ్రీనగర్ నుంచి 204 కి.మీ. దూరంలో కార్గిల్ పట్టణం ఉన్నాయి. బౌద్ధమతం ఎక్కువగా వ్యాపించి ఉండటం వల్ల లడఖ్‌ను ‘చిన్న టిబెట్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటే, శీతాకాలం మైనస్ 25 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది.
లేహ్‌లో విమానాశ్రయం ఉంది.
కాశ్మీర్ నుంచి శ్రీనగర్-లేహ్ జాతీయరహదారి మీదుగా వెళ్లొచ్చు.
వేసవిలో మోటార్ సైకిల్ సాహస యాత్ర, ట్రెక్కింగ్, రివర్ర్యాఫ్టింగ్.
వేసవిలోనూ రాత్రి, పగలు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు పగలు అత్యంత వేడిగానూ, రాత్రిళ్లు అత్యంత చల్లగానూ ఉంటుంది.
కార్గిల్ టూరిజం ఫోన్ నం.: +9101985232545
చల్లని వెన్నెలలో...
డార్జిలింగ్
పశ్చిమబెంగాల్లోని పట్టణం డార్జిలింగ్. అద్భుతమైన మంచుకొండలతో అలరారే ఈ ప్రాంతం నవ జంటలకు హనీమూన్ స్పాట్‌గా పేరుపొందింది. హిమాలయాల దిగువ ప్రాంతంలో శివాలిక్ కొండలలో డార్జిలింగ్ ముఖ్య కేంద్రం. తేయాకు పరిశ్రమకు, ప్రాచీన హిమాలయ రైల్వేకు ఇది ప్రసిద్ధి. ఎత్తై పర్వతప్రాంతాలకు డార్జిలింగ్ మహారాణి అని చెప్పవచ్చు. ఇక్కడ వేసవి (మే-జూన్) ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్. టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్నప్పుడు వేల మంది టిబెట్ శరణార్థులు డార్జిలింగ్‌లో స్థిరపడ్డారు. దీంతో భిన్న జాతి జనాభాగల ప్రాంతంగా డార్జిలింగ్ పేరొందింది.
డార్జిలింగ్‌కు 96 కి.మీ. దూరంలో బగ్‌డోగ్రాలో విమానాశ్రయం ఉంది. ఢిల్లీ, కోల్‌కతా, గౌహతి ప్రాంతాలను కలుపుతూ ఇండియన్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ దక్కన్‌లు సర్వీసులు నడుపుతున్నాయి. సమీప రైల్వే స్టేషన్ న్యూ జల్పాయ్గురి.
డార్జిలింగ్ టూరిజం ఫోన్ నం.:
+91354 2254879/2255351
వన్నెతరగని తరులు... గిరులు...
కూర్గ్
ఎప్పటికీ వన్నెతరగని మంచు పడే కొండ ప్రాంతాలు, ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అడవులు, లోయలు, విస్తారమైన కాఫీ తోటలు, టీ ఎస్టేట్లు, నారింజ తోటలు, వేగంగా ప్రవహించే జలపాతాలతో అలరారుతుంటుంది కూర్గ్. కర్ణా టకలో మరో కాశ్మీర్‌గా చెప్పుకునే ఈ ప్రాంతం అసలు పేరు కొడగు. ఈ జిల్లాకు వాయవ్యాన దక్షిణ కన్నడ, ఉత్తరాన హసన్, తూర్పున మైసూరు, నైరుతిన కేరళ, దక్షిణాన వయనాడ్ జిల్లాలు సరిహద్దులు. నూతన దంపతుల ఆనం ద విహారానికి సిసలైన ప్రాంతంగా కూర్గ్‌కు పేరుంది. కూర్గ్‌కు మడకేరి పట్టణం ప్రధాన కేంద్రం. మడికేరి కోట, మ్యూజియమ్, పిల్లల కోసం టాయ్ ట్రెయిన్, కావేరీ నదిలో నౌకా విహారం, ఏనుగుల మందల షికారు, గిరిజనుల ఉత్సవాలు, అబ్బి, ఇర్పు, మల్లలి జలపాతాలు... ఎన్నో అబ్బురపరుస్తుం టాయి. ట్రెక్కింగ్, గోల్ఫ్, చేపలు పట్టడం, రివర్ర్యాఫ్టింగ్ వంటి వాటికి ఎన్నో అవకాశాలున్నాయి. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి పుష్పగిరి హిల్స్, కోటిబెట్ట, ఇగ్గుతప్ప, నిషాని మోటి, తడియాండ్రమోల్ ప్రదేశాలు అనుకూలం. ట్రెక్కింగ్, గైడ్, వసతి, భోజన సదుపాయాలున్నాయి. రోజుకు ఒకరికి రూ. 750/-తో లాంగ్ ట్రెక్ ట్రిప్‌కు వెళ్లొచ్చు. ఇక్కడ రాజశేఖర్, గణేష్‌లు పేరున్న గైడ్లు. వీరి ఫోన్ నం.
229102, 229974. సాహసవిన్యాసాలు చేయాలనుకునేవారు ఈ ఫోన్ నం. 080-41159270లో సంప్రదించవచ్చు.
మైసూర్ నుంచి 165 కి.మీ., మంగళూరు నుంచి 170 దూరంలో ఉంది కూర్గ్ బెంగుళూరు నుంచి ప్రతి రోజూ 7 డీలక్స్ బస్సులున్నాయి.
www.coorgplaneterscamp.com
రిమ్జిమ్ రిమ్జిమ్...
రుషికేశ్
మనదేశంలో 7 పవిత్ర పట్టణాలలో ప్రధానమైనది గంగానది తీరాన ఉన్న హరిద్వార్! హరిద్వార్‌లో 12 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ఈ ప్రాంతానికి 24 కి.మీ. దూరంలో రుషికేశ్ ఉంది. ఇక్కడ వేసవి ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్. ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందుతున్న రుషికేశ్ ప్రపంచ యోగాకు కేంద్రంగా పిలవబడుతోంది. ఇక్కడ ట్రెక్కింగ్, రివర్ ర్యాఫ్టింగ్, బంగీజంప్... వంటి సాహసకృత్యాలెన్నో చేయవచ్చు. హిమాలయా ల చెంత పర్వతారోహణ చేపట్టవచ్చు.
17 కి.మీ. దూరంలోని డెహ్రాడూన్‌లో విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీ 224 కి.మీ.
24 కి.మీ. దూరంలో హరిద్వార్ రైల్వేస్టేషన్ ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలులో చేరుకోవచ్చు.
రుషికేశ్ నుంచి రోడ్డుమార్గాన ఆగ్రా 398 కి.మీ., బద్రీనాథ్ 300 కి.మీ., చంబ 63 కి.మీ., డెహ్రాడూన్ 40 కి.మీ., ఢిల్లీ 224 కి.మీ., గంగోత్రి 249 కి.మీ., యమునోత్రి 222 కి.మీ, శ్రీనగర్ 105 కి.మీ. దూరంలో ఉన్నాయి.
పర్యాటక సమాచార కేంద్రం
హరిద్వార్ ప్రాంతీయ పర్యాటక కేంద్రం ఫోన్ నం. 01334-227370
ఉల్లాసంగా.. ఉత్సాహంగా!
ఊటీ కొడెకైనాల్
తమిళనాడులో నీలగిరి పర్వతాలపై నెలకొన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఊటీ. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవి విడిది కేంద్రంగా పేరొందింది. వేసవిలో పర్యాటకులు అధికంగా ఇక్కడకు చేరుకుంటారు. ఆంగ్లేయులు ఊటీని ‘క్వీన్ ఆఫ్ హిల్స్’గా పిలిచేవారు. ఊటీతోపాటు కూనూర్, కొత్తగిరి పర్వతప్రాంతాలు కూడా చూడదగ్గవే! నీలగిరి కొండల్లోని అద్భుత సౌందర్యం మనసును ఆహ్లాదపరస్తుంది. చూడవలసిన ప్రదేశాలు బొటానికల్ గార్డెన్స్, గులాబీల ఉద్యానవనం, దొడ్డబెట్ట శిఖరం, ఊటీ బోట్వేస్, కాఫీ తోటలు, సరస్సులు, జలపాతాలు. ఇక్కడ వేసవి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్.
104 కి.మీ. దూరంలో కోయంబత్తూర్‌లో విమానాశ్రయం. హైదరాబాద్ నుంచి నేరుగా చేరుకోవచ్చు. శబరి ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళుతుంది. మెట్టుపాలెం నుంచి ఊటీకి మౌంటెయిన్ ట్రెయిన్ ఉంది.
కొడెకైనాల్‌కు 121 కి.మీ. దూరంలో మదురైలో విమానాశ్రయం ఉంది. 64 కి.మీ దూరంలో పళని రైల్వేస్టేషన్ ఉంది. మదురై, పళని, బెంగళూరు, కోయంబత్తూర్, తిరుపతి నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి.
www.tamilnadutourism.org
వేసవి సందర్శన స్థలాల సమాచారానికి:
ఇండియా టూరిజం, బాలయోగి పర్యాటక భవన్, బేగంపేట్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.
ఫోన్ నం.: 040-23409199. email: ithyd-tour@nic.in
లాహిరి లాహిరి లాహిరిలో...
శ్రీనగర్
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి శ్రీనగర్ వేసవికాలపు రాజధాని. కాశ్మీర్ లోయలో జీలం నది ఒడ్డున ఉందీ నగరం. అందమైన ఉద్యానవనాలు, హస్తకళలు, డ్రై ఫ్రూట్స్‌కు ఈ ప్రాంతం ప్రసిద్ధి. సరస్సులలో తేలియాడే పడవల ఇళ్లలో విహరిస్తూ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అంటూ పాటలు పాడుకోవచ్చు. ఇక్కడి వేసవి ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్. శ్రీనగర్‌కు 32 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానా శ్రయం, జమ్మూలో రైల్వేస్టేషన్ ఉన్నాయి. జాతీ య రహదారి జమ్మూ-శ్రీనగర్‌ను కలుపుతుంది. పర్యాటకులు ట్రెక్కింగ్ షూ, రెయిన్ కోట్ తప్పని సరిగా తీసుకెళ్లాలి.
dtk@jktourism.org