సీనియర్ నటుడికి నోటీసులు!
ముంబై: అక్రమ నిర్మాణం విషయంలో బాలీవుడ్ సీనియర్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మతోపాటు, ఇర్ఫాన్ ఖాన్‌కు ఒకే సమయంలో నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్‌లోని డీఎల్హెచ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు.
ఈ ఇద్దరు కూడా తమ ఫ్లాట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు 2014లో బొంబాయి మున్సిపాల్ కార్పొరేషన్ (బీఎంసీ)కు ఫిర్యాదులు అందాయి. అదే సంవత్సరం నవంబర్‌లో ఈ విషయమై బీఎంసీ నోటీసులు జారీచేసింది. 2014 డిసెంబర్లో సంబంధిత అపార్ట్మెంట్ బిల్డర్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఊరటనిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అపార్ట్మెంటులోని తొమ్మిదో అంతస్తులో కపిల్ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్ ఖాన్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించిన బీఎంసీ న్యాయనిపుణుల సలహా తీసుకొని తాజాగా మరోసారి వారికి నోటీసులు జారీచేసింది. ఈ అపార్ట్మెంట్లో అక్రమ నిర్మాణాల గురించి సెప్టెంబర్ 9న తాజాగా మున్సిపల్ కమిషనర్ అజయ్ మెహతాకు నివేదిక అందిందని, గణేష్ ఉత్సవాలు ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నటుల అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకునే అవకాశముందని బీఎంసీ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.