రాజ్యసభ ప్రొరోగ్
ఎగువ సభను అర్ధంతరంగా ముగించిన ప్రభుత్వం
భూసేకరణ ఆర్డినెన్స్ పునఃజారీకి మార్గం సుగమం
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌ను.. పునఃజారీ చేయటం కోసం రాజ్యసభ బడ్జెట్ సమావేశాల కాలాన్ని తగ్గించి.. శనివార ం నిరవధికంగా వాయిదా (ప్రొరోగ్) వేశారు. రాజ్యసభ 234వ సమావేశాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిరవిధికంగా వాయిదా వేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ బడ్జెట్ సమావేశాలకు ఈ నెల 20వ తేదీ నుంచి సెలవులు ఉండగా.. వచ్చే నెల 20వ తేదీన తిరిగి సమావేశం కావాల్సి ఉంది. ఈ సమావేశాలు మే 8వ తేదీ వరకూ కొనసాగాల్సి ఉంది. అయితే.. తాజాగా రాజ్యసభను ప్రొరోగ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటంతో ఈ సమావేశాలు ముగిసినట్లయింది.
భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఏప్రిల్ 5వ తేదీతో ముగియనుంది. దీనిస్థానంలో చట్టం తెచ్చేందుకు.. 2013 భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన భూసేకరణ బిల్లును బడ్జెట్ భేటీల ఆరంభంలోనే లోక్‌సభలో ఆమోదించారు. ఆ బిల్లు రాజ్యసభలో ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోయింది. ఎగువసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం దీనికి కారణం. ఆర్డినెన్స్ గడువు ముగిసే లోగా దాని స్థానంలో చట్టం తీసుకురానట్లయితే.. అది చెల్లుబాటు కాదు. గడువు ముగిసే లోగా మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆర్డినెన్స్ జారీ చేయాలంటే.. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభ అయినా నిరవధికంగా వాయిదాపడి ఉండాలి.