కొపాక్జోన్పై మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు
నాట్కో ఫార్మా వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధానికి సంబంధించి మరో పేటెంట్ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై ఇజ్రాయెల్‌కు చెందిన తెవా ఫార్మాకు ఉన్న మూడో పేటెంటు చెల్లనేరదని అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో తెలిపింది. కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు. ఈ ఔషధ పేటెంట్ హక్కులున్న యెడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వీటి లెసైన్సును తెవా ఫార్మాకి ఇచ్చింది.
తాజాగా 40 మి.గ్రా. మోతాదులో జనరిక్ వెర్షన్ తయారీ దిశగా నాట్కో, మైలాన్ ఈ పేటెంట్లను సవాలు చేశాయి. ఇరు సంస్థల ఒప్పందం ప్రకారం నాట్కో ఈ ఔషధాన్ని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు పేటెంట్ల విషయంలో మైలాన్‌కు సానుకూలంగా ఉత్తర్వులు రాగా.. మూడో పేటెంటుపైనా తాజాగా ఆదేశాలు వచ్చాయి. అమెరికా మార్కెట్లో కొపాక్జోన్ 40 మి.గ్రా. అమ్మకాలు జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో 3.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా స్వల్పంగా లాభపడి రూ. 680 వద్ద ముగిసింది.