బీబర్.. నువ్వు మాకొద్దు, వెళ్లిపో..!
అతడి సంగీతపు మత్తులో ఓలలాడిన సంగీత ప్రియులు అతగాడిని మనసుల్లో పెట్టుకొన్నారు. అలాంటిది అతడు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడన్న విషయాన్ని వాళ్లు ఎలా సహించగలరు? బీచ్‌లో డ్రగ్స్తీసుకొంటూ దొరికిపోయాడనే వార్తలను విని వాళ్లు ఎలా తట్టుకోగలరు? ‘‘బీబర్ మేము నీ ఫ్యాన్స్‌మి.. ‘బిలీబర్స్’మి’ అంటూ చెప్పుకుని గొప్పగా మురిసిపోయిన వారంతా... ఇప్పుడు ‘బీబర్ నువ్వు వెళ్లిపో..’ అని అంటున్నారు. ఎందుకంటే... సంగీత ప్రపంచంలో ఆకాశమంత ఎత్తున నిలబడిన జస్టిన్ బీబర్... వ్యక్తిగా విలువలను మరిచి పాతాళానికి పడిపోయాడు!
కెనడా వాడైనా అమెరికాలో పాప్‌స్టార్‌గా ఎదిగిన యువకుడు జస్టిన్‌బీబర్. పాప్ మ్యూజిక్‌ను అమృతంగా భావించి, పాప్ సింగర్స్‌ను దేవతలుగా చూసే అమెరికన్లు జస్టిన్ బీబర్‌ను కూడా ఆదరించారు. అభిమానించారు.
కానీ ఇటీవల మియామీ బీచ్‌లో డ్రగ్స్ తీసుకొంటూ పోలీసులకు దొరికిపోయిన అతడిని వాళ్లు క్షమించలేకపోతున్నారు. తమ దేశంలో ఉండటానికే వీలు లేదని నినాదాలు చేస్తున్నారు. డ్రగ్స్ మత్తు సంగీతానికి శ్రుతి తప్పించడమే గాక, అతడిని అభిమానించే యువతరాన్ని అపసవ్య మార్గంలో నడిపించే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ బీబర్ వ్యతిరేక ఉద్యమం ఊపందుకొంటోంది. బీబర్‌ను అమెరికా నుంచి పంపేయమంటూ ఇప్పటి వరకూ దాదాపు రెండు లక్షల మంది పిటిషన్ల మీద సంతకాలు చేశారంటే వారి దృష్టిలో అతడు ఎంతగా దిగజారిపోయి ఉండాలి!
కోట్లాది మంది అభిమానులను కలిగిన వ్యక్తిగా తన బాధ్యతను విస్మరించి వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. బీబర్‌కు ఎదురవుతున్న అవమానాలు అతడి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం అని అంటున్నారు. విజయగర్వంతో విలువలకు పాతరేసేవారందరికీ బీబర్ స్థితి ఒక గుణపాఠమని, వెర్రి వేషాలు వేస్తే, అభిమానించేవాళ్ల ఆదరణను కోల్పోక తప్పదని హితబోధ చేస్తున్నారు. బీబర్ ఇప్పటికైనా కళ్లు తెరిస్తే బాగుణ్ను!