25కు 24 కిలోలే..!
భువనగిరి : జిల్లాలో బియ్యం కొనుగోలుదారుల నమ్మకాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉండాల్సిన తూకం కంటే తక్కువ ఉన్న బియ్యం బస్తాలను విక్రయిస్తున్నారు. 25 కేజీల బియ్యం బ్యాగుల్లో అర కేజీ కొన్నిసార్లు 750 గ్రాముల వరకు తరుగుదల వస్తున్నాయి. ఈ లెక్కన వినియోగదారులు ప్రతి బ్యాగు మీద నెలకు రూ.18.40 పైసల చొప్పున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో వివిధ బ్రాండ్ల పేర్లతోవ్యాపారులు తక్కువ తూకం ఉన్న బియ్యం బ్యాగులను మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. బియ్యం తక్కువ ఉన్నప్పటికీ నిర్ణీత ధరకే విక్రయిస్తుడటంతో విక్రయదారులు లాభపడుతూ విని యోగదారులు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 50నుంచి 60వరకు 25కేజీల బ్యాగులను విక్రయించే దుకాణాలు ఉన్నాయి.వీటిల్లో ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, అలేరు, రామన్నపేట, మోత్కూర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు.
జిల్లాలో బియ్యం అవసరాలు ఇలా..
జిల్లాలో 7,39,448 జనాభా ఉండగా మహిళలు 3,64,729, పురుషులు 3,74,719 ఉన్నారు. కుటుంబాలు 1,80,677 ఉన్నాయి. ప్రతి కుటుం బం సగటును ప్రతి నెలా 37కేజీల వరకు బియ్యం వినియోగిస్తున్నారు. ఈ ప్రకారంగా ప్రతి నెలా జిల్లాలో 66,750 క్వింటాళ్ల బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. ఇందులో 45,169 కుటుం బాలు బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తుండగా మిగతా వారు వ్యవసాయం ద్వారా వచ్చిన బియ్యాన్ని వినియోగిస్తున్నారు. కొనుగోలు చేసి ఆహారంగా తీసుకుంటున్న వారికి ప్రతి నెలా 16,712 క్వింటాళ్ల బియం అవసర పడుతుంది.
ప్రతి నెలా రూ.23లక్షలు నష్టం
సాధారణంగా మార్కెట్లో కొత్త బియ్యం 25 కిలోల బ్యాగుకు రూ.1,000కు, పాత వాటిని రూ.1,150కి అమ్ముతున్నారు. ఇందులో పాతవి కిలో రూ.46 వరకు, 100 గ్రాముల బియ్యానికి రూ.4.60 పైసలు ఉంటుంది. ప్రతి 25 కేజీల బ్యాగులో రూ.300 నుంచి రూ.500గ్రాముల వరకు బియ్యం తక్కువగా వస్తుండటం వల్ల ప్రతి నెలా ఒక్కో బ్యాగుపై రూ.18.40 వరకు వినియోగదారుడు నష్టపోతున్నాడు. కాగా బియ్యాన్ని కొ నుగోలు చేస్తున్న 45,169 కుటుంబాల్లో సుమారు 50శాతం అనగా వీరిలో 22,584 కుటుంబాలు తక్కువ బియ్యం వస్తున్న బ్యాగులను కొనుగోళ్లు చేస్తున్నారు. దీని ప్రకారం ఈ కుటుంబాలు ప్రతి నెలా రూ.4,15,554 నష్టపోతున్నారు. కొన్నిసార్లు కిలో వరకు తూకం తేడా ఉంటుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారు.
లోకల్ బ్రాండ్లలో ఎక్కువగా..
సాధారణంగా జిల్లాలోని వ్యాపారులు బియ్యం బ్యాగులను హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇందులో కొన్ని బ్యాగులు నాణ్యమైన బ్రాండ్ పేరుతో, మరికొన్ని లోకల్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు.ఎక్కువ శాతం లోకల్ బ్రాం డ్ పేరుతో వచ్చే 25 కేజీల బ్యాగుల్లో బియ్యం తక్కువగా వస్తున్నాయి. బ్యాగు పై 25 కేజీల బియ్యం ఉన్నట్లు ముద్ర ఉన్నప్పటికీ తూకం వేస్తే తక్కువగా ఉంటున్నాయి.
జిల్లా జనాభా : 7,39,448
కుటుంబాల సంఖ్య : 1,80,677
ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి అవసరంఅయ్యే బియ్యం : 37 కేజీల వరకు
ప్రతి నెలా మొత్తం కుటుంబాలకు కావాల్సిన బియ్యం :66,850క్వింటాళ్లు
మార్కెట్లో బియ్యం కొనుగోలు చేస్తున్న కుటుంబాలు : 45,169
వీరికి కావాల్సిన బియ్యం :
16,712 క్వింటాళ్లు
బియ్యం తక్కువగా వస్తున్న బ్యాగులను కొనుగోలు చేస్తున్న కుటుంబాలు
సగటున : 22,584
ప్రతి నెలా కుటుంబాలు నష్టపోతున్న ఆదాయం : రూ.23.22 లక్షలు
25 కిలోలు ఉండాల్సిందే..
నిబంధనల ప్రకారం 25 కేజీల బ్యాగులో 25 కిలోలు తప్పనిసరిగా ఉండాలి. తగ్గుదల ఉన్నట్లు మా దృష్టికి వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిలా వ్యాప్తంగా బియ్యం విక్రయించే దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తాం. తక్కువగా ఉన్నట్లు తేలినట్లయితే వెంటనే వారిపై కేసు నమోదు చేస్తాం.
సరోజిని, తూనికల కొలతల శాఖ, జిల్లా అధికారి