d suresh babu
-
అలుపెరుగని కలం యోధుడా...
ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితం ఆధారంగా రూ΄÷ందిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. ప్రభాకర్ జైనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాళోజీ పాత్రలో మూల విరాట్ నటించారు. విజయలక్ష్మి జైనీ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. యస్‌యస్ ఆత్రేయ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అలుపెరుగని అవిశ్రాంత కలం యోధుడా...’ పాటను నిర్మాత డి. సురేష్ బాబు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ఈ పాట చాలా బాగుంది. ఇలాంటి వీరుల కథతో సినిమా తీసిన విజయలక్ష్మి, ప్రభాకర్లకు అభినందనలు’’ అన్నారు. ‘‘ప్రజా ఉద్యమ నాయకుడైన కాళోజీగారి బయోపిక్ తీసినందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు. ఇకపైనా ఇలాంటి గొప్ప వ్యక్తుల సినిమాలు తీసేందుకు ప్రేక్షకుల ్ర΄ోత్సాహం కావాలి’’ అన్నారు ప్రభాకర్ జైనీ. ‘‘ఇలాంటి మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు బిక్కి కృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, నేపథ్య సంగీతం: మల్లిక్ యంవీకే. -
సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలు..
థియేటర్ నిండితే సినిమా వాళ్లకు కడుపు నిండినంత ఆనందం. కోవిడ్ అన్‌లాక్ వల్ల అర్ధాకలితో నడుస్తున్నాయి థియేటర్స్. తాజాగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్స్‌కు ఫుల్ మీల్స్ టికెట్ ఇచ్చింది. 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్‌లో సినిమా ప్రదర్శించుకోవచ్చంది. ఇనియ పొంగల్ నల్ వాళ్తుగళ్ చెప్పింది. తియ్యని సంక్రాంతి శుభాకాంక్షలన్న మాట. పొంగల్ పండుగ నిండుగా జరుపుకోమంది. మరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌కీ 100 శాతం సీటింగ్ అనుమతి వస్తుందా? మన సంక్రాంతి కూడా నిండుగా జరుగుతుందా? కోలీవుడ్ ఖుషీ ఖుషీ సోమవారం కోలీవుడ్ ఇండస్ట్రీ ఖుషీ ఖుషీగా ఉంది. ‘థియేటర్స్ సిస్టమ్ తిరిగి పుంజుకోవాలంటే వంద శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాల ప్రదర్శనకు అనుమతివ్వాలి’ అని తమిళనాడు ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ కోరింది. ఈ విషయమై తమిళనాడు సీయం పళని స్వామిని స్వయంగా కలిశారు తమిళ స్టార్ విజయ్. ఆయన నటించిన ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ సినిమాలు పొంగల్‌కి విడుదలవుతున్నాయి. తాజా ప్రకటనపై ఈ రెండు చిత్రబృందాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. తమిళ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేసింది. అయితే థియేటర్స్ ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేయడం కరెక్ట్ కాదేమో? అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అన్నింటిని అన్‌లాక్ చేసినప్పుడు థియేటర్స్ సగం సీటింగ్‌తో నడపడమెందుకు? అనేది ఇంకొందరి అభిప్రాయం. ఏది ఏమైనా తొమ్మిది నెలల తర్వాత థియేటర్స్ నిండుగా కనపడబోతున్నాయి. మనకూ 100శాతం సీటింగ్ ఉంటుందా? 50 శాతం సీటింగ్ ఉన్నా కూడా సంక్రాంతికి తెలుగులో పలు సినిమాలు బరిలో ఉన్నాయి. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’, విజయ్ ‘మాస్టర్’ (డబ్బింగ్), దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జాంబి రెడ్డి’, ‘క్రేజీ అంకుల్స్’ విడుదలకు సిద్ధం అయ్యాయి. మరి మన నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని ఫుల్ కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు అనుమతి కోరతారా? నిర్మాతల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ► మన దగ్గర కూడా థియేటర్లు నిండుగా ఉంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విషయమై సంప్రదించాలనుకుంటున్నాం. సంక్రాంతి రిలీజ్‌కు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. 100 శాతం సీటింగ్‌కి అనుమతి లభిస్తే బాగుంటుంది. – సి. కల్యాణ్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు ► యాభై శాతం సీటింగ్ కెపాసిటీ విషయమై ఎంహెచ్ఎ (హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ) నుంచి ఓ లేఖ అందింది. తమిళనాడు ప్రభుత్వాన్ని దాన్ని ఉపయోగించుకుని వంద శాతం సీటింగ్ కెపాసిటీకి జీవో పాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సీటింగ్ గురించి రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. – నిర్మాత డి. సురేశ్‌బాబు -
పూర్వ విద్యార్థులతో సినిమాలు
రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులతో నిర్మాత డి. సురేష్ బాబు రెండు కొత్త చిత్రాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకున్న సతీష్ త్రిపుర, అశ్విన్ గంగరాజు ఈ చిత్రాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ– ‘‘సతీష్ త్రిపుర తెరకెక్కించనున్న చిత్రం ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అదే విధంగా అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్న సినిమా ఒక ప్రముఖ వ్యాపారవేత్త హత్య చుట్టూ అల్లుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్ పూర్వ విద్యార్థులను తెలుగు చిత్ర పరిశ్రమలోనికి తీసుకురావటంలో ఇదో మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఈ రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. -
షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా?
షూటింగ్స్ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ రైట్ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్.. వ్యాక్సిన్ వచ్చే వరకూ నో క్యారవ్యాన్... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు. షూటింగ్‌లు చేయాల్సిందే – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ కరోనా వస్తుందనుకొని ప్రిపేర్ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే. అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం షూటింగ్ అంటే రిస్కే – ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్రావు రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనటం లైఫ్ రిస్కే. కానీ రిస్క్ అయినా çఫర్వాలేదు షూటింగ్ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ 7 నుండి చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం. షూటింగ్‌కి తొందరపడటంలేదు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్ కూచిభొట్ల మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ ఉండే సినిమాల షూటింగ్ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్ చేయడంలేదు. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్ చేస్తాం’’ అన్నారు. ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు – నిర్మాత డి. సురేశ్‌బాబు ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్ మీదకి వెళ్లినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్ మొదలుపెడతాను. -
నట్టింట్లోకి నెట్టుకొస్తున్న సినిమా
సినిమా ఇంకా థియేటర్లో ఉండగానే టీవీలోనో, కంప్యూటర్లోనో, సెల్ఫోన్లోనో చూసే చాన్స్ వస్తే బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానో వేరే స్టార్ హీరో సినిమానో అయితే చేతిలో ఉన్న రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే. తంతే బూరెల బుట్టలో పడ్డట్లే. సినిమా లవర్స్‌కి ‘ఓటీటీ’ ఇలాంటి బంపర్ ఆఫర్లే ఇస్తోంది. ‘ఓటీటీ’ అంటే ‘ఓవర్ ది టాప్’ అని అర్థం. ‘పై చేయి’ అన్నమాట. నిజమే.. పరిస్థితి చూస్తుంటే సినిమాకంటే ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్’దే పై చేయి అయ్యే చాన్స్ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఓటీటీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఇప్పుడు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, పార్కులు, పబ్బులు, గేమింగ్ జోన్లు.. ఇలా ఎన్నో. ఇవి కాదనుకుని ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే సినిమా అద్భుతంగా ఉండాలి. అయినా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు పదులు, వందల్లో ఉండే థియేటర్ల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. వేల థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వడంతో మహా అయితే బొమ్మ (సినిమా) ఏడెనిమిది వారాలు స్క్రీన్ మీద ఉంటుంది.. అంతే. అయితే థియేటర్లో ఉన్న సినిమా ఈ ఏడెనిమిది వారాల్లోపు ఎక్కడైనా దర్శనమిస్తే.. ఇక థియేటర్‌కి వెళ్లి చూడాలనుకున్నవాళ్లు కూడా ఇంటిపట్టునే చూడాలనుకుంటారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్.. ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాగూ వచ్చేస్తాయి కాబట్టి వచ్చినప్పుడు సినిమా చూసేద్దాం.. పనిగట్టుకుని థియేటర్‌కి వెళ్లడం ఎందుకని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. థియేటర్ అధినేతలకు ఈ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలుగు పరిశ్రమలో ఇంకా ఈ విషయమై వివాదాలు జరుగుతున్నట్లు కనిపించడంలేదు కానీ తమిళ పరిశ్రమకు చెందిన పంపిణీదారులు, థియేటర్ అధినేతలు చర్చలు మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే... రజనీకాంత్ ‘దర్బార్’ విడుదలై 50వ రోజు పూర్తి కాకుండానే డిజిటల్‌కి వచ్చేసింది. ఇక థియేటర్‌కి ఎవరు వెళతారు? కార్తీ నటించిన ‘ఖైదీ’ అయితే విడుదలైన 30వ రోజు లోపే నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఇలా అయితే సినిమా కొనుక్కున్నవాళ్ల పరిస్థితి ఏంటి? ఆడించేవాళ్ల (థియేటర్ ఓనర్స్) పరిస్థితి ఏంటి? ఈ విషయంపై తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ‘‘సినిమా విడుదలైన ఎనిమిది వారాలు లేదా 100 రోజులు తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో, టీవీ చానల్స్‌లో విడుదల చేయాలి’’ అని సినిమా కొనే ముందు అగ్రిమెంట్లో రాయించుకోవాలనుకుంటున్నారు. పంపిణీదారులు, థియేటర్ అధినేతల అభిప్రాయం ఇలా ఉంటే.. ‘‘ఒకవేళ మా సినిమాను థియేటర్లో 50 నుంచి 60 రోజులు ఆడిస్తానంటే అప్పుడు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్’లో విడుదలను జాప్యం చేస్తాం’’ అంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల ముందు కొందరు నిర్మాతలు ఓ డిమాండ్ ఉంచారు. ‘‘చిన్న సినిమాలకు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ బెస్ట్. విడుదలైన నెలలోపు ఓటీటీలో వచ్చేస్తే చిన్న సినిమా నిర్మాతకు కాస్త రెవెన్యూ వస్తుంది’’ అన్నది ఓ నిర్మాత వాదన. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇక మన తెలుగు విషయానికొస్తే... మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలైన 50 రోజులకు రీచ్ అయ్యే టైమ్‌కి నెట్టింట్లోకి రావడం విశేషం. సినిమా థియేటర్లో ఉండగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి వస్తే... ఎగ్జిబిటర్స్‌కి కొంత మేర నష్టం జరుగుతుందనే చెప్పాలి. ఒకవేళ 50 రోజుల్లో రెవెన్యూ వచ్చేస్తే.. ఆ తర్వాత బోనస్‌గా వచ్చే వసూళ్లకు గండిపడినట్లే. అయితే చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ పెద్ద వరం. టెక్నాలజీ పెరిగే కొద్దీ పెను మార్పులు వస్తుంటాయి. ఈ మార్పు అందరి మంచికీ కారణం అయితే అదేదో యాడ్‌లో ‘మరక మంచిదే’ అన్నట్లుగా ‘మార్పు మంచిదే’ అనుకోవచ్చు. ఓటీటీ కోసమే సినిమాలు నిర్మించనున్నాం – నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆహా’ పేరుతో వచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్ జరుగుతాయి. ‘‘ప్రారంభమైన రెండు వారాల్లోనే ఆరు లక్షల పైనే రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి’’ అని ‘ఆహా’ ప్రతినిధులు తెలిపారు. ఒకవైపు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు అల్లు అరవింద్.æమరి.. సినిమా విడుదల తర్వాత ‘ఓటీటీ’ ప్లాట్ఫామ్లో ప్రదర్శించాలంటే ఎన్ని వారాలు గ్యాప్ ఉండాలి? చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? అనే ప్రశ్నలకు అల్లు అరవింద్ ఈ విధంగా చెప్పారు. ►ఓ నెల తిరక్కుండానే అనూహ్యంగా ఐదు లక్షల మంది మా ‘ఆహా’ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. నాలుగైదు నెలల్లో మా యాప్‌కి ఇంత స్పందన వస్తుందనుకుంటే నెలకే వచ్చింది. సో.. ఓటీటీలకు కూడా జనం పెరుగుతున్నారు. ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడమే ఇండస్ట్రీ ఉద్దేశం. ఓటీటీ కోసమే నిర్మించే సినిమాలు అతి త్వరలో రాబోతున్నాయి. మంచి కథతో వస్తే మేమే రెండు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, ఓటీటీ కోసమే సినిమాలు తీయమని చెప్పబోతున్నాం. దీనివల్ల చాలా మందికి అవకాశాలు పెరుగుతాయి. ఓటీటీల కోసమే సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య పెరుగుతుంది. మనం థియేటర్స్‌కి వెళ్లకుండా ఓటీటీ వాళ్లకే సినిమా ఇవ్వొచ్చు, ఓ 50 లక్షలు సంపాదించుకోవచ్చనే అభిప్రాయం చిన్న సినిమా నిర్మాతలకు ఏర్పడుతుంది. ►చిన్న సినిమాలకు థియేటర్లో ఏడెనిమిది వారాల సమయం పెట్టలేం. మా సినిమాలు ఓటీటీలో పడటం లేదని చిన్న సినిమాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది.. మాకు అంత సమయం పెట్టొద్దని అంటున్నారు. అయితే ‘ఓటీటీలో ఇచ్చేట్లు అయితే డైరెక్ట్‌గా ఇచ్చేసుకోండి మాకు అవసరం లేదు’ అని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. దీన్ని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ టేకప్ చేసి రూల్స్ పెడితే బాగుంటుందను కుంటున్నా. చిన్న సినిమా అంటే నా ఉద్దేశం ఐదు కోట్ల లోపు చేసేవి. ఆ చిన్న సినిమాలకి ఓటీటీ వాళ్లు ఇచ్చేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నాలుగు వారాలు దాటాక 30 రోజుల్లోనే మేము ఇచ్చుకుంటాం అని చిన్న సినిమా వాళ్లు అడుగుతున్నారు. ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతామనే ఉద్దేశంతో ఓటీటీలకు ఇవ్వాలనుకుంటారు.. చిన్న సినిమా వాళ్లు గ్రహించాల్సింది ఏంటంటే.. నాలుగువారాల్లో ఓటీటీలో వస్తుందనుకుంటే థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన అవసరం ఏంటి? అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అది గ్రహించి చిన్న సినిమా వాళ్లు కూడా పెద్ద సినిమాల్లా ఎనిమిది వారాలకు ఒప్పుకుంటే బాగుంటుంది. అయితే పెద్ద సినిమాలు ఎలాగూ 8 వారాలు ఆడతాయిలే అని నిర్మాతలు అనుకుంటున్నారు.. ఇందుకు ఓటీటీ వాళ్లు కూడా ఒప్పుకుంటున్నారు. 8 వారాలు గ్యాప్ ఉండాలి – నిర్మాత డి. సురేష్‌బాబు ‘‘సినిమా విడుదలైన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రదర్శితం అవ్వాలంటే కనీసం ఎనిమిది వారాలు గ్యాప్ ఉండాలి. అదే కరెక్ట్ అంటాను. అయితే ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ అధినేతలు కొందరు ఈ విషయంతో ఏకీభవించడంలేదు. 30 రోజుల్లో అయితేనే డిజిటల్ ప్లాట్ఫామ్లో సినిమాని ప్రదర్శించే హక్కులు కొంటామని కొందరు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ ప్లేయర్స్ నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు. -
అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా?
సాయి రోనక్, ప్రీతి అష్రాని హీరో హీరోయిన్లుగా సుజై, సుశీల్ నిర్మించి, రచించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్ ’. ఎ. అప్పిరెడ్డి మరో నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత డి. సురేశ్‌బాబు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ములైన సుజై, సుశీల్ యూఎస్ నుండి ఇండియాకు సినిమాలు చేయాలనే ప్యాష¯Œ తో వచ్చారు. చాలా క్లారిటీతో క్లియర్‌గా సినిమా తీశారు. టిపికల్ థాట్స్‌తో వస్తున్న ఇలాంటి కొత్తవారిని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. డిఫరెంట్ టైటిల్‌తో ఆకట్టుకుంటున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. సుజై మాట్లాడుతూ– ‘‘పిల్లల్ని ఇంజినీరింగ్ చదివించడం, తర్వాత అమెరికా పంపించడం అక్కడ సెటిల్ అయ్యారని చెప్పుకోవడమే పరమావధిగా భావిస్తున్న మధ్యతరగతి తెలుగు కుటుంబాలపై విసిరిన వ్యంగ్యాస్త్రమే ఈ మా ‘ప్రెజర్ కుక్కర్’. కిషోర్ అనే కుర్రాడు ఏం చేసి అయినా యూఎస్ వెళ్లాలనుకుంటాడు. అతడు పడ్డ కష్టాలు, ఆ క్రమంలో నేర్చుకున్న కొత్త పాఠాలు, అతనిలో పెరిగిన ఆత్మవిశ్వాసం, కుటుంబ విలువల పట్ల కొత్తగా ఏర్పడ్డ గౌరవం, దీంతో అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందా? అని అతనికి కలిగే సందేహం లాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించడం జరిగింది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. సాయి రోనక్ మాట్లాడుతూ– ‘‘నాకు అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. నేను రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న పరిస్థితులనే ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలుగా కష్టపడి క్లారిటీతో స్టోరీని ప్రిపేర్ చేశారు. మంచి ఔట్ ఫుట్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘మొదటిసారి నన్ను నేను సినిమా పోస్టర్లో చూసుకోవాలనే నా కల నెరవేరింది’’ అన్నారు ప్రీతి. -
డబ్బంతా పోయినా నాన్నగారు భయపడలేదు
‘‘మా నాన్నగారి (ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు) గురించి ఆలోచించిన ప్రతిసారీ నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఆయన లేరనే ఆలోచనే చాలా కష్టంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్నో హిట్ సినిమాలు తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు డి. రామానాయుడు. ఇవాళ ఆయన జయంతి. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణరంగంలో 55ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని రామానాయుడు తనయుడు, నిర్మాత డి. సురేశ్‌బాబు చెప్పిన సంగతులు. ► మా సురేశ్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమా (‘రాముడు–భీముడు’) విడుదలై 55ఏళ్లు పూర్తయ్యాయి. 56 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి (రామానాయుడు) మద్రాసు వెళ్లి అనుకున్న బిజినెస్ కుదరక, అక్కడే సినిమాలు తీస్తున్న కంపెనీలో భాగస్వామ్యం తీసుకుని, సైలెంట్ పార్ట్నర్గా ఉండి సినిమాలు తీశారు. అక్కడ పెట్టిన డబ్బంతా పోయింది. భయపడకుండా సినిమాలు చేయడం కంటిన్యూ చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్‌మేకింగ్, ప్రొడక్షన్లో ఉన్న లోటుపాట్లను గమనించి, మెరుగుపరచాలనుకున్నారు. ► సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ బాగా ఎస్టాబ్లిష్ కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. 1964 నుంచి 70 ఒక ఫేజ్. ‘రాముడు భీముడు’ బాగా ఆడింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్. ఇక చావో రేవో అనే టైమ్‌లో 1970లో ‘ప్రేమ్‌నగర్’ తీశారు. 1970–1980లో గుడ్ టైమ్. 81–82 బ్యాడ్ టైమ్. ఆ టైమ్‌లో సినిమాలు కాకుండా వాటికి సంబంధించిన వనరులను డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు నాన్నగారు. 82లో నేను వచ్చాను. స్టూడియో, ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వైపు వచ్చాం. వెంకీ (హీరో వెంకటేశ్), నేను ఉండటం వల్ల సంస్థ ముందుకు వెళ్లింది. నాన్నగారు చనిపోయాక ఈ రోజు మేం హ్యాపీగా ఉన్నది ఒక్క విషయంలోనే.. అదేంటంటే ఆయన ఉన్న రంగంలోనే ఫ్యామిలీలో అందరూ ఆల్మోస్ట్ వర్క్ చేస్తున్నాం. ► సినిమాల్లోకి రావొద్దు. బాగా చదువుకోమని నాన్న అనేవారు. కానీ నేను సినిమా కలెక్షన్స్, సినిమా రిపోర్ట్స్ రాస్తూ సినిమాలకే కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నాతో ‘నిరంతర శత్రువులు ఉండకూడదు. క్షమించాలి, మరచిపోవాలి. బౌండ్స్క్రిప్ట్తో సినిమా మొదలుపెట్టాలి. కుటుంబానికి టైమ్ కేటాయించాలి. రోజూ నిద్రపోయే ముందు అప్పులు, లాభాలను బేరీజు వేసుకోవాలి’.. అంటూ ఇలా చాలా విషయాలను చెప్పారు. ► మా నాన్న మాటిస్తే ఆ మాట మీద ఉండేవారు. ఆ బలహీనతను తీసుకుని కొందరు డైరెక్టర్స్ ఆడని సినిమాలు తీశారు. అయినప్పటికీ ఆయన ఏమీ అనలేదు. మాట ఇవ్వడం మానలేదు. నాన్నగారు చనిపోవడానికి రెండు మూడు రోజుల ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. ‘బాలూ.. కథ చూడు. మంచి సినిమా చేద్దాం’ అన్నారు. ఆయనకు తెలిసింది సినిమానే. ► అప్పట్లో మా నాన్నగారు ఫిల్మ్‌మేకింగ్‌లో చూసిన కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే మా ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు కంటెంట్, టాలెంట్ మేనేజ్మెంట్, టెక్నాలజీ అంశాలపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం రానా, నేను కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఎకో సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నాం. ఈ కంటెంట్‌ను కేవలం సినిమాలకే కాదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ వినియోగిస్తాం. పార్ట్నర్స్ను చూస్తున్నాం. ఎలా అయితే హాలీవుడ్ వారు మార్వెల్, స్టార్వార్స్కి సినిమాటిక్ యూనీవర్స్ క్రియేట్ చేశారో, మన మైథాలజీ తో ‘అమర చిత్ర కథలు’ను అలానే ప్లాన్ చేస్తున్నాం. ► ఫిల్మ్‌మేకింగ్‌లో కొందరు యంగ్‌స్టర్స్ ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. మొహమాటంతో నేర్చుకోవడం వదిలేస్తున్నారు. ఇండస్ట్రీని తప్పు పట్టడం లేదు. కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాను. ► ఒకప్పుడు బాలీవుడ్లో ప్రొడక్షన్ పరంగా సరైన విధానాలు ఉండేవి కావు. ఇప్పుడు కార్పొరేట్ విధానాలతో మరింత ముందుకు వెళ్తున్నారు. ‘ఉరి’ లాంటి సినిమాను 45 రోజుల్లో తీశారు. మార్వెల్ అవెంజర్స్ సినిమాను వందరోజుల్లోపు తీశారు. మనం మాత్రం పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి 200 రోజులు తీసుకుంటున్నాం. ఎక్కడో మిస్టేక్స్ ఉన్నాయి. అందుకే మేం ‘ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్’ను క్రియేట్ చేస్తాం. జామ్ఎయిట్ ప్రాసెస్, థీమ్‌పార్క్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా ఎంటర్టైన్మెంట్ను 360 డిగ్రీస్ యాంగిల్లో కవర్ చేయాలనుకుంటున్నాం. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ స్టాండర్డ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎవరైనా రావొచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌ను కూడా పెట్టాలనుకుంటున్నాం. ► ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రమ్మని ఫోర్స్ చేయలేం. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు సినిమాలు చూస్తారు. పెద్ద సినిమా బాగాలేకపోయినా వెళ్తారు. చిన్న సినిమాలకు అలా ఉండదు. ‘కంచరపాలెం’తో మేం అసోసియేట్ అవ్వడం వల్ల చిన్న సినిమా అయినా ఆ స్థాయికి వెళ్లగలిగింది. ► ‘వెంకీమామ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తరుణ భాస్కర్, త్రినాథరావు దర్శకత్వాల్లో వెంకటేశ్ హీరోగా సినిమాలు ఉన్నాయి. ‘దేదే ప్యార్‌దే’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం. రానా ‘విరాటపర్వం’ త్వరలో ప్రారంభం అవుతుంది. ఇవి సురేశ్ ప్రొడక్షన్స్ పార్ట్నర్షిప్లో కావొచ్చు లేదా సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించవచ్చు. సురేశ్ ప్రొడక్షన్స్ ఫండ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. లవ్‌రంజన్ (బాలీవుడ్ డైరెక్టర్)–సురేశ్ ప్రొడక్షన్స్ జాయింట్ వెంచర్ ఉంది. అతని హిందీ సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాం. -
ఊహకి అందని కథ
‘‘మంచి ఫిల్మ్‌మేకర్ అవ్వాలని యానిమేషన్ నేర్చుకున్నా. డైరెక్షన్, యాక్టింగ్ రెండిటిలోనూ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. నటించడం, దర్శకత్వం చేయడం కష్టం అనిపించలేదు కానీ, ప్రొడక్షన్ చాలా కష్టం’’ అని విశ్వక్ సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. డి.సురేశ్‌బాబు సమర్పణలో విశ్వక్ సేన్ సినిమాస్, టెర్రనోవా పిక్చర్స్ బ్యానర్స్‌పై వాజ్ఞ్మయి క్రియేషన్స్ కరాటే రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘నేను జర్నలిజం స్టూడెంట్‌ని. రెండు సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఫిల్మ్ మేకర్ అవ్వాలని ఉందని మూడో తరగతిలోనే మా అమ్మానాన్నలకు చెప్పాను. వారు నన్ను ప్రోత్సహించడంతో ఎక్కువ మురిపెం చేస్తున్నారంటూ మా బంధువులు తిట్టారు. అయినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించాను. ‘ఫలక్‌నుమా దాస్’ నా మూడో చిత్రం. ఈ సినిమాకి నేనే డైలాగులు రాశాను. ఇందులోని భావోద్వేగాలను నాకంటే బాగా ఎవరూ పండించలేరనిపించి నేనే హీరోగా నటించాను. ఇది పక్కా ఎమోషనల్ ఫిల్మ్. కుటుంబం, స్నేహం నేపథ్యంలో ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ఎంతో మేధాశక్తి ఉన్నవారు కూడా ఊహించలేరు. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు. సాధారణంగా ఫలక్‌నుమా అనగానే అందరికీ అందమైన ప్యాలెస్ గుర్తుకొస్తుంది. కానీ, దాని వెనక ఉన్న బస్తీ గుర్తుకురాదు. ఆ బస్తీలోని ఎన్నో అందమైన ప్రదేశాలను మా సినిమాలో చూపించాం. 2005–2009 నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ కథతో కొందరు నిర్మాతలను కలిస్తే చేయడం కుదరదన్నారు.. మరికొందరు డైలాగులు మార్చమన్నారు. తీరా టీజర్ రిలీజ్ అయ్యాక సినిమా మేమే కొంటామని ముందుకొచ్చారు. తెలుగులో అంతర్జాతీయ స్థాయి సినిమాలు రావాలన్న ఆలోచన సురేశ్బాబుగారిది. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా చూడకుండా కేవలం టీజర్ చూసి మాపై నమ్మకంతో ఈ చిత్రం విడుదల చేస్తున్నారాయన. ప్రస్తుతం నేను ‘కార్టూన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నా. ఆ తర్వాత నాని నిర్మాతగా కొత్త దర్శకుడు శైలేష్‌తో ఓ సినిమాలో నటించబోతున్నా. డైరెక్షన్‌కి ఓ ఏడాది గ్యాప్ ఇస్తున్నా. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తా’’ అన్నారు. -
ఫలక్‌నుమా... తెలుగు సినిమాకి కొత్త
‘‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంలో సంభాషణలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. దీన్ని ఓ ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా కమర్షియల్ చిత్రంగా బాగా తీశారు. సంగీతం కూడా బాగుంది. ఇలాంటి చిత్రం తెలుగు సినిమాకి కొత్త. విశ్వక్ ఎంతో ఇష్టంతో నటించి, దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్ బాగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చిత్ర సమర్పకులు డి.సురేశ్‌బాబు అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. సలోని మిశ్రా కథానాయిక. కరాటే రాజు సమర్పణలో కరాటే రాజు, చర్లపల్లి సందీప్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో–దర్శకుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇటీవల 100 మంది దాకా చూశారు. వారంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. మా చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘విశ్వక్ మీద మొదట్లో నమ్మకం లేదు. అయితే తను ఓ షార్ట్ ఫిల్మ్ చూపించడంతో నమ్మకం కలిగి ఈ సినిమాలో ఓ పాత్ర చేశా’’ అన్నారు తరుణ్ భాస్కర్. ‘‘హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని కరాటే రాజు అన్నారు. ‘‘ఈ సినిమాలోని రా కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని సలోని మిశ్రా అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: మీడియా 9 మనోజ్‌కుమార్. -
8 వారాలు ఆగాల్సిందే
సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాలకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో (అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్) కనిపిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో నడుస్తున్నప్పటికీ ఆన్లైన్లో ఉండటంతో రెవెన్యూ పరంగా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని కొందరి అభిప్రాయం. అందుకే ఈ నాలుగు వారాల సమయాన్ని ఎనిమిది వారాలకు పొడిగించాలని తెలుగు నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. ‘‘ఎక్కువ రేట్లు పెట్టి కొన్నాం అని రిలీజ్ అయిన కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సినిమాను ఆన్లైన్లో పెట్టడంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. అదే ఎనిమిది వారాల గ్యాప్ ఉంటే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. -
చిన్న సినిమాలంటే చిన్న చూపు – డి.సురేశ్‌బాబు
‘‘చిన్న సినిమాలంటే చిన్న చూపు ఉండే చెడు అలవాటుకు మనం అలవాటు పడిపోయి ఉన్నాం. మంచి సినిమాలను తక్కువ మంది చూస్తున్నారు. అందుకే ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రాన్ని ఫిలిం లవర్స్‌కు, సెలబ్రిటీస్‌కి చూపించాం. అందరూ సినిమా చూసి, చాలా బావుందని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. సుబ్బారావు, రాధా బెస్సి, కేశవ, కార్తీక్ తదితరులు ప్రధాన తారాగణంగా వెంకట్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. రానా దగ్గుబాటి సమర్పణలో విజయ్ ప్రవీణ పరుచూరి నిర్మించి, నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘విజయ ప్రవీణ అమెరికా నుంచి వచ్చి వెంకటేశ్ మహా అనే కొత్త అబ్బాయితో ధైర్యంగా సినిమా నిర్మించింది. మహా కొత్త డైరెక్టర్ అయినా ప్రతి క్యారెక్టర్‌ను చక్కగా రాసి, నేచురల్‌గా తెరకెక్కించారు. అందుకే సినిమా చూసినవారందరూ అభినందించారు. ఈ సినిమా ఇంకా సక్సెస్ కావాలి. ఇది ఎంత మంచి సినిమానో ఇంకా చాలా మందికి తెలియాలి’’ అన్నారు. ‘‘సినిమాలు చేయాలనే ఆసక్తితో అమెరికా నుంచి ఇండియా వచ్చాను. వెంకట్ మహా చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం. సురేశ్‌బాబుగారు, రానాగారి సపోర్ట్‌తో సినిమాకు మంచి పేరు వచ్చింది’’ అన్నారు విజయ ప్రవీణ పరుచూరి. ‘‘యాక్టింగ్ అనేది డెడ్లీ స్పోర్ట్. చాలా ఎనర్జీ ఖర్చు అవుతుంది. నేను కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. షూటింగ్ మధ్య దాహం వేసినా ఇంటికి వెళ్లి నీళ్లు తాగి వచ్చేవాళ్లు. నటీనటులు చాలా కష్టపడ్డారు. సాంకేతిక నిపుణులు ఎంతో సపోర్ట్ అందించారు. మా సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వెంకటేశ్ మహా. నటులు మోహన్‌భగత్, కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తీ, సినిమాటోగ్రాఫర్ ఆదిత్య, సౌండ్ డిజైనర్ నాగార్జున, వెంకట్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు రాజమౌళి..ఇప్పుడు దగ్గుబాటి
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లకోసం ఇంతకుముందు సినీ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరిపిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా రాజధానిలో ప్రతిపాదించిన మీడియా సిటీ నిర్మాణానికి సంబంధించి మరో సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్‌బాబుతో చర్చలు జరిపారు. సీఆర్డీఏ సమీక్షా సమావేశానికి ఆయన్ను ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో మీడియా సిటీ నిర్మాణం, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చంద్రబాబు.. సురేష్‌బాబుతో చర్చించారు. మీడియా సిటీలో 25 ఎకరాల్లో మూవీ స్టూడియో ఏర్పాటు ప్రతిపాదన గురించి సీఆర్డీఏ అధికారులు వివరించగా.. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సురేష్‌బాబు సూచనలు ఇచ్చారు. సినీ, టీవీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితమైందని, ఏపీలోని స్థానిక నైపుణ్యతను, కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే మరో ఏడాదిన్నరలో పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ మీడియా సిటీ నిర్మాణం సృజన, కంటెంట్‌పైనే ఆధారపడబోతోందని చెప్పారు. రాజధానిలో తొమ్మిది నగరాల నిర్మాణానికి సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఎఫ్‌కు రెండు దీవులు: కృష్ణా నదిలో ఉన్న ఏడు దీవుల్లో ముఖ్యమైన రెండింటిని యూఈఏకి చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్)కు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తరఫున సీఆర్డీఏ.. బీఎల్‌ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రెండు దీవుల్లో సుమారు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, హోటల్ కాంప్లెక్స్, రిసార్ట్ విల్లాల ఏర్పాటుకు బీఎల్ఎఫ్ చైర్మన్ రామ్ బుక్సాని ప్రతిపాదనలిచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు
‘‘పెళ్ళి చూపులు’ సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్‌కి పెద్ద స్టార్‌తో సినిమా చేసే చాన్స్ వచ్చినా తగ్గాడు. తనకు ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇప్పుడా ప్రాసెస్‌లో ఉన్నాడు. ఓ రోజు తప్పకుండా హైట్స్‌కి రీచ్ అవుతాడు. అది గ్యారంటీ’’ అన్నారు నిర్మాత డి. సురేశ్‌బాబు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకుమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఆయన నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ నెల 29న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ► మా బ్యానర్లో చిన్న సినిమా చేసినా, పెద్ద సినిమా చేసినా 2 పాయింట్స్ ఉంటాయి. కొత్తవారిని, కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేయడం, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ని ఇంకా బెటర్ చేయడం. ఇస్రో లాంటి చాలా సంస్థలు పనిని క్రమశిక్షణతో ఒక ప్రాసెస్‌లో చేస్తాయి కాబట్టే వరల్డ్ క్లాస్ సక్సెస్‌ని అచీవ్ చేస్తున్నాయి. అదే రివల్యూషన్, అంత క్రమశిక్షణ ఫిల్మ్ మేకింగ్‌లోనూ రావాలి. దీన్ని ఆచరణలో పెట్టడం కష్టమేం కాదు. కచ్చితంగా చేరుకుంటాం. ► మనం సినిమా చూడ్డానికి వెళ్లి కూర్చోగానే లైట్స్ ఆఫ్ చేసి, స్క్రీన్‌పై ఏదో ప్లే చేస్తారు. ఆ వీడియోకి మనం కనెక్ట్ అయితే సినిమా హిట్.. లేకపోతే ఫ్లాప్.. సింపుల్ ఫార్ములా. సింక్ సౌండ్ ప్రాసెస్‌లోనే ఫిల్మ్ మేకింగ్ జరగాలి. ఈ రోజుల్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ► ‘ఈ నగరానికి ఏమైంది’ షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండుసార్లు సెట్స్‌కి వెళ్లాను. ప్రతీదీ పర్ఫెక్ట్గా అనిపించింది. నాన్నగారి (రామానాయుడు) బయోపిక్ రిస్క్. ‘మహానటి, సంజు’ లాంటి బయోపిక్స్ వేరు, వాళ్లు ఒకే లైఫ్‌లో మల్టిపుల్ లైవ్స్ బతికారు. నాన్నగారి లైఫ్ అలా కాదు. నిజానికి ఒక స్టోరీలో కాంట్రవర్సీస్ లేకపోతే ఆ స్టోరీ ఎవరూ వినరు.. చూడరు. ప్రస్తుతానికి నాన్నగారి బయోపిక్ ఆలోచన లేదు. ► సురేశ్ ప్రొడక్షన్స్ ఏ సినిమా నిర్మించినా పార్టనర్స్‌ని కలుపుకోవడానికే ఇష్టపడతాను. మా ప్రొడక్షన్లో బాబీ డైరెక్షన్లో వెంకటేశ్, చైతన్య సినిమా ఉంటుంది. ఒక్కో సినిమాకి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. రాజమౌళి ‘బాహుబలి’కి ఐదేళ్లు పట్టింది. మా బ్యానర్లో గుణశేఖర్ డైరెక్షన్లో ‘హిరణ్యకశ్యప’కు చాలా రోజులుగా వర్క్ జరుగుతోంది. ఏదైనా పర్ఫెక్ట్గా అయ్యాకే సెట్స్‌పైకి వస్తుంది. మేకింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. -
టైమ్ ఫర్ సెలబ్రేషన్స్!
సెలబ్రేషన్... వేడుక! అంటే... ఒక్కసారి జరుగుతుంది. సెలబ్రేషన్స్... వేడుకలు! అంటే... ఒకటికంటే ఎక్కువ. అక్కినేని కొత్త జంట నాగచైతన్య, సమంత (చైతూ–సామ్)ల మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇంకెన్ని జరుగుతాయో! గోవాలో పెళ్లయ్యాక ఓ రిసెప్షన్ జరిగిందా! తర్వాత చెన్నైలో చైతూ అమ్మ లక్ష్మీ ఓ రిసెప్షన్ ఇచ్చారా! ఇదిగో... హైదరాబాద్‌లో ఇంకో రిసెప్షన్ లేదా గెట్ టుగెదర్ (పెళ్లైన సందర్భంగా) జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందో గానీ... ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. బహుశా... దగ్గుబాటి ఫ్యామిలీ (చైతూ మేనమామలు నిర్మాత డి. సురేశ్‌బాబు, హీరో వెంకటేశ్) ఇచ్చిన రిసెప్షన్ అయ్యుంటుంది! అందులో అందరూ ఎంత సందడి చేశారో చూడండి!! -
అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు– డి.సురేశ్‌బాబు
‘‘సినిమా థియేటర్లు, సినిమా బిజినెస్ అనేవి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, టీవీ వల్ల ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే మంచి సినిమాలు తీయాలి. అంతేకాకుండా చిన్న ప్రాంతాల్లో ఉండే థియేటర్లలో కూడా లైటింగ్, సౌండింగ్ బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే ఫ్రెష్ ఆడియన్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతారు’’ అని నిర్మాత డి. సురేశ్‌బాబు అన్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘2.0’. 2010లో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 2డీలోనే కాకుండా 3డీలోనూ ప్రజెంట్ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ పేర్కొంది. దీనికోసం పలు థియేటర్లను త్రీడీలోకి మార్చడానికి సన్నాహాలు చేయనున్నారు. ఈ విశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు ఇంటికే పరిమితమైపోతే స్లోగా ఫిల్మ్ ఇండస్ట్రీ పడిపోతుంది. టెక్నాలజీ పరంగా సినిమా అప్‌గ్రేడ్ అయినప్పుడే మరింత కాలం సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఇలా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డైరెక్టర్లు అందరూ కలిసి సినిమా వ్యూను బెటర్ చేయడానికి కృషి చేయడం ఇండస్ట్రీని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ‘బాహుబలి’, ‘రోబో’ లాంటి సినిమాలను త్రీడీలో చూసినప్పుడు ప్రేక్షకులు మంచి అనుభూతి పొందుతారు’’ అన్నారు. ‘‘రోబో 2.0’ సినిమాతో త్రీడీ టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకుని, థియేటర్లలో ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ను అందిద్దాం’’ అన్నారు శరత్ మరార్. లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ– ‘‘సినిమా అంతటినీ త్రీడీలో చేయడం కాస్త రిస్క్‌తో కూడుకున్నదే. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో ఇలా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మంచి సినిమాలకు థియేటర్ల కొరత లేదు
రామచంద్రపురం : మంచి సినిమాలకు థియేటర్ల కొరత ఎప్పుడూ ఉండదని ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల రిలీజై విజయవంతమైన ‘భలే భలే మగాడివోయ్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉయ్యాల జంపాల’ చిత్రాలే ఇందుకు ఉదాహరణలన్నారు. రామచంద్రపురంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు చెందిన సూర్య సినిమాక్స్ ట్విన్ థియేటర్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సురేష్‌బాబుతో ఇంటర్వ్యూ... ప్ర: పెద్ద సినిమాల రిలీజ్‌కు మధ్య వారం రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల ద ర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం? సురేష్‌బాబు: పెద్ద సినిమాల రిలీజ్‌కు మధ్య గ్యాప్ ఉండాలనేది మంచిదే. కానీ దీనికి పరిష్కారం దొరకడంలేదు. అయితే తెలుగు సినిమాలకు సంబంధించి ఇటీవల బాహుబలి, రుద్రమదేవి మధ్య, బ్రూస్లీ, అఖిల్‌కు మధ్య గ్యాప్ తీసుకున్నారు. ఇందుకోసం థియేటర్ల కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్ర: చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఉందని అంటున్నారు.. దీనికి మీరేం చెబుతారు? సురేష్‌బాబు: ప్రేక్షకులు చూసి ఆదరించే విధంగా సినిమాలు తీస్తే థియేటర్లకు కొరత ఉండదు.చిన్న చిత్రాలైనా, పెద్దచిత్రాలైనా ప్రేక్షకాదరణ పొందేలా ఉండడమే ప్రధానం. ప్రశ్న: గ్రామీణ ప్రాంతాలలో సైతం మల్టీప్లెక్స్ థియేటర్లు రావడంపై మీ కామెంట్? సురేష్‌బాబు: థియేటర్లు ఆధునిక హంగులతో ఉంటేనే ప్రేక్షకులు వస్తారు. కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరల్లోనే అన్ని హంగులతో థియేటర్లు ఉండడం మంచిదే. సాంకేతిక విజ్ఞానాన్ని ప్రేక్షకులు ముంగిటికి తీసుకురావడం మంచి పరిణామం. ప్ర: మీ కొత్త సినిమాల గురించి చెప్పండి? సురేష్‌బాబు: త్వరలో రాణాతో, ఆ పైన వెంకటేష్‌తో భారీ చిత్రాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక చిన్న చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నాము. -
భీమవరం బుల్లోడు ప్లాటీనమ్ డిస్క్ ఫంక్షన్
-
భీమవరంలో సందడి చేయనున్న బుల్లోడు
‘‘ఈ సినిమాలో ఓ కోణంలో అమాయకంగా, మరో కోణంలో ధైర్యంగా కనిపిస్తాను. పొట్ట చెక్కలయ్యే కామెడీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. నా కెరీర్లో మైలురాయిలా నిలిచే సినిమా ఇది’’ అని సునీల్ అన్నారు. ‘కలిసుందాం రా’ ఫేం ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘భీమవరం బుల్లోడు’. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 22న భీమవరంలో ఈ చిత్రం పాటల్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇటీవలే తెరకెక్కించిన ప్రమోషనల్ సాంగ్నిత్వరలోనే విడుదల చేస్తాం. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పెళ్లికానీ కుర్రాడు, ప్రేమ జ్వరం ఉన్నోడు, స్నేహమంటే ప్రాణమిచ్చేవాడు... ఇది భీమవరం బుల్లోడి నైజం. సునీల్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇది’’ అన్నారు. ఇంకా అనూప్‌రూబెన్స్, శ్రీధర్ సీపన, చంద్రబోస్ తదితరులు మాట్లాడారు. కెమెరామేన్ సంతోష్‌రాయ్, కొరియోగ్రఫర్ భాను, సయాజీ షిండే, సామ్రాట్, పృథ్వీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రేమ ఇష్క్ కాదల్ మరో ‘హ్యాపీడేస్’ కావాలి
‘‘నిర్మాత గోపీ ఓ నిబద్ధతతో ఈ స్థాయికి చేరుకున్నాడు. తను కథను బాగా జడ్జ్ చేయగలడు. తను ఇప్పుడు తీసిన ఈ సినిమా మరో ‘హ్యాపీడేస్’ కావాలి’’ అని హీరో శివాజీ అన్నారు. డి.సురేష్‌బాబు సమర్పణలో పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ (గోపీ) నిర్మిస్తున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సునీల్ పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ‘అల్లరి’ నరేష్, నారా రోహిత్‌కు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు పవన్ ఈ సినిమాతో పవన్‌కల్యాణ్‌ని డెరైక్ట్ చేసే స్థాయికి ఎదగాలి. అలాగే ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని, మహేశ్‌బాబుతో పనిచేసే రేంజ్‌కి రావాలి’’ అని ఆకాంక్షించారు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ -‘‘బాలీవుడ్లో చిన్న సినిమాలకు చాలా వేదికలున్నాయి. టాలీవుడ్లో కూడా అలాంటి వేదిక కావాలనే ఈ సినిమాలో భాగస్వామినయ్యా’’ అన్నారు. సురేష్‌బాబు ఈ సినిమాలో భాగమైనందుకు గర్విస్తున్నానని బెక్కెం గోపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్, బెల్లంకొండ సురేష్, నందినీరెడ్డి, దశరథ్, గోపీచంద్ మలినేని, కోన వెంకట్, మహత్, అరవింద్ కృష్ణ, కమల్ కామరాజు, విజయ్‌కుమార్ కొండా, తనీష్, అడివి శేష్, శ్రవణ్, హర్షవర్థన్ రాణే, వితిక శేరు, విష్ణువర్థన్, రీతూవర్మ, హరీష్, శ్రీముఖి, కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడారు.