భారత్ మమ్మల్ని బెదిరిస్తోంది
న్యూఢిల్లీ: స్వీడన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'బోఫోర్స్' అంశం గురించి చెప్పిన విషయాలు ప్రచురించొద్దంటూ భారత్ చాలా ధృడంగా చెప్పిందని, ఓ రకంగా బెదిరించినట్లుగా చేసిందని స్వీడన్ పత్రిక డాగెన్స్ నిహెట్టర్ తెలిపింది. భారత రాయభారి పంపించిన లేఖ చూసి తాను ఆశ్యర్య పోయానని పత్రిక చీఫ్ ఎడిటర్ పీటర్ వోలోదర్ స్కీ చెప్పారు. బోఫోర్స్... కుంభకోణం అని ఇప్పటివరకు భారత్ లోని ఏ కోర్టు చెప్పలేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డాగెన్స్ నిహెట్టర్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై మీడియానే విచారణ చేసింది తప్ప.. ఒక్క కోర్టులోనూ స్కాంగా నిరూపితం కాలేదని ఆయన చెప్పారు.
అయితే, ఇదే విషయాన్ని ఆ పత్రిక ప్రచురించడంపట్ల భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు డాగెన్స్ తెలిపింది. డాగెన్స్ చెప్పిన వివరాల ప్రకారం స్వీడన్లోని భారత రాయభారి బనశ్రీ బోస్ హరిసన్ ఓ లేఖ రాశారు. అందులో 'ఇంటర్వ్యూలో రాష్ట్రపతి నోటి నుంచి తుళ్లిపడిన మాటలను, పైగా ఆన్ రికార్డుగా ఉంచాల్సిన మాటలను ఇలా ప్రచురించడం పూర్తిగా వృత్తికాదు, నైతికత అనిపించుకోదు' అని అందులో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రపతి ఆదివారం స్వీడన్లో పర్యటించనున్నారని, దానిని వ్యాసంగా ప్రచురించడం మానుకోకపోతే ఆ పర్యటన కూడా రద్దు చేసే అవకాశం ఉందని కూడా బెదరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. భారత్ ప్రతిస్పందన తామెదో తప్పుచేసినట్లుగా అనిపించిందని, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండి ఆ విషయాన్ని చిన్నదిగా చేసి చూపించాలని ప్రయత్నిస్తోందని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. దీంతోపాటు తమ దేశ ప్రతినిధులుగా ఉన్న తాము తెలుసుకున్న విషయాలను ప్రచురించడం తమ బాధ్యత కూడా అన్నట్లుగా ఎడిటర్ పీటర్ వోలోదార్ స్కీ చెప్పారు.