సోనీ ఫ్యాన్స్ కు చేదు వార్త!
భారత్ లో సోనీ మొబైల్ ఫ్యాన్స్ కు ఆ కంపెనీ చేదు వార్త వినిపించింది. ఇకపై భారత్, చైనా, అమెరికా మార్కెట్లపై తక్కువ దృష్టి సారించాలని ఇన్వెస్టర్ల సమావేశంలో ఆ కంపెనీ నిర్ణయించింది. ఈ దేశాల్లో సంతృప్తికరమైన రీతిలో అమ్మకాల వృద్ధి నమోదు చేయకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్, చైనా, అమెరికాల్లో స్మార్ట్ ఫోన్ అమ్మకాల వృద్ధి కేవలం 0.3 శాతం మాత్రమే ఉంటుందని సోనీ అంచనావేస్తోంది. దీంతో ఈ ప్రాంతాల్లో సోని వ్యాపారాలపై "డీఫోకస్" చేయాలని నిర్ణయించినట్టు రిపోర్టు వెల్లడించాయి. దీంతో స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ముందంజలో ఉన్న ఈ దేశాల్లో సోనీ స్మార్ట్ ఫోన్లను మాత్రం చేదు అనుభవమే ఎదురైనట్టు తెలుస్తోంది. చైనా, భారత్, అమెరికాలతో పాటు బ్రెజిల్ లో సైతం సోనీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు క్షీణించాయి.
సీఏజీఆర్(కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు) స్మార్ట్ ఫోన్ వృద్ధి ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని సోనీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎక్కడైతే పుష్టికరమైన పరపతి ఉండి, లాభాలను మెరుగుపరుచుకోగలదో ఆ ప్రాంతాల్లో మాత్రమే సోనీ ఇక ఫోకస్ చేయనుంది. ఉత్పత్తుల బేధంతో వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని, అధిక ఆధారిత విలువ విభాగాల్లో ఎక్కువగా ఫోకస్ చేయాలని కంపెనీ భావిస్తున్నట్టు రిపోర్టుల్లో వెల్లడైంది. ఆసియా(జపాన్ తో కలిపి), యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు రిపోర్టులు వెల్లడించాయి. అదేవిధంగా లాటిన్ అమెరికా, ఇతర ఆసియా పసిఫిక్ దేశాల్లో నమోదయ్యే స్థిరమైన వృద్ధిని అలాగే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోనీ ముందటి ఫ్లాగ్ షిప్ ఎక్స్ పీరియా జడ్ సీరిస్ లను రిప్లేస్ చేస్తూ ఎక్స్ పీరియా ఎక్స్ సీరిస్ మొబైల్స్ ఈ ఏడాది మొదట్లో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.