అప్పులు చెల్లించలేక రైతు ఆత్మహత్య
నగలు అమ్మి వడ్డీ చెల్లింపు
భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
తంబళ్లపల్లె: అప్పుల బాధ తాళలేక చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో ఆదివారం ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని దేవరపల్లెకు చెందిన వి.కృష్ణప్ప(47)కు మూడెకరాల పొలం ఉంది. భార్య మల్లమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లల్ని బురకాయల కోటలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు. కృష్ణప్ప ఏడాదిన్నర క్రితం నలుగురు ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.నూటికి పది రూపాయల వడ్డీకి రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఈ మొత్తంతో టమాట పంట వేశాడు. అప్పట్లో ధర పతనమవడంతో పెట్టుబడి సైతం చేతికి అందక తీవ్రంగా నష్టపోయాడు. చేసేది లేక వ్యవసాయాన్ని పక్కనబెట్టి ఐదు నెలలుగా భార్యతో కలిసి బురకాయలకోటలోని ఓ ప్రైవేటు నర్సరీలో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రుణదాతలు అప్పు చెల్లించమని ఒత్తిడి చేయడంతో శనివారం భార్య నగలు అమ్మి రూ.లక్ష వడ్డీ చెల్లించాడు. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ రాత్రి మల్లమ్మ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణప్ప నర్సరీ వెనుక వైపునకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఈశ్వరయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.