పండుగవేళ.. రాష్ట్రమంతా కరువు!
తమ రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో విలవిల్లాడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ఆయన ప్రకటించారు. దక్షిణాది వారికి, అందునా తమిళులకు అత్యంత ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి సమయంలో ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. తీవ్రమైన నీటి కొరత కారణంగా.. రైతులకు భూమిపన్నును మినహాయిస్తున్నట్లు చెప్పడంతో పాటు పలు రాయితీలు కూడా ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ. 160 కోట్లు, పల్లెల్లో సాగునీటి కోసం రూ. 350 కోట్లను విడుదల చేశారు.
ప్రధానంగా కర్ణాటకతో కావేరీ జలాల వివాదం కారణంగా తమిళనాడుకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. తాగు, సాగునీటి కోసం తమిళులు అల్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా కూడా ప్రకటించడంతో కావేరీ జలాల కోసం మరింతగా కర్ణాటకను పట్టుబట్టే అవకాశం ఏర్పడింది. తమిళనాడుకు ఇప్పటికే కర్ణాటక నుంచి రోజుకు 2వేల క్యూసెక్కుల కావేరీ జలాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక ఈ నీటిని వదులుతోంది.