ఈ-రిక్షాలపై నిషేధాన్ని ఎత్తివేయండి
న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ బీజేపీ, ఆప్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం గడ్కరీతో సమావేశమైంది. ఈ-రిక్షాలు నడుపుకునేవారి ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్తమమైన విధివిధానాలను రూపొందించాలని వారు గడ్కరీని కోరారు. ఈ-రిక్షాల విధివిధానాల రూపకల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు పదిరోజుల్లోగా ఇవ్వాల్సిందిగా కోరుతూ రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తాము నిషేధాన్ని రద్దు చేయాలని కోరామని, రిక్షాలు నడుపుకునేవారికి ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించినట్లు చెప్పామని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు. ‘నగరంలో వేలమంది రిక్షా కార్మికులను కలిసి అభిప్రాయాలు సేకరించాం. వారి కష్టాల గురించి విన్న తర్వాత నిషేధం విధిస్తే కార్మికుల కుటుంబాలు ఆకలితో అలమటిస్తాయనే విషయాన్ని గుర్తించాం. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి గడ్కరీతో చెప్పామ’ని ఉపాధ్యాయ తెలిపారు. ఈ విషయమై గడ్కరీ మాట్లాడుతూ.. మరో పదిరోజుల్లో ఈ-రిక్షాలకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.